రామతీర్థం బోడికొండపై అశోక్‌గజపతిరాజు వీరంగం

22 Dec, 2021 10:45 IST|Sakshi

సాక్షి, విజయనగరం: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం నీలాచలం బోడికొండపై రూ.3కోట్ల వ్యయంతో నిర్మించనున్న శ్రీ కోదండ రామాలయ పునఃనిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణితోపాటు జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దేవస్థాన అధికారులు హాజరయ్యారు. శంకుస్థాపన అనంతరం వించ్‌ మోటారు సహకారంతో ట్రాక్‌ మీదుగా శిలా ఖండాలను ఒక్కొక్కటిగా కొండపైకి చేరవేసి ఆలయాన్ని నిర్మించడానికి ఏర్పాట్లు చేశారు. 

మండపంతోపాటు ధ్వజస్తంభం, ఆలయ ప్రాకారం, వంటశాలను నిర్మించనున్నారు. నీటి కొలను సుందరీకరణ, మెట్ల మార్గం ఆధునికీకరిస్తారు. శంకుస్థాపన అనంతరం ఆరు నెలల్లో నిర్మాణం పూర్తి చేసేందుకు దేవదాయశాఖ ఇంజినీరింగ్‌ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం దిగువున ప్రధాన ఆలయంలో ఏర్పాటు చేసిన బాలాలయంలో కోదండ రాముడు నిత్య పూజలు అందుకుంటున్నాడు. కొండపై నిర్మాణం పూర్తయిన వెంటనే విగ్రహాలను నూతన ఆలయంలో పునఃప్రతిష్టిస్తారు. 

అశోక్‌గజపతిరాజు వీరంగం
రామతీర్థం బోడికొండపై అశోక్ గజపతి రాజు వీరంగం సృష్టించారు. దుండగులు ధ్వంసం చేసిన ఆలయాన్ని ప్రభుత్వం నిర్మించడాన్ని అశోక్‌ గజపతి రాజు తప్పుబట్టారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేరున ఉన్న శిలాఫలకాన్ని తొలగించాలని అశోక్‌ అధికారులపై చిందులు తొక్కారు. ఆ క్రమంలోనే శంకుస్థాపం బోర్డును సైతం అశోక్‌గజపతిరాజు పీకిపారేశారు. 

>
మరిన్ని వార్తలు