Jagananna Vidya Kanuka: ఆలస్యానికి ఇక తావుండదు

10 Aug, 2022 04:22 IST|Sakshi

ఏడాది ముందు నుంచే ఏర్పాట్లు 

నాలుగో విడత కోసం వచ్చే వారంలో ప్రణాళిక 

2023 ఏప్రిల్‌ 15 నాటికి స్కూల్‌ పాయింట్లకు కిట్లు 

జూన్‌ మొదటి వారం నుంచే విద్యార్థులకు పంపిణీ  

సాక్షి, అమరావతి: కార్పొరేట్‌ స్కూళ్ల పిల్లలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వనరులు కల్పించడంలో భాగంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘జగనన్న విద్యా కానుక’ (జేవీకే) కిట్ల పంపిణీలో ఆలస్యానికి తావు లేకుండా విద్యా శాఖ చర్యలు చేపట్టింది. పాఠశాలల ప్రారంభానికి ముందే విద్యార్థులకు ఆయా వస్తువులు అందేలా ఏడాది ముందు నుంచే కార్యాచరణ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ఏటా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ కిట్లను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.

పాఠశాలలు జూన్‌ రెండో వారంలో ప్రారంభం కానున్నందున మొదటి వారానికే పిల్లలకు ఈ కిట్లు అందించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్ష. అయితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక.. కరోనా పరిస్థితుల్లో రెండేళ్లుగా అకడమిక్‌ సంవత్సరం అస్తవ్యస్తంగా మారింది. జేవీకే కిట్ల పంపిణీపై కూడా దాని ప్రభావం కొద్దిగా పడుతూ వచ్చింది. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యా కానుక కిట్లలోని వస్తువులను కాంట్రాక్టు కంపెనీలు వాటిని సకాలంలో సరఫరా చేయలేక పోవడంతో పంపిణీ కొంత ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించిన కిట్లలోని వస్తువులపై ప్రభుత్వం ఇప్పటి నుంచే పక్కా కార్యాచరణ చేపట్టింది. ఇందుకు సమగ్ర క్యాలెండర్‌ను రూపొందించింది. ఇందులో భాగంగా ఈ నెల మూడో వారం నుంచే చర్యలు ప్రారంభించనుంది.

పెరుగుతున్న చేరికలతో బడ్జెట్‌ పెంపు
► ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల చేరికలు ఏటేటా పెరుగుతుండడంతో జగనన్న విద్యా కానుక కోసం వెచ్చించే మొత్తాన్ని కూడా ప్రభుత్వం పెంచుతోంది. చదువులకు అవసరమైన అత్యంత నాణ్యమైన వస్తువులు ఇవ్వడమే కాకుండా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టినందున అదనంగా డిక్షనరీలను అందించేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారు.
► ప్రభుత్వం 2020–21లో 42,34,322 మంది విద్యార్థుల కోసం రూ.648.10 కోట్లు, 2021–22లో 45,71,051 మంది కోసం రూ.789.21 కోట్లు వెచ్చించింది. 2022–23 విద్యా సంవత్సరానికి 47,40,421 మందికి లబ్ధి చేకూరేలా రూ.931.02 కోట్లతో జగనన్న విద్యా కానుక వస్తువుల సరఫరా చేపట్టింది. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లలో రూ.2,368.33 కోట్లు వెచ్చించింది.  
► విద్యార్థుల అభ్యసనానికి అవసరమైన అన్ని వనరులను ప్రభుత్వం సమకూరుస్తోంది. ఇందులో భాగంగా.. జగనన్న విద్యా కానుక కింద బడులు తెరిచిన తొలి రోజే ప్రతి విద్యార్థికీ ఉచితంగా 3 జతల యూనిఫాం క్లాత్‌ (కుట్టు కూలి సహా), ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగు, బై లింగ్యువల్‌ (తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో ఉండే) పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్‌తో పాటు అదనంగా 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు ఎస్సీఈఆర్టీ రూపొందించిన సచిత్ర డిక్షనరీలను, 6–10 తరగతుల వారికి ఇంగ్లిష్‌–తెలుగు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలను ఇస్తున్నారు. ఈ డిక్షనరీలను ఆ విద్యా సంవత్సరంలో కొత్తగా చేరిన వారితో పాటు గతంలో అందుకోని వారికి మాత్రమే ఇస్తారు. 
► గత ప్రభుత్వంలో స్కూళ్లు తెరిచి 6–7 నెలలు అయినప్పటికీ యూనిఫారం సంగతి దేవుడెరుగు.. కనీసం పాఠ్య పుస్తకాలు కూడా అందించలేని దుస్థితి. ఇక ఇతర వస్తువుల ఊసేలేదు. ఈ పరిస్థితిని సమూలంగా మారుస్తూ సీఎం జగన్‌ పాఠశాలలు తెరిచే నాటికే జగనన్న విద్యా కానుక కిట్‌లు విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. 
► వస్తువుల నాణ్యతలో రాజీ పడకుండా బ్రాండెడ్‌ వస్తువులనే పంపిణీ చేయించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆయా వస్తువులను, వాటి నాణ్యతను ముందుగా తానే స్వయంగా పరిశీలిస్తుండడం విశేషం. తొలి రెండేళ్లలో బాలురు, బాలికలకు వేర్వేరు స్కూలు బ్యాగులను పంపిణీ చేయించారు. ఈ ఏడాది అందరికీ ఒకే రకమైన బ్యాగులను అందించారు. జనరల్‌ నాలెడ్జిని పెంపొందించేలా ఉండే కవర్‌ పేజీలతో నోట్‌బుక్స్‌ను ఇచ్చారు. యూనిఫారం నాణ్యత విషయంలోనూ రాజీ పడలేదు.  

మరిన్ని వార్తలు