రొయ్యో.. అయ్యయ్యో.. భారీగా ధర పతనం!

1 Oct, 2022 19:44 IST|Sakshi
వైట్‌స్పాట్‌ వ్యాధితో చనిపోతుండటంతో కాజులూరులో తక్కువ సైజులోనే రొయ్యలను పట్టుబడి చేస్తున్న రైతులు

వర్షాలతో వ్యాధులు.. తేలిపోతున్న రొయ్యలు

తక్కువ కౌంట్‌లోనే తప్పని పట్టుబడి

అదును చూసుకుని ధర తగ్గించేసిన కంపెనీలు

రైతుల గగ్గోలు

కాజులూరు(కాకినాడ జిల్లా): రొయ్యల ధరలు అమాంతం పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో రొయ్యల సాగు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. చెరువుల్లో ఆక్సిజన్‌ స్థాయిని పెంచేందుకు ఏరియేటర్లు పెడుతూ.. అవసరమైన మందులు వాడుతూ రైతులు రొయ్యల సాగును ముందుకు నెట్టుకొస్తున్నారు. ఏదో ఒకవిధంగా కనీసం 30 కౌంట్‌ వరకూ అయినా రొయ్యలను పెంచితే గత ఏడాది నష్టాలను పూడ్చుకోవచ్చని భావిస్తున్నారు. అయితే వరుసగా కురుస్తున్న వర్షాలకు వాతావరణంలో ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. దీంతో వైట్‌స్పాట్, రెడ్‌గ్రిల్‌ వంటి వ్యాధులకు గురై చెరువుల్లో రొయ్యలు తేలిపోతున్నాయి. 


దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు 150, 120 100, 90 వంటి తక్కువ కౌంట్‌లోనే పట్టుబడి పట్టాల్సి వస్తోంది. ఇదే అదునుగా కంపెనీలు ధరను అమాంతం తగ్గించేశాయి. వారం క్రితం 100 కౌంట్‌ ధర రూ.270 ఉండగా ప్రస్తుతం రూ.210కి మించి రావడం లేదు. దీనికి తోడు పట్టుబడి పట్టిన రొయ్యలు పీలింగ్, గుళ్లకొట్టులో ఉన్నాయంటూ నాణ్యత లోపం పేరుతో మరికొంత కోత విధిస్తున్నారు. ఎకరం చెరువులో సగటున రెండు టన్నుల దిగుబడి వస్తే కేజీకి రూ.60 చొప్పున రూ.1.20 లక్షల వరకూ రైతు నష్టపోవాల్సి వస్తోంది. 

తగ్గిపోయిన ధర రూపంలో కష్టార్జితమంతా కోల్పోతున్నామని వారు వాపోతున్నారు. ఈక్వెడార్‌ వంటి దేశాల నుంచి ప్రస్తుతం రొయ్యల ఉత్పత్తి ఎక్కువగా జరుగుతూండటంతో ఇక్కడి రొయ్యలకు డిమాండ్‌ తగ్గి, ధర పడిపోతోందని కొనుగోలుదారులు చెబుతున్నారు. అయితే అది వాస్తవం కాదని, వాతావరణ మార్పులతో వ్యాధులు సోకి రొయ్యలు చనిపోతుండటంతో అందరూ ఒకేసారి పట్టుబడి పట్టాల్సి వస్తోందని, ఒకేసారి పెద్ద మొత్తంలో సరుకు రావడంతో కంపెనీలు ధర తగ్గించేస్తున్నాయని ఆక్వా నిపుణులు విశ్లేషిస్తున్నారు. 


అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు జరిగే ఆక్వా మార్కెట్‌కు ఆ స్థాయిలో డిమాండ్, ద్రవ్యోల్బణం, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ధరల హెచ్చుతగ్గులుంటాయని.. అయితే స్థానిక కంపెనీలన్నీ సిండికేటుగా మారి సరుకు ఎక్కువగా వచ్చే సమయానికి ధరలు తగ్గించేస్తున్నారని రైతులు వాపోతున్నారు. మేతలు, మందుల ధరలు రోజురోజుకూ పెరిగిపోతుండగా పట్టుబడి సమయానికి రొయ్యల ధరలు తగ్గిపోతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని, ధరలను ప్రభుత్వం స్థిరీకరించాలని కోరుతున్నారు. 

అదును చూసుకుని..
రైతుల నుంచి ఒకేసారి సరకు వస్తుంటే కంపెనీలన్నీ ఏకమై ధర తగ్గించేస్తున్నాయి. వ్యాధుల బారిన పడి చెరువుల్లో రొయ్యలు తేలిపోతుండటంతో తక్కువ కౌంట్‌లోనే పట్టుబడి పట్టాల్సి వస్తోంది. రొయ్య కేజీ 150 కౌంట్‌ కంటే చిన్నదిగా ఉంటే కంపెనీలు కొనటం లేదు. డైలీ మార్కెట్‌లో కేజీ రూ.50కి అమ్ముకోవాల్సి వస్తోంది. 
– పిల్లి కృష్ణమూర్తి ఆక్వా రైతు, కుయ్యేరు 

ఇలాగే ఉంటే సాగు కష్టమే 
మేత, ఇతర ఖర్చులు పెరుగుతుంటే రొయ్యల ధరలు మాత్రం తగ్గుతున్నాయి. పైగా పంట చేతికొచ్చే సమయంలో ధరలు పడిపోతున్నాయి. దీంతో నికర ఆదాయం తగ్గి రైతులు నష్టాల బారిన పడుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో ఆక్వా సాగు ప్రశ్నార్థకమే. 
– వీరవల్లి గణపతి, ఆక్వా ట్రైనీ టెక్నీషియన్, గొల్లపాలెం

మరిన్ని వార్తలు