వైఎస్సార్‌సీపీ నేత వేణుబాబుపై హత్యాయత్నం

7 Oct, 2022 08:37 IST|Sakshi

పోడూరు(పశ్చిమ గోదావరి జిల్లా): పెనుమంట్ర జెడ్పీటీసీ సభ్యురాలు కర్రి గౌరీసుభాషిణి భర్త, మార్టేరు ఉప సర్పంచ్, వైఎస్సార్‌సీపీ నాయకుడు కర్రి వేణుబాబుపై గురువారం హత్యాయత్నం జరిగింది. ఎనిమిదిమంది దుండగులు దాడిచేసి కొట్టడంతో తీవ్రంగా గాయపడిన వేణుబాబు భీమవరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వేణుబాబు మార్టేరు శివారులోని జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణపనుల పర్యవేక్షణకు కారులో వెళ్లారు. కారు డ్రైవర్‌ నవీన్‌ను ఇంటికి వెళ్లిపోమని చెప్పి ఆయన అక్కడే ఉన్నారు.
చదవండి: ఏపీలో కుండపోత.. మరో రెండు రోజులు భారీ వర్షాలు

నవీన్‌ ఇంటికి వెళుతుండగా పోడూరు మండలం పండితవిల్లూరు శివారు కట్లమ్మతాడి సమీపంలో ఆ కారును.. ఎదురుగా వచ్చిన కారులోని గుర్తుతెలియని ఎనిమిదిమంది దుండగులు ఆపారు. డ్రైవర్‌ నవీన్‌తో గొడవపెట్టుకుని అతడిని కొట్టారు. దీంతో నవీన్‌.. వేణుబాబుకు ఫోన్‌చేసి విషయం చెప్పారు. వెంటనే అక్కడికి చేరుకున్న వేణుబాబుపై దుండగులు దాడి చేశారు. తలపై ఇనుప రాడ్డుతో కొట్టి కారును వదిలేసి పరారయ్యారు.

తీవ్రంగా గాయపడిన వేణుబాబును డ్రైవర్‌ నవీన్‌ మార్టేరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం భీమవరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వేణుబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పాలకొల్లు రూరల్‌ సీఐ కె.శ్రీనివాస్, పోడూరు, పెనుమంట్ర ఎస్‌ఐలు వై.నాగలక్ష్మి, బి.సురేంద్రకుమార్‌ ఘటనాప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. దుండగులు వదిలివెళ్లిన కారులో కారంపొడి ప్యాకెట్లు, సుత్తి, మద్యం సీసా ఉన్నాయి. దాడిచేసిన వ్యక్తులు మధ్యాహ్నం నుంచి ఆ ప్రాంతంలోనే ఉండి వేణుబాబు కదలికలు గమనించినట్టు కొందరు చెబుతున్నారు. వేణుబాబును మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఫోన్‌లో పరామర్శించారు.  

మరిన్ని వార్తలు