నేడు రాష్ట్రపతి ఎన్నిక

18 Jul, 2022 03:45 IST|Sakshi

ఓటేయనున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు  

ఢిల్లీలోని పార్లమెంట్‌లో.. రాష్ట్రాల్లోని అసెంబ్లీల్లో ఓటింగ్‌  

ముర్ము ఎన్నిక లాంఛనమే..  

సాక్షి, అమరావతి: కోవిడ్‌ నిబంధనలను అనుసరిస్తూ పూర్తి కట్టుదిట్టమైన భద్రత మధ్య రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో 16వ రాష్ట్రపతి ఎన్నికకు ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నిక జరగనుంది. రాష్ట్ర అసెంబ్లీ కార్యాలయం మొదటి అంతస్థులో ఏర్పాటు చేసిన పోలింగ్‌ ఏర్పాట్లను కేంద్రం నుంచి వచ్చిన రాష్ట్రపతి ఎన్నికల పర్యవేక్షకుడు చంద్రేకర్‌ భారతి (ఐఏఎస్‌), ఎన్నికల స్పెషల్‌ ఆఫీసర్‌ సంతోష్‌ అజ్మీరా(ఐఐఎస్‌)లు ఆదివారం పరిశీలించారు.

వారు తొలుత సచివాలయంలోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌ మీనాతో సమావేశమై పోలింగ్‌ ఏర్పాట్లపై ఆరా తీశారు. అనంతరం శాసనసభ ప్రాంగణంలో ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన సూచనలు, సలహాలను చంద్రేకర్‌ భారతి.. అధికారులకు వివరించారు. ఎన్నికల నిర్వహణ సమయంలో విద్యుత్‌ అంతరాయం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్‌ జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని, ఎన్నికల ప్రక్రియను అంతా వీడియో తీయించాలని, ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధించిన డ్యూటీ చార్టును పటిష్టంగా రూపొందించాలని అధికారులకు సూచించారు.

పోలింగ్‌ కేంద్రంలోకి నిర్దిష్ట విరామాల్లో పరిమిత సంఖ్యలో వీడియోగ్రాఫర్లను ఏ విధంగా అనుమతిస్తారు, వారు వచ్చి.. వెళ్లే మార్గాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేసిన అన్ని కేంద్రాలు, మార్గాల్లో భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. తదనంతరం కంట్రోల్‌ రూమ్‌ను సందర్శించి అక్కడ సీటింగ్‌ ఏర్పాట్లను పరిశీలించారు. శాసన సభా భవనం మొదటి అంతస్తులోని ఓటర్లు వేచి ఉండే 203, 205 గదులను పరిశీలించి, ఓటర్ల సూచనల ఫ్లెక్స్‌ బ్యానర్లను, కరపత్రాలను అక్కడ ఏర్పాటు చేయాల్సిందిగా ఏఆర్వో రాజ్‌కుమార్‌ను ఆదేశించారు. పర్యటనలో డిప్యూటీ సీఈవో వెంకటేశ్వరరావు, అసిస్టెంట్‌ సీఈవో శ్రీనివాసశాస్త్రి, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, శాసన మండలి ఉప కార్యదర్శులు, ఎన్నికల సహాయ రిటర్నింగ్‌ అధికారులు రాజకుమార్, వనితా రాణి తదితరులు పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు