ఆత్మకూరు ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి

21 Jun, 2022 07:49 IST|Sakshi

స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకున్నాం

రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా

నెల్లూరు(అర్బన్‌): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా చెప్పారు. సోమవారం ఆయన నెల్లూరు కలెక్టరేట్‌లో నోడల్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ చక్రధర్‌బాబుతో కలిసి మీడియాతో మాట్లాడారు. పోలింగ్‌ కేంద్రాల్లో కనీస వసతులుండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

దివ్యాంగుల కోసం ర్యాంపులు, వీల్‌ చైర్‌లు ఏర్పాటు చేశామన్నారు. 279 పోలింగ్‌ స్టేషన్లలో ఎక్కడైనా సాంకేతిక సమస్య తలెత్తితే వెంటనే సరి చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. దొంగ ఓట్లు పడకుండా.. ఓటర్ల జాబితాలను పోలింగ్‌ స్టేషన్ల వద్ద ప్రదర్శించాలని ఆదేశించినట్లు తెలిపారు. 123 పోలింగ్‌ స్టేషన్లను సమస్యాత్మకమైనవిగా గుర్తించామని.. వాటి వద్ద కట్టుదిట్టమైన భద్రతతో పాటు మైక్రో అబ్జర్వు, వీడియో, వెబ్‌ కాస్టింగ్‌ లైవ్‌ తదితరాలను సిద్ధం చేశామని చెప్పారు.

ఎవరైనా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. వలంటీర్లు కరపత్రాలు పంచినా, ప్రచారం నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జేసీ హరేందిరప్రసాద్, ఎస్పీ విజయరావు, డీఎఫ్‌వో షణ్ముఖకుమార్, మునిసిపల్‌ కమిషనర్‌ జాహ్నవి, ఏఎస్పీ హిమవతి, సెబ్‌ జేడీ శ్రీలక్ష్మి, డీఆర్వో వెంకటనారాయణమ్మ, డీఎంహెచ్‌వో డాక్టర్‌ పెంచలయ్య, డీపీవో ధనలక్ష్మి, డీసీవో తిరుపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు