ఆహా.. ఆక్వా హబ్‌లు!

11 Aug, 2021 04:13 IST|Sakshi
కృష్ణా జిల్లా పెనమలూరు వద్ద ప్రారంభానికి సిద్ధమైన ఆక్వా హబ్‌

తొలిసారిగా ‘సర్టిఫై’ చేసిన మత్స్య ఉత్పత్తులు

‘ఫిష్‌ ఆంధ్రా’ పేరిట విక్రయాలు

స్విగ్గీ తరహాలో ఆన్‌లైన్‌లో అమ్మకాలు

కూరగాయల్లాగే ప్రత్యేక వాహనాల్లో వినియోగదారుల వద్దకు

సెప్టెంబర్‌ మొదటి వారంలో పెనమలూరు, పులివెందుల ఆక్వాహబ్‌లు ప్రారంభం

సాక్షి, అమరావతి: మత్స్య ఉత్పత్తుల వినియోగాన్ని పెంచి ప్రజలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోన్న ఆక్వా హబ్‌లు సిద్ధమవుతున్నాయి. దేశంలో తొలిసారిగా సర్టిఫై చేసిన మత్స్య ఉత్పత్తులను ‘ఫిష్‌ ఆంధ్రా’ పేరిట వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నారు. బతికి ఉన్న చేపలే కాదు.. ఐస్‌లో భద్రపర్చిన ఫ్రెష్‌ ఫిష్‌తో పాటు దేశంలోనే తొలిసారిగా వ్యాక్యూమ్‌ ప్యాక్డ్‌ ఫిష్‌లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. కూరగాయలు, చికెన్‌ మాదిరిగా అన్ని వేళల్లో అన్ని రకాల మత్స్య ఉత్పత్తులు తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి.  దేశంలో తొలిసారిగా చేపలు, రొయ్యల పచ్చళ్లతోపాటు నేరుగా వండుకునేందుకు మసాలాతో దట్టించి చేసిన మత్స్య ఉత్పత్తులను కూడా అందించబోతున్నారు.

వంద ఆక్వా హబ్‌లు..
ఏటా దాదాపు 46.23 లక్షల మెట్రిక్‌ టన్నుల మత్స్య ఉత్పత్తులతో దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న ఏపీలో వార్షిక తలసరి వినియోగం కేవలం 8.07 కిలోలు మాత్రమే ఉంది. స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యంగా 2022 కల్లా రాష్ట్రవ్యాప్తంగా వంద ఆక్వా హబ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. తొలి విడతగా డిసెంబర్‌ నెలాఖరులోగా రూ.325.15 కోట్లతో 25 హబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. పైలెట్‌ ప్రాజెక్టుగా పులివెందులతో పాటు పెనమలూరులో ఏర్పాటు చేస్తోన్న హబ్‌లను సెప్టెంబర్‌ మొదటి వారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

హబ్‌ల్లో ప్రత్యేకతలెన్నో
హబ్‌ల్లో 20 టన్నుల సామర్థ్యంతో ప్రాసెసింగ్‌ యూనిట్, 3 టన్నుల సామర్థ్యంలో చిల్డ్, కోల్డ్‌ స్టోరేజీలు, టన్ను సామర్థ్యంతో 2 లైప్‌ ఫిష్‌ ట్యాంకులు ఏర్పాటు చేస్తారు. ఆక్వా, సముద్ర ఉత్పత్తులను సేకరించే ముందు తొలుత శాంపిళ్లను ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా ల్యాబ్స్‌కు పంపి పరీక్షించిన తర్వాత హబ్, రిటైల్‌ అవుటలెట్స్‌కు తరలిస్తారు. హబ్‌ల్లో కోల్డ్‌ చైన్‌ సప్లై సిస్టమ్‌ ద్వారా చేపలు, రొయ్యలను వృథా కాకుండా కట్‌ చేసి కనీసం వారం రోజుల పాటు నిల్వచేసే విధంగా వ్యాక్యూమ్డ్‌ ప్యాకింగ్‌ చేస్తారు. వాటిని రోటోమోల్డెడ్‌ ఐస్‌ బాక్సుల్లో రిటైల్‌ అవుట్‌లెట్స్‌కు సరఫరా చేస్తారు. నేరుగా వండుకునేందుకు వీలుగా మసాలాలు దట్టించిన ఉత్పత్తులను ఇక్కడ నుంచి అవుట్‌లెట్స్‌కు సరఫరా చేస్తారు. బతికి ఉన్న చేపలను చెరువుల నుంచి హబ్‌లతో పాటు రిటైల్‌ అవుట్‌లెట్స్‌కు సరఫరా చేస్తారు.

రెస్టారెంట్‌ మాదిరిగా ..
హబ్‌కు అనుబంధంగా పట్టణ ప్రాంతాల్లో మార్కెటింగ్‌కు అవకాశం ఉన్న ప్రదేశాల్లో సర్వే చేసి డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లో వాల్యూయాడెడ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ బతికున్న చేపలతో పాటు రోటోమోల్డెడ్‌ ఐస్‌ బాక్సుల్లో వేస్ట్‌ లేకుండా కట్‌ చేసిన చేపలు(ఫ్రెష్‌ ఫిష్‌)లతో పాటు ఫ్రోజెన్‌ ఫిష్, మ్యారినెట్‌ చేసిన చేపలను కూడా అందుబాటులో ఉంచుతారు. రెస్టారెంట్‌ మాదిరిగా ఓ వైపు డైనింగ్‌ ఫెసిలిటీ కల్పిస్తారు. తమకు నచ్చిన చేపలను కోరుకున్నట్లుగా వండుకుని తినే అవకాశం కల్పిస్తారు. ఇక్కడ నుంచి నేరుగా బతికున్న చేపలతో పాటు మ్యార్నెట్‌ చేసిన వాటిని తీసుకెళ్లే సదుపాయం ఉంటుంది.

లైవ్‌ ఫిష్‌ యూనిట్లలో బతికున్న చేపలను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే డోర్‌ డెలివరీ చేస్తారు. ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసే కియోస్క్‌లో కూడా తక్కువ సామర్థ్యంతో లైవ్‌షిఫ్‌ను అందుబాటులో ఉంచుతారు. మొబైల్‌ ఫిష్‌ వెండింగ్‌ ఫుడ్‌ కోర్టుల్లో తినేందుకు వీలుగా చేపలు, రొయ్యలతో తయారైన స్నాక్స్‌ అందుబాటులో ఉంచుతారు. ఈ– కార్ట్స్‌ ద్వారా కూరగాయల మాదిరిగా తాజా నాణ్యమైన చేపలను ప్రజలకు ఇళ్ల వద్దే విక్రయిస్తారు. సచివాలయానికొకటి చొప్పున ఏర్పాటు చేస్తున్న మినీ రిటైల్‌ అవుట్‌లెట్స్‌ ద్వారా ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు అందుబాటులో ఉంచుతారు. ఈ అవుట్‌లెట్స్‌ ద్వారా డోర్‌ డెలివరీ చేస్తారు. ఈ కామర్స్‌ సిస్టమ్‌ ద్వారా ప్రతీ వినియోగదారుడి నుంచి అభిప్రాయాలు సేకరించి అందుకు తగ్గట్టుగా మత్స్య ఉత్పత్తులను సరఫరా చేస్తారు. 

సచివాలయానికో మినీ రిటైల్‌ అవుట్‌లెట్‌
నాలుగు వేల చదరపు అడుగుల వీస్తీర్ణంలో రూ.1.67 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఆక్వా హబ్‌లకు అనుబంధంగా ప్రతి హబ్‌ పరిధిలో రూ.50 లక్షల ఖర్చుతో వ్యాల్యూ యాడెడ్‌ యూనిట్, రూ.20 లక్షల అంచనాతో ఐదు లైవ్‌ ఫిష్‌ యూనిట్‌లు, రూ.10 లక్షల వ్యయంతో 8 ఫిష్‌ కియోస్క్‌లు, రూ.10 లక్షలతో మొబైల్‌ ఫిష్‌ వెండింగ్‌ ఫుడ్‌ కోర్టులు, బజార్లలో విక్రయించేందుకు రూ.3 లక్షల అంచనాతో 10 ఎలక్ట్రికల్‌ ఈ కార్ట్స్‌ వాహనాలు ఏర్పాటు చేస్తారు. ఇక హబ్‌కు అనుబంధంగా సచివాలయానికి ఒకటి చొప్పున ఒక్కొక్కటి రూ.1.45 లక్షల అంచనా వ్యయంతో 100–120 మినీ రిటైల్‌ అవుట్‌లెట్స్‌ ఏర్పాటు చేస్తారు. 

మరిన్ని వార్తలు