ఇది మనసున్న ప్రభుత్వం

4 Dec, 2020 04:26 IST|Sakshi
అసెంబ్లీలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌

5.65 కోట్ల మందికి రూ.77,731 కోట్ల సంక్షేమ ఫలాలు

అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

గత ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సగటున ఏటా చేసిన ఖర్చు రూ.15,961 కోట్లు మాత్రమే  

మన ప్రభుత్వం వీరి సంక్షేమం కోసం ఏటా చేస్తున్న ఖర్చు   రూ.39,153 కోట్లు

టీడీపీకి రాజకీయాలు తప్ప పేద ప్రజల గురించి ఆలోచించే మనసు లేదు

బీసీలకు 59.85% రిజర్వేషన్లు రాకుండా బాబు కేసులు వేయించి అడ్డుకున్నారు

ఇవాళ దళారులు, లంచాలు లేకుండా నేరుగా లబ్ధిదారులకే డబ్బు జమ  

గర్భవతులు, బాలింతల పౌష్టికాహారానికి నెలకు రూ.1,100 చొప్పున ఖర్చు

36 నుంచి 72 నెలల పిల్లలకు నెలకు కనిష్టంగా రూ.553 చొప్పున వ్యయం 

గత ప్రభుత్వం బకాయి పడిన రూ.3,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపు 

డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు వడ్డీలేని రుణం కింద 2019–20లో రూ.1,400 కోట్లు 

ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం.. మద్య నియంత్రణతో అక్కచెల్లెమ్మల్లో సంతోషం

సాక్షి, అమరావతి: పేద, బడుగు ప్రజల సంక్షేమం కోసం 24 గంటలు ఆలోచించే మనసున్న ప్రభుత్వం తమదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే వారికి ఆపన్న హస్తం అందించడం ద్వారా వ్యవస్థలో మార్పు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై గురువారం శాసనసభలో సుదీర్ఘంగా జరిగిన చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఏటా ఖర్చు చేసిన మొత్తానికి రెట్టింపు కంటే అధికంగా వ్యయం చేస్తున్నట్లు తెలిపారు.

ఇందులో భాగంగా గత 18 నెలల్లో రాష్ట్రంలోని అన్ని కులాల పేద ప్రజలకు వివిధ పథకాల కింద 5.65 కోట్ల మందికి రూ.77,731.32 కోట్ల విలువైన ఆర్థిక ప్రయోజనం కల్పించినట్లు తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏటా సగటున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రూ.15,961.2 కోట్లు వ్యయం చేస్తే తమ ప్రభుత్వం రెట్టింపు కంటే ఎక్కువగా రూ.39,153 కోట్లు వ్యయం చేయడం తమ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా, ఎన్నికల ముందు సంక్షేమ పథకాలు అంటూ హడావుడి చేయడం ఆయన చిత్తశుద్ధి ఏపాటిదో తెలియజేస్తోందన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

రాజకీయాలపైనే బాబు దృష్టి
► అధికారం చేపట్టిన తర్వాత పేద ప్రజలకు ఎలా సాయం చేయాలన్న ఆలోచన లేకుండా కేవలం రాజకీయాలపైనే చంద్రబాబు దృష్టి సారించారు. ఇంత కీలకమైన అంశంపై చర్చ చేపట్టినప్పుడు కూడా సూచనలు, సలహాలు ఇవ్వకుండా అబద్ధాలు మాట్లాడుతూ సభను అడ్డుకోవడం ద్వారా సస్పెండ్‌ అవ్వడం వరకు వెళుతున్నారు.   
► ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీల అభ్యున్నతి, బాగు కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం. వీటిని ఏ విధంగా ఇంకా మెరుగు పరచాలని ఆలోచిస్తున్నాం. ఈ దిశగా ప్రతిపక్షం నుంచి కూడా సూచనలు, సలహాలు తీసుకోవాలనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ కూడా ప్రతిపక్షం తీరు మారలేదు.  

చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో – ఇప్పుడు మన పాలనలో..
► బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు చంద్రబాబు తన హయాంలో 5 ఏళ్లకు కలిపి రూ.79,806 కోట్లు ఖర్చు చేశారు. మన ప్రభుత్వం వీరి కోసం ఈ 18 నెలల కాలంలో ఏకంగా రూ.58,729 కోట్లు ఖర్చు చేసింది. చంద్రబాబుకు  ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వారు గుర్తుకు వస్తారు. అందుకే 2019 ఫిబ్రవరిలో బీసీ సబ్‌ ప్లాన్‌ తెచ్చాడు.  అప్పుడే 13 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. పెన్షన్లు కూడా అంతే.   
► ఎన్నికలకు 6 నెలల ముందు వరకు, అంటే అక్టోబర్‌ 2018 వరకు పెన్షన్లు కేవలం 44 లక్షలుంటే, ఎన్నికలు వచ్చే సరికి ఆ సంఖ్యను 51 లక్షలకు పెంచారు. అంటే 7 లక్షల మందికి పెన్షన్‌ లేదని తెలిసినా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం 61.90 లక్షలకు పైగా పెన్షన్లు ఇస్తోంది.   

రిజర్వేషన్లు రాకుండా చంద్రబాబు కుట్ర  
► గతంలో 59.85 శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నిలు జరిగాయి. అందులో 34 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలయ్యాయి. ఎన్నికలు జరపాలని 2018 అక్టోబర్‌ 23న హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా, తనకు అనుకూలంగా లేదని చంద్రబాబు ఎన్నికలు జరపలేదు.
► మనం అధికారంలోకి వచ్చాక ఎన్నికలకు వెళితే రిజర్వేషన్లు 50 శాతమే ఉండాలి కదా? 59.85 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారని కేసు వేయించారు. దీంతో 50 శాతం రిజర్వేషన్లతోనే తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలకు పోవాల్సి వచ్చింది.

దేనిలోనూ చిత్తశుద్ధి లేదు  
► ఫీజు రీయింబర్స్‌మెంట్, మెస్‌ బిల్లులు దాదాపు రూ.3 వేల కోట్లు బాబు బకాయిలు పెడితే, మనం చెల్లించాం. పెండింగు లేకుండా తల్లుల ఖాతాల్లో జమ చేసేలా వ్యవస్థను తీసుకువచ్చాం.
► చంద్రబాబు పొదుపు సంఘాల రుణాలు రూ.14,200 కోట్లకు పైగా మాఫీ చేస్తానని చెప్పి చేయలేదు. అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ ఇవ్వక పోవడంతో వారిపై రూ.3,036 కోట్ల భారం పడింది. మన ప్రభుత్వం వచ్చాక సున్నా వడ్డీ పథకాన్ని నిజాయితీగా అమలు చేస్తున్నాం. ఈ పథకంలో 2019–20లో అక్షరాలా రూ.1,400 కోట్లు ఇచ్చాం.
► గత ప్రభుత్వ హయాంలో ప్రైవేట్‌ స్కూళ్ల కోసం ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేశారు. కానీ మన ప్రభుత్వం నాడు–నేడు ద్వారా రూ.10 వేల కోట్లకు పైగా వ్యయంతో 45 వేల స్కూళ్లను ప్రైవేట్‌ స్కూళ్లకు దీటుగా ఆధునీకరిస్తోంది. మధ్యాహ్న భోజన పథకంలో క్వాలిటీ పెంచాం.   పిల్లల్లో 85 శాతం మెదడు వికాసం ఆరేళ్లలోపే జరుగుతుంది. ఈ దృష్ట్యా పిల్లలు, తల్లులు, గర్భవతులు, పాలిచ్చే తల్లుల ఆరోగ్యం బావుండాలని వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ అని అమలు చేస్తున్నాం.   

అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారునికే
► ప్రవేశపెట్టిన ప్రతి పథకం సంతృప్త స్థాయిలో అర్హులందరికీ చేరాలన్నది మన ప్రభుత్వ ఆలోచన. ఇందుకని గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతి 50 ఇళ్లకు వలంటీర్‌ను పెట్టాం. ఎవరైనా పథకంలో మిస్‌ అయితే, దరఖాస్తు తీసుకుని అర్హత ఉంటే, ఆ తర్వాత నెలలోనే ఇస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎంతో చేశాం. ఐదుగురు డిప్యూటీ సీఎంలలో వారే నలుగురు ఉన్నారు. 60 శాతం మంత్రి పదవులు వారికే ఇచ్చాం. అణగారిన బీసీ కులాలను గుర్తించి 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. ఎస్సీలలో విభేదాలు రాకుండా వేర్వేరుగా మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం.   
► రాజ్యసభకు పంపిన నలుగురిలో ఇద్దరు బీసీలు, మండలికి ఇద్దరు ఎస్సీలు, ఇద్దరు మైనార్టీలు, ఒకరు బీసీ ఉన్నారు. కార్పొరేషన్లు, ఆలయాల చైర్మన్లు, పాలక మండళ్లు, మార్కెట్‌ కమిటీలలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చే విధంగా చట్టాలు చేశాం. గ్రామ సచివాలయాల్లో వారికి 82 శాతం ఉద్యోగాలు దక్కాయి.
► అక్షరాలా 1.26 లక్షల గ్రామ సచివాలయ ఉద్యోగాలు, 2.61లక్షల వలంటీర్ల ఉద్యోగాలు ఆ విధంగా దాదాపు 4 లక్షల ఉద్యోగాలు కల్పించాం.


అక్కచెల్లెమ్మలకు ప్రతి అడుగులోనూ తోడుగా..
► మహిళా పక్షపాత ప్రభుత్వంగా ప్రతి అడుగులో చూపాం. ప్రతి పథకంలో లబ్ధిదారులు అక్క చెల్లెమ్మలే. వైఎస్సార్‌ చేయూత ద్వారా అక్క చెల్లెమ్మల జీవితాలు మార్చేలా రిలయెన్స్, ఐటీసీ, పీ అండ్‌ జీ, అల్లానా, హిందుస్తాన్‌ యూనీ లీవర్, అమూల్‌ వంటి పెద్ద సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. రీటెయిల్‌ రంగంలో 77 వేల షాపులు ఏర్పాటు చేశాం.  
► 4.69 లక్షల అక్క చెల్లెమ్మలకు పాడి ఆవులు, గేదెలు.. 2.49 లక్షల అక్క చెల్లెమ్మలకు మేకలు, గొర్రెల యూనిట్లు ఇస్తున్నాం. 31 లక్షల ఇళ్ల స్థలాలు నేరుగా అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తున్నాం.
► మహిళల కోసం దిశ చట్టం బిల్లు తీసుకొచ్చి,, దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశాం. నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ పనుల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పించాం.  దశలవారీ మద్య నియంత్రణ ఒక పాలసీగా అడుగులు వేశాం. 43 వేల బెల్టు షాపులు రద్దు చేశాం. వీటన్నింటి వల్ల మద్యం అమ్మకాలు తగ్గినా, ధరలు పెంచాం కాబట్టి ఆదాయం తగ్గలేదు.   

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి చేసిన వ్యయం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంటే జూన్‌ 2019 నుంచి నవంబర్‌ 2020 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి 58,729 కోట్ల రూపాయలు వ్యయం చేసింది. ఇందులో ఒక్క ఏడాదిలో వ్యయం చేసినది రూ.39,153 కోట్లు. అదే టీడీపీ ప్రభుత్వం ఏడాదికి సగటున ఆ వర్గాల సంక్షేమానికి ఖర్చు చేసింది కేవలం రూ.15,962 కోట్లే.


Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా