మరింత పక్కాగా వ్యాక్సినేషన్‌ 

10 May, 2021 04:05 IST|Sakshi

ఎవరికి వ్యాక్సిన్‌ అవసరమో గుర్తించనున్న ఆశా వర్కర్లు 

రెండో డోసు వేసుకోవాల్సిన వారు మాత్రమే కేంద్రాలకు రాక 

తొక్కిసలాటకు తావులేకుండా ఏర్పాట్లు  

సమూహం వల్ల కరోనా వ్యాపించకుండా చర్యలు

సాక్షి, అమరావతి: కోవిడ్‌ అదుపునకు వ్యాక్సిన్‌ ఎంత అవసరమో.. వేయించుకునే క్రమంలో జాగ్రత్తగా ఉండటం అంతే అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సినేషన్‌ వేయించుకునే క్రమంలో పెద్ద ఎత్తున గుమిగూడే జనాల వల్ల కరోనా వ్యాప్తి తేలికగా జరుగుతోందని చెబుతున్నారు. వ్యాక్సిన్‌ మొదలైన తర్వాత పలు సంస్థలు కరోనా వ్యాప్తిపై అధ్యయనాలు చేశాయి. ఇందులో ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ వంటి ప్రముఖ సంస్థలూ ఉన్నాయి. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత మూడు రకాల అధ్యయనాలు జరిగాయి. తొలి దశలో అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌ను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు ఎక్కువగా వేశారు. శాఖాపరంగా ఎక్కడికక్కడే వేయడం వల్ల పెద్దగా సమస్య రాలేదు.

రెండో దశలో అన్ని కేంద్రాల్లోనూ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జన సమూహాల మధ్యే జరుగుతోంది. ప్రభుత్వమే వ్యాక్సిన్‌ వేస్తుండటంతో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో కోవిడ్‌ నిబంధనలు పాటించేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. వేసవి తీవ్రతకు మధ్య మధ్యలో మాస్‌్కలు తీస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇరుకుగా ఉన్న ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరిగింది. మూడో అధ్యయనంలో మొదటి, రెండో డోస్‌ కోసం వచ్చే వారి సంఖ్య బాగా పెరిగింది. ఎవరికి వారు తమ పనవ్వాలనే ఆతృతతో వ్యవహరించారు. ఫలితంగా కోవిడ్‌ వ్యాప్తికి వ్యాక్సినేషన్‌ కేంద్రాలే కారణమవుతున్నాయని అధ్యయన సంస్థలు అంటున్నాయి. 

ఇకపై ఇలా.. 
ప్రస్తుతం అనుకున్న రీతిలో కేంద్రం నుంచి వ్యాక్సిన్‌ సరఫరా కావడం లేదు. అందువల్ల 45 ఏళ్లు పైబడిన వారికి రెండవ డోసు వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఎవరెవరికి అవసరమో ఆశా వర్కర్లు ముందుగానే గుర్తించి వారికి సమాచారం ఇస్తారు. ఆ మేరకు వ్యాక్సిన్‌ కేంద్రాల వద్దకు వచ్చిన వారిని వలంటీర్లు అక్కడ కూర్చోబెట్టి.. ఒక్కొక్కరిని లోపలకు పంపి వ్యాక్సిన్‌ వేయిస్తారు. వ్యాక్సిన్‌ లభ్యత పెరిగే వరకు మొదటి డోసు వేయించుకునే వారు కేంద్రాల వద్దకు వచ్చే అవకాశం లేనందున తొక్కిసలాటకు, గుమిగూడటానికి అవకాశం ఉండదు. అందువల్ల ఒకరి మీద ఒకరు పడకుండా, వ్యాక్సిన్‌ వేసే సిబ్బందికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. కరోనా వ్యాప్తిని చాలా వరకు కట్టడి చేయొచ్చు.    

మరిన్ని వార్తలు