కొత్తగా 8 డీఎన్‌బీ కోర్సులు

9 Jul, 2021 02:34 IST|Sakshi

14 జిల్లా ఆస్పత్రుల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు

నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌కు ఆరోగ్య శాఖ లేఖ

ఆగస్ట్‌ 31 వరకు కోర్సుల దరఖాస్తులకు గడువు

ఎంబీబీఎస్‌ పూర్తయిన అభ్యర్థులకు అవకాశం

సాక్షి, అమరావతి: జిల్లా ఆస్పత్రుల్లో కొత్తగా డిప్ల్లమా కోర్సులు నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే చాలా ఆస్పత్రుల్లో డిప్లమేట్‌ ఆఫ్‌ నేషనల్‌ బోర్డ్‌ (డీఎన్‌బీ) పీజీ వైద్య సీట్లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే కేంద్రం కొత్తగా డిప్ల్లమా కోర్సులకు అవకాశమిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తాజాగా ఎన్‌బీఈఎంఎస్‌ (నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌)కు లేఖ రాసింది. అందులో కొత్తగా ఆఫర్‌ చేసే కోర్సులకు దరఖాస్తులు పంపిస్తామని, తమ లేఖను పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది. దీనిపై సానుకూల నిర్ణయం వస్తే భారీగా పీజీ సీట్లు పెరగనున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్‌లో కలిపి 4,500 వరకు ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో 940 మాత్రమే పీజీ సీట్లు ఉన్నాయి. చాలామందికి పీజీ సీటు రాక ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో డీఎన్‌బీ సీట్లు పెరిగితే వైద్య విద్యార్థులకు మేలు జరుగుతుంది.

8 కొత్త కోర్సులు
నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ (ఎన్‌బీఈ) 8 కొత్త కోర్సులను నిర్వహిస్తోంది. ఎంబీబీఎస్‌ పాసైన అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి గడువు ఆగస్ట్‌ 31వ తేదీ వరకు ఉంది. కొత్త కోర్సుల్లో అనస్థీషియా, ఫ్యామిలీ మెడిసిన్, రేడియో డయాగ్నసిస్, ఆబ్‌స్ట్రెటిక్స్‌ అండ్‌ గైనకాలజీ, ఆఫ్తాల్మాలజీ, ట్యూబర్‌క్లోసిస్‌ అండ్‌ చెస్ట్‌ డిసీజస్‌ (టీబీ), పీడియాట్రిక్స్, ఈఎన్‌టీ ఉన్నాయి. ఈ కోర్సుల వల్ల పీజీ సీట్లు రాని ఎంతో మంది అభ్యర్థులకు లబ్ధి చేకూరుతుంది.

14 జిల్లా ఆస్పత్రుల్లో...
చిత్తూరు, మదనపల్లె, టెక్కలి, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, తెనాలి, మార్కాపురం, ప్రొద్దుటూరు, ఆత్మకూరు, నంద్యాల, హిందూపురంలలో జిల్లా ఆస్పత్రులు ఉన్నాయి. వీటన్నిటిలో ఈ కొత్త కోర్సులకు దరఖాస్తు చేయనున్నారు. కోర్సుల నిర్వహణకు ఈ ఆస్పత్రుల్లో అన్ని రకాలుగా మౌలిక వసతులు ఉన్నాయి. కొత్త కోర్సులు వస్తే ఆస్పత్రుల్లో స్పెషాలిటీ సేవలు ఎక్కువ మందికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే ఏరియా ఆస్పత్రుల్లో కూడా డీఎన్‌బీ సీట్లు వచ్చే అవకాశాలున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

ప్రస్తుతం జిల్లా ఆస్పత్రుల్లో నిర్వహిస్తోన్న డీఎన్‌బీ వైద్య కోర్సులు ఇవే....
విజయనగరం జిల్లా ఆస్పత్రిలో ఆర్థోపెడిక్స్‌– 2, పీడియాట్రిక్స్‌–6, గైనకాలజీ–2, అనస్థీషియా– 2 ఉన్నాయి
అనకాపల్లి ఆస్పత్రిలో గైనకాలజీ–2 కోర్సులు నిర్వహిస్తున్నారు
రాజమహేంద్రవరంలో గైనకాలజీ–2, ఎమర్జెన్సీ మెడిసిన్‌–2, అనస్థీషియా–2, జనరల్‌ సర్జరీ–1 ఉన్నాయి
ఏలూరులో ఆర్థోపెడిక్స్‌–4, జనరల్‌ మెడిసిన్‌–1, గైనకాలజీ–4, అనస్థీషియా–2, ఎమర్జెన్సీ మెడిసిన్‌–1 ఉన్నాయి
నంద్యాల ఆస్పత్రిలో ఫ్యామిలీ మెడిసిన్‌–2, అనస్థీషియా–2, గైనకాలజీ–2, ఎమర్జెన్సీ మెడిసిన్‌–1 ఉన్నాయి
మచిలీపట్నంలో ఆర్థోపెడిక్స్‌–1 సీటు, తెనాలి జిల్లా ఆస్పత్రిలో గైనకాలజీ–2 సీట్లు ఉన్నాయి.

మరిన్ని వార్తలు