చేపలు, రొయ్యలు, పీతలు.. ఇక మన దరికే ‘మీనం’!

5 Sep, 2021 12:33 IST|Sakshi

చేపల తలసరి వినియోగాన్ని పెంచేందుకు మత్స్యశాఖ చర్యలు

శ్రీకాకుళం జిల్లాలో ఆక్వా హబ్‌లు, ఫిష్‌ వెండింగ్, రిటైల్‌ యూనిట్ల ఏర్పాటు

మొత్తం 300 యూనిట్ల లక్ష్యంగా రూ.7.34 కోట్లు మంజూరు

ఆ వారానికి చేపల నుంచి పీతల మీదకు మనసు మళ్లింది. కానీ ఎలా..? అన్ని ఏరియాల్లో అవి దొరకవే. కొందరికి కంచంలో కారంగా రొయ్యలు కనిపిస్తే గానీ ఆ వీకెండ్‌ పూర్తవదు. ఏం లాభం..? ఉదయాన్నే మార్కెట్‌పై పడితే గానీ పని జరగదు. అలా కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏవి కావాలంటే అవి దొరికేలా.. మన చెంతనే మీనాల జాతర జరిగితే..? కానాగార్తల నుంచి ఖరీదైన పీతల వరకు అన్నీ మనకు సమీపంలోనే విక్రయిస్తే..? సగటు మనిషి జిహ్వ‘చేప’ల్యం తీరుతుంది కదా. సర్కారు అదే పనిలో ఉంది. అటు మత్స్యకారులకు లాభం కలిగేలా..  ఇటు చేపల వినియోగం మరింత పెరిగేలా ప్రత్యేక యూనిట్లను మంజూరు చేసి రాయితీ నిధులు కూడా కేటాయించింది.  

సాక్షి, శ్రీకాకుళం: జనాలకు మత్స్య సంపదను మరింతగా చేరువ చేసేందుకు, మత్స్యకారుల విక్రయాలు ఇంకా పెరిగేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధమయ్యాయి. తోపుడు బళ్లపై కూరగాయలు, పండ్లు విక్రయించినట్టు.. భవిష్యత్‌లో జల పుష్పాలను కూడా జనాలకు చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. చేపలు, రొయ్యిలు, పీతలు కూడా స్వచ్ఛంగా నాణ్యతతో ప్రజల చెంత ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. మత్స్య ఉత్పత్తుల తలసరి వినియోగాన్ని పెంచేందుకు సరికొత్త పథకాలను రూపొందించింది. 

నూతనంగా ఆక్వా హబ్‌లు, ఫిష్‌ కియోస్క్‌లు, రిటైల్‌ ఔట్‌ లెట్లు, లైవ్‌ ఫిష్‌ వెండింగ్‌ సెంటర్లు, ఫిష్‌ వెండింగ్‌ కం ఫుడ్‌ కార్ట్‌లు, ఈ–రిక్షాలు, వ్యాల్యూ యాడెడ్‌ యూనిట్లు ఏర్పాటు చేయడానికి సర్కారు ఇప్పటికే చర్యలు చేపట్టింది. స్వయం ఉపాధిని కోరుకుంటున్న వారి కోసం ప్రత్యేక రాయితీలతో పథకాలను అమలు చేయనున్నారు. అందుకోసం సమీప గ్రామ/వార్డు సచివాలయాల్లో విలేజ్‌ ఫిషరీస్‌ అసిస్టెంట్స్‌ ద్వారా ఆన్‌లైన్‌ ద్వారా ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తులను కూడా ఆహ్వానించింది.  
చదవండి: అయ్యో పాపం..  టీవీ మీద పడటంతో చిన్నారి మృతి  

శ్రీకాకుళం జిల్లాలో రూ.7.34 కోట్లతో 300 యూనిట్లు.. 
♦ అన్ని రంగాలపై పడినట్టే కోవిడ్‌ ప్రభావం మత్స్య సంపదపై కూడా పడింది.  
♦దీంతో అటు గంగపుత్రులను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి, జనాలకు మత్స్య సంపదను చేరువ చేసేందుకు ప్రధాన మంత్రి సంపద యోజన పథకం (పీఎంఎంఎస్‌వై) కింద 300 యూనిట్లు మంజూరయ్యాయి.  
♦ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసే క్రమంలో జిల్లాలో లబ్దిదారుల దరఖాస్తులను పరిశీలించి పథకాల అమలుకు చర్యలు చేపట్టింది.  
♦ ఇందుకోసం సుమారు 13 విభాగాల యూనిట్లను సిద్ధం చేసి, బీసీ (జనరల్‌) కేటగిరీకి 40 శాతం, ఎస్సీ, ఎస్టీ, మహిళా కేటగిరీలకు 60 శాతం రాయితీలను కల్పించేలా చర్యలు చేపడుతోంది.  
♦జిల్లాలో రాయితీల కోసం రూ.7.34 కోట్లు మంజూరు చేసింది. ఈ పథకాలతో జిల్లాలో ఉన్న 11 మండలాల తీర ప్రాంతాల నుంచి వస్తున్న మత్ప్య ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యాలు కల్పించాలని భావించిన రాష్ట్ర మత్స్య శాఖ ఈ మేరకు జిల్లాలో దాదాపుగా అన్ని యూనిట్లను ఏర్పాటు చేసి లక్ష్యాన్ని సాధించాలని చర్యలు చేపట్టింది. 
♦అలాగే జిల్లా కేంద్రంలో ఒక ఆక్వా హబ్‌ను కూడా రూ.1.85 కోట్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం స్థల సేకరణ పనులు జరుగుతున్నాయి. 
చదవండి: ఇన్నాళ్లు ఎక్కడున్నావయ్యా.. భర్తను చూడగానే..

తలసరి వినియోగం పెంచేందుకే 
చేపల తలసరి వినియోగం పెంచేందుకు మత్స్యశాఖలో ఈ పథకాలను అమలు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా జిల్లాలో 300 యూనిట్లు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే 50 శాతం నిధులు విడుదలయ్యాయి. సచివాలయాల్లో నవ శకంలో భాగంగా ఆసక్తి ఉన్న వారు ఈ పథకాల్లో లబ్దిదారులుగా తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకోవచ్చు. వివరాలకు 9346007766 నంబర్‌ను సంప్రదించవచ్చును.
– ఎం.షణ్ముఖరావు,జిల్లా ప్రోగ్రాం మేనేజర్, శ్రీకాకుళం  

మరిన్ని వార్తలు