వైఎస్సార్‌సీపీ ప్లీనరీకి చకచకా ఏర్పాట్లు

29 Jun, 2022 04:10 IST|Sakshi
ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ తలశిల రఘురాం, గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌

నాగార్జున వర్సిటీ ఎదుట సువిశాల మైదానంలో నిర్వహణ 

100 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో వేదిక 

లక్షలాది ప్రజలు కూర్చోవడానికి భారీ టెంట్‌ 

భారీ వర్షం వచ్చినా తడవకుండా నిర్మాణం 

వేదిక వెనుక వైపు సీఎం జగన్‌ కోసం తాత్కాలిక కార్యాలయం 

వేలాది వాహనాలు వచ్చినా ట్రాఫిక్‌కు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు 

మూడు ప్రాంతాల సంప్రదాయ వంటకాలతో ఫలహారం, విందు

సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని జూలై 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ మూడో ప్లీనరీకి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారికి పక్కనే నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న సువిశాల మైదానంలో ప్లీనరీ ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న ప్లీనరీని వైఎస్సార్‌సీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2011 జూలై 8న ఇడుపులపాయలో జరిగిన మొదటి ప్లీనరీ, 2017 జూలై 8, 9న నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా నిర్వహించిన రెండో ప్లీనరీకంటే మూడో ప్లీనరీని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు.

రెండో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశంలోనే మూడో ప్లీనరీకీ ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ రహదారికి పశ్చిమాన, తూర్పునకు అభిముఖంగా 100 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు, 6.5 అడుగుల ఎత్తుతో భారీ వేదిక నిర్మిస్తున్నారు. వేదికపై కూర్చున్నవారు, ప్రసంగించే వారు జాతీయ రహదారిపై నిలబడిన వారికి కూడా కనబడేలా నిర్మాణం జరుగుతోంది. వేదికకు ఎదురుగా లక్షలాది మంది కూర్చొనేందుకు అనువైన ఏర్పాట్లు చేస్తున్నారు.

భారీ వర్షాలు కురిసినా ఒక్కరూ తడవకుండా భారీ టెంట్‌ ఏర్పాటు చేస్తున్నారు. ప్లీనరీకి వేలాది వాహనాల్లో శ్రేణులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లీనరీ జరిగే రెండు రోజులూ ముఖ్యమంత్రి అధికారిక విధులు నిర్వర్తించడానికి వేదిక వెనుకవైపు తాత్కాలిక కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. 

సంప్రదాయ వంటకాలతో విందు 
ప్లీనరీకి హాజరయ్యే లక్షలాది పార్టీ నేతలు, కార్యకర్తలకు రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర సంప్రదాయ వంటకాలతో జూలై 8, 9న టిఫిన్, విందు ఇవ్వనున్నారు. ఇందుకోసం భారీ వంటశాలలు ఏర్పాటు చేస్తున్నారు. వంటల బాధ్యతను దేశంలోనే ప్రసిద్ధి చెందిన కృష్ణా జిల్లాఇందుపల్లి వాసులకు అప్పగించారు. దీనికి సమీపంలోనే విశాలమైన భోజనశాలలు నిర్మిస్తున్నారు.

ఇక్కడ వేడి వేడిగా ఫలహారాలు, కాఫీలు, భోజనాలు వడ్డిస్తారు. ప్లీనరీ ఏర్పాట్లను సీఎం ప్రోగ్రామ్స్‌ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జూలై 7 నాటికి ప్లీనరీ ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తామని రఘురాం చెప్పారు. 

మరిన్ని వార్తలు