బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైవోవర్‌పై ముగిసిన వాదనలు

3 Aug, 2021 05:02 IST|Sakshi

తీర్పును వాయిదా వేసిన హైకోర్టు 

సాక్షి, అమరావతి: విజయవాడ బెంజ్‌సర్కిల్‌ వద్ద రెండో ఫ్లైవోవర్‌ నిర్మాణాన్ని సవాలు చేయడంతో పాటు ఫ్లైవోవర్‌ వెంట సర్వీస్‌ రోడ్డు ఏర్పాటు చేయడం లేదంటూ దాఖలైన వ్యాజ్యాల్లో సోమవారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. బెంజ్‌ సర్కిల్‌ వద్ద రెండో ఫ్లైవోవర్‌ నిర్మాణాన్ని సవాలు చేస్తూ గతేడాది హైకోర్టులో పిల్‌ దాఖలైంది. ఇదే అంశంపై సింగిల్‌ జడ్జిల ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మరో రెండు అప్పీళ్లు దాఖలయ్యాయి.

ఈ వ్యాజ్యాలన్నింటిపై సోమవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వ న్యాయవాది కోనపల్లి నర్సిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘స్లిప్‌’ రోడ్‌ వేసేందుకు నిబంధనలు అంగీకరిస్తున్నాయని చెప్పారు. ఈ రోడ్డు ద్వారా స్థానికులు సులభంగా రాకపోకలు సాగించవచ్చన్నారు. ఫ్లైవోవర్‌ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఎంత మాత్రం లేదని తెలిపారు. అంతకు ముందు పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది వీఎస్‌ఆర్‌ అంజనేయులు వాదనలు వినిపిస్తూ రెండో ఫ్లైవోవర్‌కు పశ్చిమం వైపు 10 మీటర్ల మేర సర్వీస్‌ రోడ్డు ఏర్పాటు చేయడం లేదని, దీని వల్ల ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. జాతీయ రహదారుల సంస్థ తరఫు సీనియర్‌ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ.. సర్వీస్‌ రోడ్డు నిర్మాణం కోసం స్థలం సేకరించి ఇస్తే.. వేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.    

మరిన్ని వార్తలు