‘నాటా’తో ఆర్కిటెక్చర్‌లో ప్రవేశాలు

14 Aug, 2020 10:59 IST|Sakshi

ఈనెల 16 వరకు గడువు పెంపు 

అక్టోబర్‌ చివరినాటికి తరగతులు  

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (బీఆర్క్‌) కోర్సులో ప్రవేశాలకు జాతీయస్థాయిలో నిర్వహించే నేషనల్‌ ఆప్టి ట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఆర్కిటెక్చర్‌ (నాటా) ద్వారా ప్రవేశాలు కల్పించనున్నాం.. ఈఏడాది నిర్వహించే నాటా పరీక్షకు మరో రెండురోజులు (ఆగస్టు 16 వరకు) గడువు ఉందని.. ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకుని 
సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ఆచార్య దురైరాజ్‌ విజయ్‌కిశోర్‌ కోరారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న రాష్ట్రస్థాయి విశ్వవిద్యాలయ పనుల ప్రగతి, ప్రవేశాల ప్రక్రియ గురించి ‘సాక్షి’ పలుకరించగా పలు విషయాలు పంచుకున్నారు. 

వైవీయూ : బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (బీఆర్క్‌) కోర్సులో ప్రవేశాల కోసం నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఆర్కిటెక్చర్‌ (నాటా) ద్వారా వచ్చే ర్యాంకు ఆధారంగా సీటు కేటాయిస్తారు. మన రాష్ట్రంలో 13 జిల్లాల విద్యార్థులు ఇక్కడ సీటును కోరుకోవచ్చు. నాటాకు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో పాటు డిప్లొమా అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష రెండు దఫాలుగా నిర్వహిస్తారు. మొదటి పరీక్ష ఈనెల 29న నిర్వహించనుండగా, రెండోసారి నాటా నిర్వహించే పరీక్ష తేదీలను ఇంకా ప్రకటించలేదు. ఈ యేడాది కోవిడ్‌ నేపథ్యంలో ఇంటి నుంచే వర్చువల్‌ విధానంలో టెస్ట్‌కు హాజరుకావచ్చు. ఇప్పటి వరకు డ్రాయింగ్‌ టెస్ట్‌ సిలబస్‌ స్కిల్స్‌ను పరీక్షించేదిగా ఉండేది.

ప్రస్తుతం దాన్ని అవగాహనను పరీక్షించేదిగా మార్చారు. ఈ విధానంలో అభ్యర్థి బొమ్మలు గీయాల్సిన పనిలేదు. కంప్యూటర్‌ ముందు కూర్చుని సమాధానాలు ఇస్తే సరిపోతుంది. బీ.ఆర్క్‌ కోర్సు చేయడం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో కొలువులు లభిస్తాయి. నవీన నిర్మాణాల్లో ఆర్కిటెక్చర్లు ప్రధాన పాత్ర పోషిస్తారు. దీంతో పాటు ఎంసెట్‌ ర్యాంకు ఆధారంగా బీటెక్‌ ప్లానింగ్, డిజిటల్‌ టెక్నాలజీ, ఫెసిలిటీ ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాం. స్కూల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌లో 5 రకాల కోర్సులు ఉన్నాయి. స్కూల్‌ ఆఫ్‌ ఫైన్‌ఆర్ట్స్‌లో 5 రకాలకోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ ద్వారా సీట్లను భర్తీ చేస్తాం. మొత్తం మీద రెండు విభాగాల్లో కలిపి 500 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిగిన ప్రత్యేక కోర్సులు. వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. 

విశ్వవిద్యాలయ ఏర్పాటు.. పనుల ప్రగతి.. 
2020–21 విద్యాసంవత్సరం నుంచి వైఎస్‌ఆర్‌ ఏఎఫ్‌యూను ప్రారంభించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చక్కటి తోడ్పాటు ఇస్తోంది. ఇందులో భాగంగా జిల్లా ప్రజాప్రతినిధులు విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా అధికారులు సైతం సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. దీంతో కడప నగర పరిధిలోని చలమారెడ్డిపల్లె వద్ద దాదాపు 140 ఎకరాల మేర స్థలాన్ని గుర్తించి అప్పగిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మేము మరో 50 ఎకరాలు కావాలని కోరుతున్నాం. డిసెంబర్‌ నాటికి టెండర్‌ల దశకు వెళ్లి నూతన విశ్వవిద్యాలయాల భవన పనులను ప్రారంభించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని విజయకిశోర్‌ తెలిపారు. 

తరగతుల నిర్వహణ.. ప్రారంభం.. 
కోవిడ్‌–19 నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను అనుసరించి తరగతులు ప్రారంభిస్తాం. బహుశా అక్టోబర్‌ చివరినాటికి తరగతులు ప్రారంభించే అవకాశాలున్నాయి. అత్యుత్తమ బోధకులను తీసుకువచ్చి నాణ్యమైన విద్యను అందిస్తాం. తొలుత తాత్కాలిక భవనాల్లో తరగతులు ప్రారంభిస్తాం. విద్యార్థులకు అంతర్జాతీయస్థాయిలో వసతులు, సౌకర్యాల కల్పన చేస్తాం. దీనికి సంబంధించిన సిలబస్‌ రూపకల్పన, ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. రానున్న రెండు, మూడు సంవత్సరాల్లో శాశ్వత నిర్మాణాలు పూర్తిచేసి శాశ్వత భవనాల్లోకి వెళ్తాం. రానున్న రోజుల్లో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయం రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దుతాం. 

>
మరిన్ని వార్తలు