Visakha Agency: వలిసెల సోయగం  విలసిల్లేలా..

24 Apr, 2021 13:41 IST|Sakshi
అరకులో పర్యాటకులకు కనువిందు చేస్తున్న వలిసె పూలతోట 

విశాఖ మన్యంలో వలిసె పూల తోటలకు పూర్వ వైభవం తెచ్చేందుకు శాస్త్రవేత్తల కృషి

రెండు దశాబ్దాల్లో నాలుగో వంతుకు పడిపోయిన సాగు విస్తీర్ణం

తేనె సేకరణపైనా తీవ్ర ప్రభావం

అధిక దిగుబడినిచ్చే  విత్తనాల అభివృద్ధికి చింతపల్లి పరిశోధన కేంద్రం ప్రయత్నాలు 

సాక్షి, విశాఖపట్నం: మంచు తెరల మధ్య పసుపు వర్ణంతో మెరిసిపోయే వలిసె పూలు ప్రకృతి కాంతకు స్వర్ణ కాంతులద్దుతాయి. విశాఖ మన్యానికొచ్చే పర్యాటకుల మనసులను ఇట్టే దోచుకుంటాయి. ఏటవాలు కొండ ప్రాంతాల నడుమ చల్లని వాతావరణంలో పెరిగే వలిసె తోటలు కొన్నేళ్లుగా కనుమరుగవుతున్నాయి. గిరిజన రైతుల సంప్రదాయ పంట అయిన వలిసెల సాగు రెండు దశాబ్దాల్లో నాలుగో వంతుకు పడిపోయింది. అత్యధికంగా తేనె ఉండే వలిసె పూల సాగు తగ్గడంతో తేనెటీగలకు కష్టకాలం వచ్చింది. తేనె సేకరణపైనా తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వలిసె తోటలకు పూర్వ వైభవం తెచ్చేందుకు చింతపల్లిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పరిశోధనలు చేపట్టింది.

వలిసె తోటల మాతృ ప్రదేశం ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా. వందల ఏళ్ల క్రితమే మన్యంలోకి వచ్చి గిరిజనుల సంప్రదాయ పంటగా మారింది. విశాఖ మన్యంలోని అరుకు లోయ, పాడేరు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ, అనంతగిరి, జి.మాడుగుల, చింతపల్లి ప్రాంతాలతోపాటు విజయనగరం జిల్లాలోని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, పాచిపెంట, శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట, తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం పరిసర ప్రాంతాల్లో వలిసెల సాగు ఉండేది. తర్వాత కాలంలో విశాఖ మన్యానికే పరిమితమైంది. ఇక్కడ కూడా వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం 2003–04లో 16 వేల హెక్టార్లకు పరిమితమైన వలిసెల సాగు క్రమేపీ తగ్గుతూ 2020–21 నాటికి 3,695 హెక్టార్లకు పడిపోయింది. 

వలిసె ఉపయోగాలివీ.. 
వలిసె పూలలో తేనె అధికంగా ఉంటుంది. తోటల్లో ఎకరానికి వంద చొప్పున తేనె పెట్టెల చొప్పున ఉంచి తేనెటీగల సాయంతో గిరిజనులు తేనెను సేకరిస్తారు. ఒక్కో పెట్టె నుంచి 35–40 కిలోల చొప్పున తేనె దిగుబడి వస్తుంది. వలిసె గింజల నుంచి వంటనూనె తీస్తారు. దీనిని గిరిజనులు ఇళ్లల్లో వినియోగిస్తుంటారు. ఈ నూనెను కాస్మొటిక్స్, పెయింటింగ్స్‌ తయారీలోనూ వినియోగిస్తున్నారు. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే వలిసె గింజలను కోళ్లు, పక్షుల దాణా తయారీలోనూ మిశ్రమంగా వాడతారు. 


తగ్గిపోవడానికి కారణాలు 
విశాఖ మన్యంలో నీరు నిలవని ఏటవాలు కొండ ప్రాంతాలు, చల్లని వాతావరణం వలిసెల సాగుకు అత్యంత అనుకూలం. పరిమాణం, రంగు, సాగు కాలంలో తేడాను బట్టి 30 రకాల వరకూ ఉన్నాయి. వలిసె గింజల దిగుబడులు తగ్గిపోవడం, రైతులకు పెద్దగా గిట్టుబాటు కాకపోవడం, భూసారం తగ్గడం వంటి పరిస్థితులు వలిసె తోటల సాగు తగ్గడానికి కారణమయ్యాయి. ఎకరాకు రెండు నుంచి మూడు క్వింటాళ్లకు మించి వలిసె గింజల దిగుబడి రావడం లేదు. ఆకాశ పందిరి, బంగారు తీగ అనే కలుపు మొక్కలను నిరోధించడం కష్టమవుతోంది. గిరిజన రైతులు వలిసె విత్తనాలను తామే తయారుచేసుకోవడం వల్ల నాణ్యత లోపించి పంట దెబ్బతిని దిగుబడులు పెద్దగా ఉండటం లేదు. దీంతో వారంతా ప్రత్యామ్నాయ ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపడంతో సాగు విస్తీర్ణం క్రమేపీ తగ్గిపోయింది. 

పూర్వ వైభవానికి కృషి 
ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ ఎ.విష్ణువర్దన్‌రెడ్డి గతంలో భారతీయ నూనెగింజల పరిశోధన కేంద్రం (ఐఐవోఆర్‌) డైరెక్టర్‌గా ఉన్నప్పుడు వలిసెలకు పూర్వ వైభవం తేవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన చొరవతో వలిసెలపై చింతపల్లిలో నాలుగేళ్ల పరిశోధన ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.69 లక్షలు మంజూరు చేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో సాగవుతున్న 1,800 రకాల వలిసెల మూల విత్తనాలను న్యూఢిల్లీలోని నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ప్లాంట్‌ జెనెటిక్స్‌ రిసోర్సెస్‌ నుంచి చింతపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రానికి తీసుకొచ్చారు.


మన్యంలో వాతావరణ, భౌగోళిక పరిస్థితులకు అనువైన, వివిధ తెగుళ్లను తట్టుకొని స్వల్ప కాలంలో అధిక దిగుబడిని ఇచ్చే మేలు రకం విత్తనాలను ఇక్కడి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. మరోవైపు పాడేరు ఐటీడీఏతో పాటు సంజీవని స్వచ్ఛంద సంస్థ గిరిజన రైతులను ప్రోత్సహిస్తోంది. సాగు, సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించడమే గాక టార్పాలిన్‌లు, కోత పరికరాలు అందజేస్తుంది. 

రెండు లాభదాయక రకాల అభివృద్ధి  
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ పరిసర ప్రాంతాల్లో మంచి దిగుబడి ఇస్తున్న జేఎన్‌ఎస్‌–26, జేఎన్‌ఎస్‌–28 రకాల మూల విత్తనాలను తెచ్చాం. మన్యం పరిస్థితులకు అనుగుణంగా ఉండే వీటిని ఇక్కడ అభివృద్ధి చేశాం. ఎకరానికి రెండు కిలోల విత్తనాలు వేస్తే ఆరేడు క్వింటాళ్ల వరకూ దిగుబడి వస్తుంది. ఈ విత్తనాలను ఉచితంగా గిరిజన రైతులకు త్వరలోనే ఇస్తాం. ఇలా కనీసం వంద రకాల మేలు రకం విత్తనాలను అభివృద్ధి చేయాలనేది లక్ష్యం. గిరిజన రైతులను వలిసెల సాగు వైపు అన్నివిధాలా ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నాం. 
– డాక్టర్‌ గుత్తా రామారావు, సహాయ పరిశోధన సంచాలకులు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం

మరిన్ని వార్తలు