ఐదు కోట్ల ఆంధ్రుల సమాచారం చోరీ? సభా సంఘానికి సై

22 Mar, 2022 13:00 IST|Sakshi

పెగసస్‌ స్పైవేర్‌ వ్యవహారంపై అసెంబ్లీ ఏకగ్రీవ నిర్ణయం 

చంద్రబాబు చేసింది రాజ్యాంగ, పౌర హక్కుల ఉల్లంఘన 

అనుకూలంగా లేని వారి ఓట్లను అడ్డగోలుగా తొలగించారు

పెగసస్‌ స్పైవేర్‌ను కొనుగోలు చేయడమంటే మానవ హక్కులను చోరీ చేసినట్లే

ఇది అత్యంత ప్రమాదకరమైన సాఫ్ట్‌వేర్‌.. మూడేళ్లలో 5 కోట్ల మంది వ్యక్తిగత సమాచారం చోరీ 

నిఘాకు డ్రోన్లు, స్పైవేర్‌ వినియోగించినట్లు ఆధారాలున్నాయి

వ్యక్తిగత సమాచారం చోరీ, ఓట్ల  తొలగింపు, ఫోన్లు ట్యాపింగ్‌పై విచారణ జరపాలి: మంత్రి బుగ్గన

పెగసస్‌ సాఫ్ట్‌వేర్‌ కొన్నారని బెంగాల్‌ సీఎం కూడా చెబుతున్నారు

విచారణకు పట్టుబట్టిన ఎమ్మెల్యేలు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెగసస్‌ స్పైవేర్‌ బాగోతంపై సోమవారం అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై హౌస్‌ కమిటీ ఏర్పాటుచేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. గత కొద్దిరోజులుగా ఈ స్పైవేర్‌ ఉదంతం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. టీడీపీ హయాంలో దీనిని కొనుగోలు చేశారన్న పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో దీనిపై పెద్దఎత్తున చర్చ మొదలైంది. రాష్ట్ర శాసనసభలోనూ సోమవారం తీవ్ర దుమారం రేపింది. అప్పటి ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నేతల ఫోన్ల ట్యాపింగ్‌ వ్యవహారం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది.

ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు, పలువురు సభ్యులు దీనిమీద స్వల్పకాలిక చర్చకు అనుమతించాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాంను కోరారు. అందుకు స్పీకర్‌ జోక్యం చేసుకుని నోటీసు ఇచ్చారా ప్రశ్నించారు. దీంతో.. నోటీసు ఇచ్చినట్లు చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంతరెడ్డి తెలిపారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం అనంతరం ఈ అంశంపై చర్చ చేపడతామంటూ స్పీకర్‌ ప్రకటించారు. అనంతరం జరిగిన చర్చలో.. ఈ వ్యవహారం మీద సభా సంఘం ఏర్పాటుచేయాలని సభ్యులు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. దీంతో సభా సంఘం ఏర్పాటుచేయడానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా నిర్ణయించింది.
 
అడ్డగోలుగా ఓట్లను తొలగించారు
ఇక చర్చలో పాల్గొన్న ఆర్థికమంత్రి బుగ్గన ప్రధానంగా మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరిగిందని, తమకు అనుకూలంగా లేనివారి ఓట్లను అడ్డగోలుగా తొలగించారని, అందుకోసం ప్రభుత్వ వ్యవస్థలను వాడుకున్నారని వివరించారు. తమ రాజకీయ లబ్ధికోసం అప్పటికప్పుడు కొత్త కంపెనీలను సృష్టించి ఇజ్రాయిల్‌ నుంచి పెగసస్‌ స్పైవేర్‌ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసినట్లు వస్తున్న ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయించాలని కోరారు.

ఐటీ గ్రిడ్, సేవామిత్ర ద్వారా ప్రజల స్వేచ్ఛకు చంద్రబాబు భంగం కలిగించారని, ఆ సమయంలో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ వేగంగా స్పందించడంతో టీడీపీ కుట్ర భగ్నమైందన్నారు. నిజానికి.. చంద్రబాబు, మమతా బెనర్జీలు కలిసి బీజేపీని ఓడించేందుకు ఒకప్పుడు పనిచేశారని, అలాంటి బెంగాల్‌ సీఎం ఎలాంటి ఆధారం లేకుండా మాట్లాడరని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. అలాగే, పెగసస్‌ స్పైవేర్‌ వినియోగించారనడానికి.. ప్రతిపక్ష నాయకులు, పారిశ్రామికవేత్తలపై కూడా నిఘా పెట్టారనడానికి కొన్ని సంఘటనలు ఊతం ఇస్తున్నాయని బుగ్గన తెలిపారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే.. 

గత కొన్ని నెలలుగా దేశంలో ‘పెగసస్‌’ గురించి వివాదం రగులుతోంది. దీంతో సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి ఆర్వీ రవీంద్రన్‌ చైర్మన్‌గా కమిటీని వేసింది. ఇందులో అనుభవజ్ఞులైన రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి అలోఖ్‌ జోషి, డాక్టర్‌ సందీప్‌ ఓబెరాయ్, మరో ముగ్గురితో కూడిన టెక్నికల్‌ కమిటీని నియమించింది. అలాగే, దేశంలోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీ డీన్‌ అయిన డాక్టర్‌ నవీన్‌కుమార్‌ చౌదరి, అమృతా విద్యాపీఠం స్కూల్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ప్రభాకరన్, ఐఐటీ బాంబే కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం హెడ్‌ డాక్టర్‌ అశ్విని అనిల్‌తో కూడిన కమిటీనీ వేసింది. ఈ నేపథ్యంలో.. ఇటీవల పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీలో అక్కడి సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘నాలుగైదేళ్ల క్రితం స్‌పైవేర్‌ అమ్మేందుకు ఇజ్రాయిల్‌ కంపెనీ బెంగాల్‌ ప్రభుత్వాన్ని సంప్రదించింది. అప్పట్లో రూ.25 కోట్ల మేర అడిగారు.. మేం తీసుకోలేదు. కానీ, అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు స్‌పైవేర్‌ తీసుకున్నట్లు నాకు సమాచారం ఉంది’ అని ఆమె చెప్పారు. ఈ విషయాన్ని ఈనాడు పత్రికలో కూడా వచ్చింది.

మానవ హక్కులను చోరీ చేసినట్లే
ఇక అప్పటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న పోలీసు ఉన్నతాధికారి ఇజ్రాయిల్‌ వెళ్లడం, ఆ తర్వాత ఆయన తనయుడు అప్పటికప్పుడే ఓ కంపెనీని నెలకొల్పడం పలు అనుమానాలను బలపరుస్తున్నాయి. వేరేవారి వ్యక్తిగత విషయాల్లోకి తొంగిచూడటం ఎంతో తప్పని తెలిసినా పెగసస్‌ స్‌పైవేర్‌ కొనుగోలు చేయడమంటే మానవ హక్కులను చోరీ చేసినట్లే. ఈ సాఫ్ట్‌వేర్‌ సాయంతో ఏదైనా ఫోన్‌కు మిస్డ్‌కాల్‌ ఇస్తే ఆ ఫోన్‌లోకి సాఫ్ట్‌వేర్‌ వచ్చేస్తుంది. దీనిద్వారా మనం ఎవరికి ఫోన్‌ చేస్తున్నామో, మెసేజ్‌లు, వాట్సాప్, కాంటాక్టులు అవతలి వారికి తెలిసిపోతుంది. చివరకు ఫోన్‌ కెమెరాలోకి కూడా ఆ సాఫ్ట్‌వేర్‌ ప్రవేశిస్తుంది. మనం ఎక్కడున్నాం.. ఎవరితో మాట్లాడుతున్నాం.. తదితర వివరాలతో పాటు సమస్త సమాచారం తెలుసుకునేంత అత్యంత ప్రమాదకరమైన సాఫ్ట్‌వేర్‌ ఈ పెగసస్‌.

ఎంత భద్రతా ప్రమాణాలున్న ఫోన్‌ అయినా ఈ సాఫ్ట్‌వేర్‌తో ట్రాక్‌చేసే ప్రమాదముంది. ఇలా పెగసస్‌తో మొత్తం 5 కోట్ల ఆంధ్రులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం మొత్తం 2017, 18, 19లో చోరీకి గురైనట్లు నిర్ధారణ అవుతోంది. దీనిని కొనుగోలు చేశారా? చేసి ఉంటే దీనితో ఏమేం చేశారో చూడాల్సిన అవసరం ఉంది. ఇంటర్నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ జర్నలిస్టులు జూలై 2020, 21లో చేసిన దర్యాప్తులో అజర్‌బైజాన్, హంగేరి, కజకిస్థాన్, మెక్సికో, మొరాకో, రువాండా, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌తో పాటు భారత్‌లో కూడా ఈ పెగసస్‌ సాఫ్ట్‌వేర్‌ను కొని వినియోగించారని తేల్చారు. పెగాసస్‌పై 2019లో వాట్సప్, ఐఫోన్‌ కంపెనీలు సైతం ఫిర్యాదులు చేశాయి. 

ఆఘమేఘాలపై ప్రతిపాదనలు.. కంపెనీ ఏర్పాటు.. ఒప్పందం..
భద్రతా అవసరాల కోసం డ్రోన్లు కొనుగోలు చేయాలని అప్పటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు 2017 జూన్‌ 14న నాటి డీజీపీకి ప్రతిపాదించారు. అలాగే, ఆగస్టు 30న ప్రిన్సిపల్‌ సెక్రటరీకి అప్పటి డీజీపీ లేఖ రాశారు. అందులో భద్రతా అవసరాల కోసం డ్రోన్లు కొనుగోలు చేయాలని.. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ అడుగుతున్నందున వాటిని స్టేట్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా కొనుగోలు చేయాలని కోరారు. దీంతో టెండర్లు ఆహ్వానించారు.

నాలుగు కంపెనీలు.. మెస్సర్స్‌ రేడియల్ట్‌ కోరల్‌ డిజిటల్‌ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బెంగళూరు, మెస్సర్స్‌ ఆల్సాఫ్‌ హెలికైడ్స్‌ లిమిటెడ్‌ ఇంగ్లండ్, మెస్సర్స్‌ ఆర్‌టీ ఇన్‌ప్‌లైటబుల్‌ ఆబ్జెక్టŠస్‌ లిమిటెడ్‌ ఇజ్రాయిల్, మెస్సర్స్‌ ఎన్‌వీఎం స్కైటెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ గురుగ్రామ్‌ సంస్థలు ముందుకొచ్చాయి. వీటిలో ఆర్‌టీ ఇన్‌ప్‌లైటబుల్‌ ఆబ్జెక్టŠస్‌ లిమిటెడ్‌ తప్ప మిగతావి వెనక్కి వెళ్లిపోయాయి. మరోవైపు.. ఇజ్రాయిల్‌కు చెందిన ఆర్‌టీ ఇన్‌ప్‌లైటబుల్‌ ఆబ్జెక్టŠస్‌ లిమిటెడ్‌ కంపెనీకి ఇండియాలో డీలర్‌.. ఏబీ వెంకటేశ్వరరావు కొడుకు చేతన్‌ సాయికృష్ణకు చెందిన ఆకాశం అడ్వాన్డ్స్‌ సిస్టమ్స్‌ కంపెనీ. దీన్ని 2017 జూలై 11న స్థాపించారు. అదే ఏడాది జూన్‌ 14న ఏబీ వెంకటేశ్వరరావు డ్రోన్లు కొనాలని ప్రతిపాదించారు. అంతేకాదు.. ఏబీ అదే ఏడాది ఏప్రిల్‌ 2న, నవంబర్‌ 19న ఇజ్రాయిల్‌కు వెళ్లారు.

పరికరాల కొనుగోలుకు రూ.16 కోట్లు మంజూరైన తరువాత.. అది చాలదని చెప్పారు. రూ.3.37 కోట్ల లెఫ్ట్‌ఓవర్‌ బడ్జెట్‌ ఉందని.. అర్జెంట్‌గా రూ.16కోట్లతో వాటిని కలిపి అప్పటికే మంజూరైన ప్రాజెక్టులను రద్దుచేసి వాటికి చెందిన రూ.4.80 కోట్లు ఇవ్వాలని లేఖ రాశారు. అలాగే, అన్‌మ్యాన్డ్‌ ఏరియల్‌ వెహికిల్‌ డ్రోన్లకు రూ.22.19 కోట్లు, ఎయిరోస్టాట్స్‌ డ్రోన్లకు రూ.3.31 కోట్లు.. రెండూ కలిపి రూ.25.5 కోట్లు ఇచ్చారు. ఆ తర్వాత   పలువురు పోలీస్‌ ఉన్నతాధికారులు సమావేశమై ఈ డ్రోన్ల ప్రాజెక్టును రద్దుచేశారు. కానీ, ఏబీ వెంకటేశ్వరరావు వాటిని పునరుద్ధరించాలని పదేపదే కోరిన విషయం కూడా కనిపిస్తోంది.

ఇజ్రాయిల్‌ నుంచి పెగసస్‌ స్పైవేర్, నిఘాకు డ్రోన్లు కొనుగోలు చేసి, వాటితో నాటి ప్రతిపక్ష పార్టీ నేతలపైనా.. సినీ పెద్దలు, పారిశ్రామిక రంగ ప్రముఖులపైనా ప్రయోగించినట్లు ఆధారాలు ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ నేత సజ్జలతో పాటు పార్టీకి చెందిన పలువురి ఫోన్‌ నంబర్లు అన్నీ కలిపి 2018 డిసెంబర్‌ 24న అధికారికంగా ట్యాపింగ్‌లో పెట్టారు. ఉగ్రవాదులు, అంతర్జాతీయ నేరస్తులకు సంబంధించిన జాబితాలో వీరి నెంబర్లు కూడా చేర్చారు. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి అప్పట్లో అఫిడవిట్‌ సమర్పించారు.

వ్యతిరేకులపై పెగసస్‌ ప్రయోగం 
అంతేకాదు.. చంద్రబాబు హైదరాబాద్‌లో ఐటీ గ్రిడ్‌ పేరుతో ప్రత్యేక విభాగాన్నే ఏర్పాటుచేసి ప్రజలపై ప్రయోగించారు. రాజకీయ నేతలతో పాటు ప్రతి ఓటరుపై నిఘా పెట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఐటీ గ్రిడ్‌ కంపెనీ మీద 2019 మార్చి 2న మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సేవా మిత్ర యాప్‌ ద్వారా ప్రతీ ఓటరు మీద నిఘా పెట్టి తద్వారా వారు ఏ పార్టీకి ఓటు వేసేందుకు అవకాశం ఉందో తెలుసుకున్న తరువాత వారి పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు ప్రయత్నించినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి. అంతకుముందు.. 2016లో టీడీపీ ప్రజా సాధికార సర్వేను మొదలుపెట్టి పథకాల లబ్ధిదారుల వివరాలు తీసుకుంది.

తరువాత ఆర్టీజీఎస్‌ అనే వ్యవస్థ పెట్టి డేటా అంతా ఇంటిగ్రేట్‌ చేసుకున్నారు. ‘1100’ నెంబర్‌ ద్వారా పథకాలన్నీ అందుతున్నాయా అని ఫోన్లు చేసేవారు. ఎవరైనా టీడీపీ పాలన బాగోలేదని చెబితే.. వారిని ఓటరు జాబితా నుంచి తొలగించే వారు. నిజానికి.. లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు అశోక్‌ దాకవరం రాష్ట్ర ప్రజల ఆధార్‌ డేటాను అనైతికంగా, చట్టవిరుద్ధంగా చోరీచేసి ఐటీ గ్రిడ్‌కు ఇచ్చారు. సేవామిత్ర ట్యాబ్‌ల్లో ఆ డేటా అంతా ఉంది. వీటన్నింటి ఆధారాలను సభ ముందుంచుతున్నా. వ్యక్తిగత సమాచారం చోరీ చేయడం, ఓట్లను తొలగించడం, ఫోన్లు ట్యాంపరింగ్‌ చేయడం వంటి తీవ్ర ఆరోపణలపై లోతుగా విచారణ జరిపి ఈ మొత్తం అంశంపై సభా సంఘం ఏర్పాటుచేసి గత టీడీపీ ప్రభుత్వ నేరాలపై విచారణ చేయాలి.. అని బుగ్గన కోరారు.

‘మండలి’లోనూ పట్టు
మరోవైపు.. పెగాసెస్‌ అంశంపై హౌస్‌ కమిటీ ద్వారా లేదా మరో రూపంలో విచారణ జరిపించాలని శాసన మండలిలోనూ పలువురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, మహ్మద్‌ ఇక్బాల్, మొండితోక అరుణ్‌కుమార్, కృష్ణరాఘవ జయేంద్ర భరత్‌లు సభలో దీనిపై మాట్లాడారు. ఈ సమయంలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ మాట్లాడుతూ.. ఏ నిబంధన ప్రకారం ఈ అంశంపై చర్చకు అనుమతించారని చైర్మన్‌ మోషేన్‌రాజును ప్రశ్నించారు. దీనికి ఆయన బదులిస్తూ.. ఇది చర్చకాదని, సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారని చెప్పారు. 

మరిన్ని వార్తలు