15 వేల గ్రామ సచివాలయాల్లో ఏఆర్‌సీలు

13 May, 2021 04:43 IST|Sakshi

తొలిదశలో 4,500 ఏఆర్‌సీలను వర్చువల్‌గా ప్రారంభించిన మంత్రి మేకపాటి

ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగంలో పెట్టుబడుల ప్రతిపాదనలపై సమీక్ష

సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాల్లో ఐటీ సంబంధిత విజ్ఞానం పెంచుకునేలా అకడమిక్‌ రిసోర్స్‌ సెంటర్లు (ఏఆర్‌సీ–డిజిటల్‌ లైబ్రరీ) రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలోని 15 వేలకుపైగా గ్రామ సచివాలయాల్లో ఏఆర్‌సీలను ఏర్పాటు చేస్తామని, తొలుత ఇంటర్నెట్‌ అనుసంధానం చేసిన వాటిలో ఏర్పాటు చేస్తున్నామని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు.

తొలిదశలో 4,500 గ్రామ సచివాలయాల్లో వీటిని ఏర్పాటు చేసి మలిదశలో విస్తరించేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఆయన బుధవారం నెల్లూరు నుంచి ఐటీ, ఎలక్ట్రానిక్స్‌శాఖపై వర్చువల్‌ విధానంలో సమీక్షించి, ఏఆర్‌సీలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఏఆర్‌సీల్లో తెలుగు, ఇతర భాషల దినపత్రికలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగానికి చెందిన పుస్తకాలు, జర్నల్స్, డిక్షనరీలను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. అక్కడే పనిచేసుకునేలా 4 వర్క్‌స్టేషన్లు, స్మార్ట్‌ ఆండ్రాయిడ్‌ టీవీ, వీడియో కాన్ఫరెన్స్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.

రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్న సంస్థలు, వాటి ప్రతిపాదనలను ఆ శాఖ ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి మంత్రికి వివరించారు. విశాఖలో ఏర్పాటు చేయదల్చిన డేటా సెంటర్‌కు వచ్చిన 3 ప్రతిపాదనలపై తరువాత సమీక్షించి నిర్ణయం తీసుకుందామని మంత్రి చెప్పారు. ఐటీ శాఖకు సంబంధించిన సమాచారం అంతా అందుబాటులో ఉండేలా పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్సే్ఛంజ్‌ ప్రక్రియను ఆగస్ట్‌ 15లోగా పూర్తిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు