టూరిజం 2.0’.. అరకు, గండికోట

23 Jan, 2023 14:08 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకు–లంబసింగి సర్క్యూట్, గ్రాండ్‌ కాన్యన్‌ ఆఫ్‌ ఇండియాగా పిలిచే గండికోట ప్రాంతాలు అంతర్జాతీయ పర్యాటక ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సుమారు రూ.150 కోట్లకు పైగా అంచనాలతో మౌలిక వసతులను మెరుగుపర్చుకోనున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ‘స్వదేశీ దర్శన్‌–2.0’ పథకం కింద దేశంలోని 36 పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేసింది.

ఇందులో అరకు–లంబసింగి సర్క్యూట్, గండికోట పర్యాటక ప్రదేశాలకు చోటు కల్పించింది. త్వరలోనే పనులు ప్రారంభించేలా కేంద్ర పర్యాటక శాఖ ప్రాజెక్టు డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌ల కోసం ఆర్‌ఎఫ్‌పీలను సైతం ఆహ్వానించింది. రాష్ట్ర పర్యాటక శాఖకు ప్రాజెక్టు అమలు బాధ్యతలను అప్పగించి సమయానుకూలంగా పూర్తి చేసేందుకు మార్గదర్శకాలను రూపొందించింది. స్థానిక సంస్కృతికి, పౌర సమాజ స్థితిగతులను మెరుగుపర్చేలా ప్రణాళికలను సిద్ధం చేసింది. 

2.0తో అందుబాటులోకి అధునాతన వసతులు 
2.0 ప్రణాళికల ద్వారా పర్యాటక సామర్థ్యాన్ని పెంచేలా ఈ రెండు ప్రాంతాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేయనున్నాయి. పర్యాటక,  వారసత్వ సంపద పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాయి. పర్యాటకుల కోసం వాచ్‌ టవర్లు, రిసార్టులు, వసతి గదులు, కన్వెన్షన్‌ సెంటర్లు, అడ్వెంచర్‌ క్రీడలు, గోల్ఫ్‌ కోర్సులు, యాంపీ థియేటర్లు, సాంస్కృతిక భవనాలు, సౌండ్‌ లైట్‌ షోలను అందుబాటులోకి తీసుకురానున్నాయి.

స్థానిక కళాకారులు, చేతివృత్తి కార్మికుల జీవన ప్రమాణాలు పెంచేలా వారి కోసం ప్రత్యేక దుకాణ సముదాయాలను నిర్మించనున్నాయి. ఎకో ఫ్రెండ్లీ ట్రాన్స్‌పోర్టు, రహదారి సౌకర్యం, ల్యాండ్‌ స్కేప్, డిజిటల్‌ టెక్నాలజీ, స్థానిక కాలనీల్లో మౌలిక వసతులు కల్పించనున్నాయి. 

పర్యాటకుల ‘క్యూ’ 
అరకు లోయలో ఏపీ పర్యాటక సంస్థ 4 రిసార్టులను నిర్వహిస్తోంది. మయూరిలో 80, అరకు వేలీలో 58, అనంతగిరిలో 30, టైడా రిసార్టులో 23 గదులను అందుబాటులో ఉంచింది. ఇటీవల లంబసింగిలో సైతం 11 కొత్త కాటేజీలను నిర్మిచింది. మరోవైపు విశాఖపట్నం నుంచి ప్రత్యేక ప్యాకేజీ టూర్లను నడుపుతోంది. అరకుతో పాటు బొర్రా గుహలు, వంజంగి, కొత్తపల్లి జలపాతాలు, పాడేరు పరిసర ప్రాంతాలను పర్యాటకులు వీక్షించేలా చర్యలు చేపట్టింది.

కాగా, కడప జిల్లాలోని గండికోటకు విశిష్ట చారిత్రక నేపథ్యంతో పాటు అమెరికాలోని గ్రాండ్‌ కాన్యన్‌ తరహాలో కొండలను చీల్చుకుంటూ ప్రవహించే పెన్నా నది ఒంపులు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. ఇక్కడికి వారాంతాల్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి పర్యాటకులు తరలి వస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా ఇందులో వాయు, జల, భూమిపై చేసే సాహస క్రీడల అకాడమీని నెలకొల్పారు. మరోవైపు 4వేల ఎకరాల్లో గండికోట ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతో పాటు యువతకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ హోటల్‌ రంగ సంస్థ ఒబెరాయ్‌ను సైతం తీసుకొస్తోంది.

(చదవండి: AP: జీవో నెం.1పై హైకోర్టులో విచారణ.. చీఫ్‌ జస్టిస్‌ కీలక వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు