Asani Cyclone: ముప్పు తప్పినట్లే.. తీరం దాటిన అసని తుపాను

12 May, 2022 07:36 IST|Sakshi
కృష్ణా జిల్లా మంగినపూడి బీచ్‌లో కమ్ముకున్న కారుమబ్బులు

మచిలీపట్నం వద్ద తీరం దాటిన అసని తుపాను

తీరం దాటకముందే తీవ్ర వాయుగుండంగా బలహీనం

తీరం వెంబడే కదులుతూ ఇంకా బలహీనపడే అవకాశం

రెండు రోజులుగా గమనం మార్చుకుంటూ పయనిస్తున్న అసని.. దీని ప్రభావంతో పలుచోట్ల వర్షాలు

కోస్తా జిల్లాల్లో నేడు విస్తారంగా వానలు

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/నెట్‌ వర్క్‌: ఎప్పటికప్పుడు దిశను మార్చుకుంటూ వణికించిన అసని తుపాను బలహీనపడడంతో రాష్ట్రానికి ముప్పు తప్పింది. బుధవారం ఉదయానికి తీవ్ర తుపానుగా ఉన్న అసని తొలుత తుపానుగా, సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. బంగాళాఖాతంలో నెమ్మదిగా కదులుతూ బుధవారం సాయంత్రం మచిలీపట్నం సమీపంలోని కోన వద్ద తీరాన్ని దాటింది. తీరం దాటే సమయంలో 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
చదవండి:అసని’పై అప్రమత్తం

ప్రస్తుతం ఇది తీరం వెంబడి నరసాపురం, అమలాపురం మీదుగా కదులుతూ గురువారం ఉదయానికి వాయుగుండంగా మారి యానాం దగ్గర మళ్లీ సముద్రంలోకి వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సముద్రంలోకి వెళ్లి ఇంకా బలహీనపడుతుందని అధికారులు చెబుతున్నారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లు.. గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని, మత్స్యకార గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అలలు సాధారణం కంటే అరమీటరు ఎక్కువ ఎత్తుకు ఎగసిపడతాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. తుపాను ప్రభావంతో గురువారం కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ఒకట్రెండు చోట్ల భారీవర్షాలు పడే సూచనలున్నాయని తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించారు.

అంచనాలకు అందని అసని
అండమాన్‌ దీవుల నుంచి వేగంగా ఏపీ తీరానికి దూసుకొచ్చిన అసని తుపాను గమనం వాతావరణ శాఖ అంచనాలకు అందలేదు. తొలుత ఉత్తరాంధ్ర వైపు పయనించి ఒడిశా దిశగా బంగ్లాదేశ్‌ వైపు వెళుతుందని భావించారు. కానీ కాకినాడ–మచిలీపట్నం వైపు మళ్లింది. బుధవారం తెల్లవారుజామున ఆ ప్రాంతాల మధ్య తీరం దాటుతుందనే అంచనాలు కూడా తప్పాయి. మచిలీపట్నానికి 60 కిలోమీటర్ల దూరంలోనే కేంద్రీకృతమై నెమ్మదిగా అక్కడే బలహీనపడింది. ఒక దశలో కేవలం 3 కిలోమీటర్ల వేగంతో మాత్రమే మచిలీపట్నం వైపు కదిలింది. వేసవిలో అరుదుగా వచ్చిన తుపాను కావడంతో దాని గమనాన్ని అంచనా వేయలేకపోయినట్లు చెబుతున్నారు.

విశాఖలో ఎగిసిపడుతున్న సముద్రపు అలలు 

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, గాలులు
అనూహ్యంగా వచ్చిన అసని తుపాను అనూహ్యంగానే బలహీనపడడంతో రాష్ట్రానికి ముప్పు తప్పింది. దీంతో రాష్ట్రంలో వర్షాలు, గాలుల ప్రభావం తగ్గింది. తీరం వెంబడి గంటకు 50–60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు సగటున 4.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

అనకాపల్లి జిల్లాలో సగటున 15 మిల్లీమీటర్ల వర్షం పడింది. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడులో అత్యధికంగా 6 సెంటీమీటర్లు, గుడ్లూరులో 5.3, అనకాపల్లి జిల్లా మునగపాకలో 5.1, సత్యసాయి జిల్లా కేశపురంలో 4.3, విజయనగరం జిల్లా బొందపల్లిలో 4.1, అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబరాడలో 4, బాపట్ల జిల్లా నూజెల్లపల్లిలో 3.9, అనకాపల్లి జిల్లా చీడికాడ, సత్యసాయి జిల్లా ధర్మవరంలో 3.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలో సగటున 9.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సగటున అనకాపల్లి జిల్లాలో 3.1 సెంటీమీటర్లు, శ్రీకాకుళంలో 2.1, నెల్లూరులో 2, ప్రకాశంలో 1.8, విజయనగరంలో 1.7, విశాఖలో 1.6, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1.5, కోనసీమలో 1.5, కాకినాడ, బాపట్ల జిల్లాల్లో 1.3, తిరుపతి జిల్లాలో 1.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

అత్యవసర హెల్ప్‌ లైన్‌ నంబర్లు
అసని తుపాను నేపథ్యంలో అత్యవసర సహాయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండేలా హెల్ప్‌లైన్‌ నంబర్లు సిద్ధం చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలిపారు. సహాయం కావాల్సిన వారు హెల్ప్‌లైన్‌ నెంబర్లు 1070, 08645 246600కి ఫోన్‌ చేయాలని సూచించారు.

కోతకు గురైన ఉప్పాడ తీరం 
కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ఈదురుగాలులతో వర్షం కురిసింది. కాకినాడ తీరం అల్లకల్లోలంగా మారింది. సముద్రం 30 మీటర్లు ముందుకు చొచ్చుకురావడంతో ఉప్పాడ–కాకినాడ బీచ్‌ రోడ్డును మూసివేశారు. ఉప్పాడ గ్రామం రూపును కోల్పోతోంది. ఉప్పాడ తీరప్రాంతం కోతకు గురైంది. మత్స్యకారుల ఇళ్లల్లోకి నీరు చొచ్చుకువచ్చింది. సముద్రపు కెరటాల ఉధృతికి ఉప్పాడలో ఇళ్లు, బీచ్‌ రోడ్డు ధ్వంసమయ్యాయి. కోనసీమ, కాకినాడ, రాజమండ్రి జిల్లాల్లో సహాయ చర్యల కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దింపారు. 31 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు.

ప్రజలను శిబిరాలకు తరలించేందుకు ఆర్టీసీ బస్సులను సిద్ధంగా ఉంచారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షించారు. ఇదిలా ఉండగా తుపాను కారణంగా పలుప్రాంతాల్లో పంటలకు, పండ్ల తోటలకు వాటిల్లిన నష్టంపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అంచనా వేస్తున్నారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. తుమ్మలపల్లి–నర్రావారిపాలెం మధ్య పొన్నాలకాలువ పొంగడంతో రాకపోకలు కూడా నిలిచిపోయాయి. తాడేపల్లి డోలాస్‌నగర్‌ వద్ద రహదారి వెంబడి చెట్టుకొమ్మ విరిగి ఆటోపై పడడంతో ఆటో పూర్తిగా దెబ్బతింది. ఇమీస్‌ కంపెనీ వద్ద వెళ్తున్న లారీ మీద భారీ వృక్షం విరిగిపడింది. కాగా, తుపాను గాలులకు కోనసీమ జిల్లా అమలాపురం రూరల్‌ మండలం కామనగరువు శివారు అప్పన్నపేటలో ఇల్లు కూలి వ్యవసాయ కూలీ వాడపల్లి శ్రీనివాసరావు (43) మృతిచెందాడు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి విశ్వరూప్‌ ప్రమాదస్థలాన్ని బుధవారం పరిశీలించి బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. 

విమాన సర్వీస్‌లు రద్దు
తుపాను ప్రభావంతో బుధవారం గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సిన 16 విమాన సర్వీస్‌లను రద్దు చేశారు. రాజమహేంద్రవరం విమానాశ్రయానికి రావాల్సిన 9 విమాన సర్వీసులు రద్దయ్యాయి. 

మరిన్ని వార్తలు