తేరుపై తిరుమలవాసుడు!

5 Oct, 2022 08:52 IST|Sakshi
అశ్వవాహనంపై ఊరేగుతున్న మలయప్ప స్వామి వారికి హారతి ఇస్తున్న టీటీడీ అర్చకులు

అశ్వవాహనంపై విహరించిన ఆపదమొక్కులవాడు

తిరుమల: బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ వేంకటేశ్వరుడు మహారథం (తేరు)పై భక్తులను అనుగ్రహించాడు. భక్తకోటి గోవింద శరణాగతుల మధ్య ఈ కార్యక్రమం ఆలయ మాడ వీధుల్లో వేడుకగా సాగింది. గుర్రాల వంటి ఇంద్రియాలు మనస్సు అనే తాడుతో కట్టి రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మ ద్వారా అదుపు చేయాలనే తత్వజ్ఞానాన్ని స్వామి వారు ఈ రథోత్సవం ద్వారా భక్తులకు సందేశమిచ్చారు. రథసేవలో దేవదేవుడిని దర్శించినవారికి పునర్జన్మ ఉండదని పురాణాల ప్రవచనం. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు గోవిందా..గోవిందా..అంటూ మహారథం మోకు (తాడు)ను లాగారు. వాహన సేవ తరువాత గంట పాటు పండితులు నిర్వహించిన వేదగోష్టితో సప్తగిరులు పులకించాయి.

అశ్వవాహనంపై ఆనందనిలయుడి దర్శనం
రాత్రి చల్లటి చలిగాలుల మధ్య మలయప్ప స్వామి అశ్వ వాహనంపై భక్తులను కటాక్షించారు. చతురంగ బలాల్లో అత్యంత ప్రధానమైనది అశ్వ బలం. కలియుగాంతంలో శ్రీనివాసుడు అశ్వవాహనం మీద వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడని చాటి చెప్పడమే ఈ వాహన పరమార్థం. బంగారు, వజ్ర, వైఢూర్య ఆభరణాలు, విశేష çపుష్పాలంకరణాంతరం స్వామి వారు ఆలయ మాడ వీధుల్లో ఊరేగారు. బ్రహ్మరథం, గజ, అశ్వ, తురగ, చతురంగ బలాలు ముందుకు సాగగా జానపద కళాకారులు, భజన బృందాలు సాంస్కృతిక కార్యక్రమాల మధ్య వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది.

సర్వ దర్శనానికి 10 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. 32 కంపార్ట్‌మెంట్లు నిండాయి. సర్వ దర్శనానికి 10 గంటలు పడుతోంది. సోమవారం అర్ధరాత్రి వరకు 82,815 మంది స్వామి వారిని దర్శించుకున్నారు.  హుండీలో రూ.3 05 కోట్లు వేశారు.

నేడే చక్రస్నానం..
బుధవారం ఉదయం 3 గంటల నుంచి పల్లకి ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. అనంతరం స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని వరాహస్వామి ఆలయంలో నిర్వహిస్తారు. ఆ తరువాత శ్రీవారి శంఖు, చక్రాలను పుష్కర జలాల్లో ముంచి లేపుతారు. ఈ కార్యక్రమం ఉదయం 3 నుంచి ప్రారంభమై 9 గంటలకు ముగుస్తుంది. రాత్రి 7–9 గంటల మధ్యలో ధ్వజావరోహణం నిర్వహిస్తారు. దీంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

శ్రీవారి సేవలో న్యాయమూర్తులు
శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ రవీంద్ర బాబు, జస్టిస్‌ సి.ప్రవీణ్‌ కుమార్, జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు దర్శించుకున్నారు.  అనంతరం వీరందరూ వాహన సేవలో పాల్గొన్నారు. అలాగే, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అశ్వవాహన సేవలో పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు