కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయా.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కచ్చితంగా తగ్గుతాయి..

13 Dec, 2021 18:55 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

5 శాతం మందిని వేధిస్తున్న కీళ్ల నొప్పుల సమస్య

జీవనశైలిలో మార్పులు, వంశపారంపర్యం కారణాలు

తగిన నీరు, పోషకాహారంతో పాటు వ్యాయామం తప్పనిసరి

సాక్షి, కర్నూలు: ఉదయం లేచిన వెంటనే కదలలేరు, నడవలేరు. కాసేపు కుర్చీలో కూర్చుని మళ్లీ లేవాలంటే నరకం. కీళ్లన్నీ బిగుసుకుపోయి ఉంటాయి. అడుగు తీసి అడుగు వేయాలన్నా, కాస్త కష్టమైన పనిచేయాలన్నా ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. దీనినే వైద్యపరిభాషలో రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌(కీళ్లవాతం) అంటారు. చలికాలంలో ఈ సమస్య మరింత వేదనకు గురి చేస్తుంది. చలితీవ్రత పెరిగే కొద్దీ ఈ వ్యాధి బాధితుల బాధ వర్ణణాతీతం. జిల్లాలో ఇటీవల కీళ్లవాతం బాధితుల సంఖ్య పెరుగుతోంది. గతంలో జిల్లా జనాభాలో 5 శాతం ఉన్న వారి సంఖ్య ఇప్పుడు ఆరుకు చేరుకుంది.

జిల్లా వ్యాప్తంగా దాదాపు 25 వేల మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి. మొదట్లో కేవలం నగరాలు, పట్టణాల్లో మాత్రమే ఈ సమస్య బాధితులు ఉండగా.. ఇప్పుడు గ్రామాల్లోనూ పెరిగారు. జీవనశైలిలో మార్పుల కారణంగా జంక్‌ ఫుడ్, కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే ఆహారం తినడం, వ్యాయామం చేయకుండా ఒకేచోట ఎక్కువసేపు కూర్చోవడం అధికంగా వంశపారంపర్యం మరో కారణంగా వైద్యులు పేర్కొంటున్నారు. గతంలో ఈ సమస్య 40 ఏళ్లు దాటిన వారిలో అధికంగా కనిపించేది. ఇప్పుడు పాతికేళ్ల వయస్సు నుంచే మొదలవుతోంది.
చదవండి: పేదరికంలోకి 50 కోట్ల మంది.. ఇక సమయం లేదు: డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక   

రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ అంటే... 
ఇది దీర్ఘకాలిక వ్యాధి. శరీరంలోని వ్యాధినిరోధక వ్యవస్థ వ్యతిరేక దిశలో పనిచేయడం వల్ల ఇది సంభవిస్తుంది. దీనివల్ల కీళ్లలో నొప్పి, వాపు, బిగువును కలుగజేస్తుంది. ఒకే సమయంలో శరీరం రెండువైపులా సమంగా కీళ్లనొప్పి కలుగుతుంది. కొన్ని వారాల్లో ఇది వృద్ధి చెంది కీళ్లను నాశనం చేయడం ప్రారంభిస్తుంది. ఇది సాధారణంగా చెయ్యి, పాదం, మణికట్టు, మోచేయి, చీలమండలంలోని చిన్న కీళ్లను ప్రభావితం చేస్తుంది. పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. వ్యాధి నిర్ధారణకు ప్రభావిత కీళ్లకు శారీరక పరీక్ష, ఆర్‌ఏ ఫ్యాక్టర్, యాంటి సీసీపీ రక్తపరీక్షలు, ఎక్స్‌రే చేయించాలి.
చదవండి: మూడ్స్‌ బాగు చేసి ఆరోగ్యాన్నీ, ఆనందాన్నిపెంచే చాక్లెట్స్‌!   

 

లక్షణాలు 
➡ఒకటి లేదా ఎక్కువ చేయికీళ్లలో మానకుండా ఉన్న వాపు 
➡తెల్లవారుజామున 30 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉండే కీళ్ల బిగువు 
➡కీళ్లలో మెలిపెడుతున్న నొప్పి  
➡పిడికిలి బిగించడంలో ఇబ్బంది  
➡అలసట, అలసిన భావన   
➡ఈ వ్యాధి వల్ల కళ్లు, గుండె, ఊపిరితిత్తులు, చర్మం ప్రభావితం అవుతాయి.  

కారణాలు 
➡వంశపారంపర్యం, జీవనశైలిలో లోపాలు, జంక్‌ఫుడ్, మాంసాహారం, కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం  
➡గతంలో చికున్‌గున్యా, డెంగీ జ్వరం వచ్చినా దాని తాలూకు వైరస్‌లు కీళ్లలో ఉండి దీర్ఘకాలం నొప్పులుగా మారి  కీళ్లవాతానికి దారి తీస్తుంది.      
➡ఇది కీళ్లకు, దాని చుట్టుపక్కల ఉన్న మృదులాస్తికి, సమీప ఎముకలకు హాని కలిగిస్తుంది.    
చదవండి: గుడ్‌న్యూస్‌! కాఫీతాగే అలవాటు మతిమరుపును నివారిస్తుంది.. ఎలాగంటే..

కీళ్లను కాపాడుకోవడం ఇలా..  
వ్యాయామం.. చలికాలంలో రోజూ వ్యాయామం చేయడం వల్ల నొప్పి తగ్గడం, కీళ్లు, కండరాలు బలంగా తయారు అవుతాయి. దీనివల్ల కీళ్లు చురుకుగా కదులుతాయి. అయితే ఒకేసారి ఎక్కువగా గాకుండా చిన్న చిన్న వ్యాయామాలు వైద్యుల సూచనలతో చేయాలి. కీళ్ల వాతం ఉండేవారు వారు నడిచే మార్గాలు, పనుల వల్ల కీళ్లు దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి.   

వెచ్చగా ఉంచుకోవడం.. శరీరానికి వెచ్చదనం రక్తప్రసరణను మెరుగుపరిచి నొప్పికి కారణమయ్యే కెమికల్‌ను తొలగిస్తుంది. దీంతో పాటు నొప్పి సెన్సిటివిటీని తగ్గించి నొప్పిని తట్టుకునేస్థాయిని పెంచుతుంది. దీనివల్ల కీళ్లు బిగుసుకుపోవడం తగ్గుతుంది. వేడినీటి స్నానం, హీటింగ్‌ ప్యాడ్స్, గ్లౌజ్‌లు, షూస్, ఉలెన్‌ డ్రెస్‌ ధరించడం వల్ల కీళ్లు బిగుసుకోవడాన్ని తగ్గించుకోవవచ్చు.   

విటమిన్‌ డి లోపం.. విటమిన్‌ డి ఎముకలు, కీళ్లు, పళ్లకే గాకుండా వ్యాధినిరోధకశక్తిని పెంచేందుకు ప్రధానం. విటమిన్‌ డి లోపం వల్ల కీళ్లనొప్పి అధికం అవుతుంది. కీళ్లు బిగుతుగా అవుతాయి. సూర్యరశ్మి వల్ల విటమిన్‌ డి లభిస్తుంది. అది వీలుకాని వారు ప్రతిరోజూ 600 ఐయూ  విటమిన్‌ డి మాత్రను తీసుకోవాలి.  

వ్యాక్సిన్‌ తీసుకోవాలి.. కీళ్ల వ్యాధి ఉండేవారికి చలికాలంలో వ్యాధినిరోధకశక్తి బలహీన పడి సులువుగా ఇన్‌ఫెక్షన్స్‌ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వైద్యుల పర్యవేక్షణలో ఫ్లూ, న్యూమోనియా వ్యాక్సిన్‌ తీసుకోవాలి.  

అధిక బరువు వల్ల చురుకుతనం తగ్గిపోతుంది. వీరిలో అధిక శాతం వ్యాయామంపై నిర్లక్ష్యం ఉంటుంది. కాబట్టి బరువు తగ్గే వ్యాయామాలు చేయాలి. నీరు అధికంగా తాగాలి. ముఖ్యంగా గౌట్‌ రోగులు ఉప్పు తగ్గించాలి. ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో అధికంగా నీటి శాతం చేరి కీళ్లు మరీ ఎక్కువగా బిగుసుకుపోతాయి.    

చలికి బిగుసుకునే కీళ్లు 
సాధారణంగా చలికాలంలో కీళ్లు కొంచెం బిగుతుగా ఉంటాయి. కీళ్లవాతం వ్యాధిగ్రస్తులలో మరీ ఎక్కువగా ఇబ్బందికరంగా ఉంటుంది. దీనికి కారణం వాతావరణంలో వచ్చే మార్పులు కీళ్లపై ప్రభావం చూపుతాయి. కీళ్లు వ్యాకోచించడం వల్ల కీళ్లలో ఉండే ద్రవంలో మార్పుల వల్ల, పెయిన్‌ సెన్సిటివిటివి చలికాలంలో పెరగడం వల్ల 20 శాతం ఎక్కువ నొప్పి తెలుస్తుంది. కీళ్లు ఎక్కువగా బిగుతుగా మారతాయి. ఇలాంటి వారు వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.   
– డాక్టర్‌ ఎ. సృజన, రుమటాలజిస్టు, కర్నూలు 

మరిన్ని వార్తలు