ఎన్నికలతో వలంటీర్లకు సంబంధమే ఉండదు

3 Mar, 2021 05:13 IST|Sakshi

హైకోర్టుకు స్పష్టం చేసిన ప్రభుత్వ న్యాయవాది 

‘వలంటీర్ల’ వ్యవస్థపై దాఖలైన 3 వ్యాజ్యాల్లో ముగిసిన వాదనలు 

నేడు ఉత్తర్వులు 

సాక్షి, అమరావతి:  మున్సిపల్‌ ఎన్నికల్లో వార్డు వలంటీర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకోకుండా చర్యలు తీసుకోవాలన్న ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యంలో మంగళవారం వాదనలు ముగిశాయి. మున్సిపల్‌ ఎన్నికలకు వలంటీర్లను దూరంగా ఉంచేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, వలంటీర్లు అధికార పార్టీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని, అయినా ఎన్నికల కమిషన్‌ స్పందించడం లేదంటూ విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కూడా వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు ఈ మూడు వ్యాజ్యాల్లో బుధవారం ఉత్తర్వులు ఇచ్చేందుకు నిర్ణయించింది. 

ఓటర్‌ స్లిప్పులిచ్చేది బ్లాక్‌ స్థాయి అధికారులే.. 
రాష్ట్ర ప్రభుత్వ వ్యాజ్యంపై ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్‌ వాదనలు వినిపిస్తూ.. వలంటీర్లు ఓటర్‌ స్లిప్పులను పంచుతున్నారన్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. బ్లాక్‌ స్థాయి అధికారులే ఓటర్ల స్లిప్పులను పంపిణీ చేస్తున్నారని, వలంటీర్లకు ఎన్నికలతో సంబంధం ఉండదని చెప్పారు. వలంటీర్ల వద్ద కేవలం తమ పరిధిలో ఉండే వివిధ పథకాల లబ్ధిదారుల వివరాలు మాత్రమే ఉంటాయి తప్ప, పౌరులందరి సమాచారం ఉండదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వలంటీర్లకు మొబైల్‌ ఫోన్లు ఎంతో ముఖ్యమని, వాటిలోనే లబ్ధిదారుల సమాచారం ఉంటుందన్నారు. మొబైల్‌ ఫోన్లు లేకుండా వారు సంక్షేమ పథకాలను అమలు చేయలేరని తెలిపారు. పింఛన్‌ నగదును నేరుగా లబ్ధిదారులకు వలంటీర్లే అందజేస్తున్నారని, మిగిలిన పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని వివరించారు. వలంటీర్ల వ్యవస్థను స్తంభింప చేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదన్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్ల తరఫు న్యాయవాది ఎన్‌.రంగారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల కమిషన్‌ వలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉండాలంటూ ఆదేశాలిచ్చిన నేపథ్యంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యం నిరర్థకం అవుతుందన్నారు. 

ఫిర్యాదులొచ్చాయి కాబట్టే.. 
అంతకుముందు ఎన్నికల కమిషన్‌ తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీ కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. వలంటీర్ల తీరుపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఇతర పార్టీల సానుభూతిపరులకు ఓటర్‌ స్లిప్పులు ఇవ్వడం లేదన్నారు. పౌరుల సమాచారం మొత్తం వలంటీర్ల వద్ద ఉంటుందన్నారు. ఈ సందర్భంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ, వలంటీర్ల వద్ద ఉన్న డేటా దుర్వినియోగం అవుతుందని ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. ప్రతి ప్రభుత్వం వద్ద పౌరుల సమాచారం ఉంటుందని, దాన్నెలా తప్పు పట్టగలమని ప్రశ్నించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి తరఫున న్యాయవాది రాసినేని హరీ‹Ù, ఎమ్మెల్యే రామకృష్ణబాబు తరఫున న్యాయవాది ఎస్‌.ప్రణతి వాదించారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు ఈ మూడు వ్యాజ్యాల్లో బుధవారం ఉత్తర్వులు ఇస్తామని ప్రకటించారు.   

మరిన్ని వార్తలు