‘దేశం మొత్తంలో రైతు పక్షపాత ప్రభుత్వంగా నిలిచాం’

1 Dec, 2020 05:34 IST|Sakshi

నివర్‌ తుపాను బాధిత రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం 

రంగు మారిన ధాన్యాన్నే కాదు మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం

చనిపోయిన వారికి ఇప్పటికే రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇచ్చాం

సహాయ శిబిరాల్లో ఉండి వెళ్లిన వారందరికీ రూ.500 చొప్పున చెల్లింపు

ఆ విధంగా ఒక్కో ఇంటికి దాదాపు రూ.2 వేల తక్షణ ఆర్థిక సహాయం

పంట నష్టాలపై డిసెంబరు 15వ తేదీలోగా అంచనాలు పూర్తి

వాటికి డిసెంబరు 31 నాటికి ఇన్‌పుట్‌ సబ్సిడీ (పెట్టుబడి సాయం) చెల్లింపు

ఇది రైతు పక్షపాత ప్రభుత్వం, వారికి ఎక్కడా నష్టం కలగనివ్వబోము

ఏ సీజన్‌లో జరిగిన నష్టానికి అదే సీజన్‌లో పరిహారం చెల్లింపు

దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం పలు కార్యక్రమాలు

రైతుల పంట రుణాలపై సున్నా వడ్డీ, ప్రభుత్వమే ఇన్సూరెన్సు చెల్లింపు

డిసెంబరు 15న బీమా పరిహారం (క్లెయిమ్స్‌) రూ.1227 కోట్లు

అమూల్‌ కంపెనీ ద్వారా పాలకు అత్యధిక ధరల చెల్లింపు

తద్వారా సహకార రంగంలోని డెయిరీల పునరుద్ధరణ

శాసనసభలో వ్యవసాయరంగంపై జరిగిన చర్చలో సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: దేశంలో 29 రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతుల పక్షపాత ప్రభుత్వంగా చేస్తున్న మేళ్లను పక్కదోవ పట్టించేందుకే ప్రతిపక్ష నేత చంద్రబాబు మొసలి కన్నీరు కార్చుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. నివర్‌ తుఫాన్‌ ప్రభావం వల్ల పంటలు నష్టపోయిన రైతులకు దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా నెల తిరక్కుండానే డిసెంబర్‌ 31న ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లిస్తామని స్పష్టం చేశారు. ప్రకృతి వైఫరీత్యాల వల్ల పంటల నష్టపోయిన రైతులకు ఆ సీజన్‌లో ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లిస్తున్నామని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రంగు మారిన ధాన్యాంతోపాటు మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని ఎత్తిచూపారు.

కాబట్టి రైతుల తరపున చంద్రబాబు మొసలి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదన్నారు. తుఫాన్‌ వచ్చినప్పుడు.. వరదలొచ్చినప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తాను క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతులకు అండగా నిలిచానంటూ సీఎం వైఎస్‌ జగన్‌ గుర్తు చేస్తూ.. అదే  చంద్రబాబు మాత్రం హైదరాబాద్‌లో కూర్చున్నారని దుయ్యబట్టారు. అందుకే బుగ్గన రాజేంద్రనాథ్‌ సీబీఎన్‌ అంటే కరోనాకు భయపడే నాయుడు అని పేరు పెట్టారని వ్యంగాస్త్రాలు విసిరారు. శాసనసభ ద్వారా రైతులకు ఏం చేయబోతున్నామో చెప్పబోతుంటే.. దాన్ని అడ్డుకోవడానికి ఎల్లో మీడియా డైరెక్షన్‌లో చంద్రబాబు డ్రామాలాడుతూ మొసలి కన్నీరు కార్చుతున్నారని మండిపడ్డారు.
(చదవండి: 40 ఏళ్లు నేర్చుకున్న సంస్కారం ఇదేనా..?)

మొలకెత్తిన ధాన్యం, రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చిన ఈ ప్రభుత్వం మంచిదా? కాదా? అన్నది ఒక్కసారి ఆలోచించాలని కోరారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై సోమవారం శాసనసభలో జరిగిన చర్చ అనంతరం.. గత 18 నెలలుగా వ్యవసాయ, అనుబంధ రంగాలు, రైతుల మేలు కోసం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన అంశాలను సీఎం వైఎస్‌ జగన్‌ సవివరంగా వివరించారు. ఆయన ప్రసంగం ఆయన మాటల్లోనే..

చంద్రబాబు డ్రామా, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఎల్లో మీడియా..
కాసేపటి క్రితం పెద్ద డ్రామా మన కళ్లతో మనం చూశాం. చంద్రబాబు యాక్టర్‌ అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీళ్లంతా కధ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌. ఇది ఆంధ్ర రాష్ట్రంలో మీడియా పరిస్థితి, దుస్థితి. ఎలాగూ దీనిపై ఇవాళ సభలో చర్చ జరుగుతుంది. ప్రభుత్వం అన్ని రకాలుగా మంచి చేస్తోంది. రైతుల విషయంలో ప్రభుత్వాన్ని వేరే రకంగా చూపించడం కష్టం అవుతుంది అనే ఒక దుర్భుద్ధితో ఒక డ్రామా. చంద్రబాబు ఎందుకంత రెచ్చిపోయారో ఆయనకే తెలియదు. వారి పార్టీ మనిషే నిమ్మల రామానాయుడు మాట్లాడుతున్నారు. ఆయన లేవనెత్తిన అంశాలపై క్లారిఫికేషన్‌ ఇచ్చాం. ఆ తర్వాత రామానాయుడే మాట్లాడాలి. కానీ వెంటనే చంద్రబాబు అందుకున్నారు. సడెన్‌గా లేచి నేను మాట్లాడతానని అన్నారు. ఒక టాపిక్‌ అనేది ఎప్పుడు కూడా ఒక పద్దతి ప్రకారం పోతుంది. అంతే కానీ క్లారిఫికేషన్‌ ఇచ్చిన తర్వాత మళ్లీ అందుకోవడం అనేది ఎప్పుడూ జరగదు. అది ఆయనకూ తెలుసు. తెలిసినా వెంటనే రెచ్చిపోవడం. అసలు ఆశ్చర్యకరం.

ఐదేళ్లలో నేను ఎప్పుడూ అలా వ్యవహరించలేదు
నేను 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. కానీ ఎప్పుడూ పోడియమ్‌లోకి రాలేదు. దటీజ్‌ ది డీసెన్సీ ఎనీ బడీ ఫాలోస్‌.  చంద్రబాబు 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటాడు. ఆయనే పోడియమ్‌లోకి రావడం, వచ్చిన వెంటనే అందరినీ నెట్టేసి కూర్చోవడం. ఆ తర్వాత పక్క నుంచి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 స్క్రీన్‌ప్లే ప్రకారం దాని ఎత్తుకోవడం, దాన్ని రేపు పొద్దున పేపర్లలో రాయడం.

అవే హెడ్‌లైన్లు
రైతుల కోసం ముఖ్యమంత్రి ఏం చెప్పారు? రైతులకు ఏ రకంగా దీని వల్ల మంచి జరుగుతుంది అన్నది రేపు పొద్దున హెడ్డింగ్స్‌ ఉండవు. చంద్రబాబు అనే వ్యక్తి ఫ్లోర్‌ మీద కూర్చోవడం. మార్షల్స్‌ ఎత్తుకోవడం, అవే హెడ్డింగ్‌లు. దీనికి సంబంధించిన డ్రామా. కధ. స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5. మా ఖర్మ, ఆంధ్ర రాష్ట్రంలో ఇంత దరిద్రమైన మీడియా వ్యవస్థను ప్రతిపక్ష నాయకుడు నడుపుతా ఉన్నాడు అంటే, నిజంగా షేమ్‌.

దురుద్దేశ రాజకీయాలు
రైతులందరూ కూడా వేచి చూస్తున్నారు. ఒక అనుకోని పరిస్థితి వచ్చింది. క్యాబినెట్‌లో నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వెంటనే అసెంబ్లీ కూడా జరుగుతోంది. దీని మీద చర్చ జరుగుతా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెబుతారు? ఆ మాటల వల్ల తమకు ఏమైనా మంచి జరుగుతుందా? అన్న మాటలు వినడానికి చాలా మంది ఆరాటపడుతున్నారు. అటువంటివన్నీ కూడా కనిపించకూడదు. వినిపించకూడదు అని చెప్పి చంద్రబాబు చేస్తున్న దురుద్దేశ రాజకీయాలు చూస్తున్నాం. 

పదేళ్లలో లేని విధంగా అంతా సుభిక్షం
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి 18 నెలలు అయ్యింది. ఇది మాకు రెండో నవంబరు మాసం. ఈ నవంబరు చివరి నాటికి రాష్ట్రంలోని ఏ రిజర్వాయర్‌ తీసుకున్నా గతంలో చంద్రబాబు పాలన చూశాం. గతంలో ఎప్పుడూ లేనంతగా అన్ని రిజర్వాయర్లు ఇప్పుడు నీటితో కళకళలాడుతున్నాయి. గత పదేళ్లలో ఏనాడూ లేనంతగా భూగర్భ జలాలు రీఛార్జ్‌ అయ్యాయి. అయితే దురదష్టవశాత్తూ దీపం వెలుగు కింద చీకటి ఉన్నట్లు ఆగస్టు నుంచి నవంబరు వరకు అడపా దడపా కురిసిన వర్షాల వల్ల మన రైతులకు కొంత నష్టం కలిగింది. ఆ నష్టం జరిగినప్పుడు వెంటనే నిజాయితీగా సమీక్షించాను. వెంటనే ఆ సీజన్‌కు సంబంధించిన పంట నష్టం, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడం అనేది గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు. అటువంటిది మనసున్న ప్రభుత్వంగా, రైతుల కష్టం తెలిసిన ప్రభుత్వంగా, రైతులకు తోడుగా ఉండేందుకు మన ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన అడుగులు వేయడం జరిగింది. 
(చదవండి: సీబీఎన్‌ అంటే.. కరోనాకు భయపడే నాయుడు)

రైతులకూ నాకూ మధ్య ఆత్మీయ బంధం
ఇవన్నీ కూడా ఏదో ప్రతిపక్షం విమర్శిస్తుందనో చేయలేదు. పత్రికల్లో రాశారనో ఈ స్టేట్‌మెంట్‌ ఇవ్వడం లేదు. రైతులకూ నాకూ మధ్య ఉన్న బలమైన ఆత్మీయ అనుబంధంతోనే..  రైతు పక్షపాత ప్రభుత్వం  మనది అని కూడా గర్వంగా తెలియజేస్తూ, ఈ విషయాలు చెబుతున్నాను.

చరిత్రలో ఇదే ప్రథమం
ఖరీఫ్‌ సీజన్‌లో పంట నష్టపోయిన రైతులకు ఆ నష్టం వర్షాల వల్ల కావచ్చు, తుపాను వల్ల కావచ్చు, వరదల వల్ల కావచ్చు.. కారణం ఏదైనా ప్రకతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు అదే సీజన్‌లో నష్ట పరిహారం చెల్లించడం అన్నది చరిత్రలో ఇదే తొలిసారి. ఇదే ప్రథమం. ఈ ఏడాది జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు అకాల వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులకు అక్షరాలా రూ.143 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీగా ఈ ఏడాది రైతు భరోసా రెండో విడత మొత్తంతో గత అక్టోబరు 27న ఇవ్వడం జరిగింది. అక్టోబరు నెలలో వచ్చిన అ«ధిక వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు నవంబరు 17న ఒక నెల కూడా తిరక్క ముందే రూ.132 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీగా అందించాం. మళ్లీ నవంబరులో నివర్‌ తుపాను వల్ల పంటలకు, ఇళ్లకు, రోడ్లకు, చెరువులకు కూడా నష్టం వాటిల్లింది. ఈ నష్టాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ నిర్ణయాలు ప్రకటిస్తోంది. ఇప్పటికే చాలా వాటిని చెప్పడం జరిగింది. ఇప్పుడు మరింత వివరంగా..

అన్ని విధాలా ఆదుకుంటాం..
భారీ వర్షాల కారణంగా సహాయ శిబిరాల్లో తలదాచుకున్న వారికి రూ.500 చొప్పున ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించాం. చిన్న వారు కావొచ్చు, పెద్ద వారు కావొచ్చు. అవ్వలు కావొచ్చు. తాతలు కావొచ్చు. చివరకు 3 ఏళ్ల పిల్లవాడు లేదా సంత్సరం పిల్లవాడు కూడా కావొచ్చు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి మనిషికి రూ.500 చొప్పున ఎంత మంది అయితే సహాయ శిబిరాల్లో ఉంటారో వారందరికీ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఒక ఇంటిలో దాదాపు నలుగురు ఉంటారు. ఆ విధంగా ప్రతి ఇంటికి దాదాపు రూ.2 వేలు ఇచ్చినట్లు అవుతుంది. ఎవరైతే నీళ్లు వచ్చి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారో. వారిని శిబిరాలకు తరలించడమే కాకుండా, అక్కడ వారిని అన్ని రకాలుగా చూసుకోవడమే కాకుండా, వారిని ఇంటికి పంపించేటప్పుడు, ఇళ్లకు వచ్చిన తర్వాత మళ్లీ ఇబ్బంది పడకుండా మనిషికి రూ.500 చొప్పున, ఒక ఇంట్లో ఉజ్జాయింపుగా నలుగురు ఉంటారనుకుంటే మొత్తం రూ.2 వేలు చేతిలో పెట్టి పంపడం జరిగింది. అయితే ఈ ఆదేశాలు వచ్చే సరికే శిబిరాల నుంచి తిరిగి ఇళ్లలోకి వెళ్లిన వారందరి ఇళ్లకు వెళ్లి డబ్బులు ఇస్తామని నెల్లూరు, కడప, చిత్తూరు తదితర జిల్లాల కలెక్టర్లు వెల్లడించారు. 

పంట ఇతర నష్టాలపై..
ఇదే కాకుండా పంట నష్టాలన్నింటినీ డిసెంబరు 15 నాటికి మదింపు చేసి, పరిహారాన్ని డిసెంబరు 31లోగా రైతులకు ఇవ్వబోతున్నాం. ఇది కూడా కరెక్టుగా చూస్తే నెలలోపే. ఇది చూసినప్పుడు నిజంగా ఇది ఎంత మంచి ప్రభుత్వం అని చెప్పి ఎవరికైనా అనిపిస్తుంది. అంతే కాకుండా ఆ డబ్బు కూడా వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇదొక్కటే కాకుండా, మళ్లీ పంట వేయడానికి కావాల్సిన విత్తనాలను రైతులకు 80 శాతం సబ్సిడీ మీద అందించడం జరుగుతోంది. ఆ మేరకు ఆదేశాలు కూడా ఇచ్చాం. ఇళ్లకు జరిగిన నష్టానికి, పశువులు, కోళ్లు నష్టపోయిన వారికి, పడవలు, వలలు నష్టపోయిన వారి అంచనాలు కూడా డిసెంబరు 15 లోగా పూర్తి చేసి, డిసెంబరు 31లోగా పరిహారం కూడా ఇవ్వబోతున్నాం.

మరణించిన వారి కుటుంబాలకు ఇప్పటికే పరిహారం
తుపాను వల్ల అనుకోకుండా 8 మంది చనిపోయారు. వారి కుటుంబాలకు ఊరట కలిగించాలని చెప్పి, వెంటనే రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశాలు కూడా జారీ చేశాం. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు, చెరువులకు జరిగిన నష్టాన్ని కూడా పూర్తిస్థాయిలో అంచనా వేసి, వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విద్యుత్‌ సరఫరా నిల్చిపోయిన చోట్ల యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయడంతో దాదాపు అన్ని చోట్ల విద్యుత్‌ పునరుద్ధరణ జరిగింది. మిగిలిన చోట్ల కూడా రెండు, మూడు రోజుల్లో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ జరుగుతుంది.

రంగు మారిన ధాన్యమే కాదు.. మొలకెత్తిన ధాన్యమూ కొనుగోలు
ఇంకా ఈ వర్షాల వల్ల రాయలసీమ జిల్లాలే కాకుండా, ఈ పక్క కష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలలో కూడా పంటలు దెబ్బ తిన్నాయి. పంటలు నీట మునిగాయి. ధాన్యం రంగు మారింది. ఇంకా కొన్ని చోట్ల ధాన్యం మొలకలెత్తి కొందరు రైతులు అవస్థలు పడడం కూడా కనిపించింది. ఇంతకు ముందు రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయడం అంటే ఒక గొప్ప ఘనకార్యంగా భావించే పరిస్థితులే తప్ప, ఎప్పుడూ కూడా ధాన్యం కొనుగోలు చేసిన పరిస్థితి లేదు. అటువంటిది రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా మొలకెత్తిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గతంలో మొలకెత్తిన ధాన్యం కొనుగోలు ఎప్పుడూ జరగలేదు. ధాన్యం మొలకెత్తిన రైతులకు కూడా న్యాయం చేసేందుకు గ్రేడెడ్‌ ఎమ్మెస్పీతో ఒక బ్రాకెట్‌ కింద తీసుకువచ్చి ఆ ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ రైతులను కూడా ఆదుకోవాలి. వారికి కూడా మంచి చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈక్రాపింగ్‌ డేటా ఆధారంగా ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుంది. దానికి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం జరిగింది.

రైతులకు బీమా ధీమా..!
ఇన్సూరెన్సు కూడా ఇప్పుడు మన ప్రభుత్వమే బాధ్యతగా ఈ ఖరీఫ్‌ అంటే, 2020 ఖరీఫ్‌ నుంచి ఇన్సూరెన్సు బాధ్యత తీసుకున్నాం. ఎందుకంటే ఇన్సూరెన్సు కంపనీలు బాధ్యత తీసుకోవడం లేదు. అవి స్పందించే తీరు మానవత్వంతో ఉండడం లేదు. సమయానికి స్పందించడం లేదు. 2012కి  సంబంధించిన క్లెయిమ్‌లు మన ప్రభుత్వం వచ్చాక కట్టి, క్లెయిమ్‌లకు వెళ్లడం. ప్రీమియమ్‌ ఎక్కువగా ఉండడంతో రైతులు పంటలకు ఇన్సూరెన్సు చేయకపోవడం చూశాం. దాని వల్ల పంట నష్టం పరిహారం రాకుండా పోయే పరిస్థితి రావడం గతంలో ఎక్కడా చూడడం జరగలేదు. అందుకే ఈ ఏడాది, 2020 ఖరీఫ్‌ సీజన్‌ నుంచి ఇన్సూరెన్సు బాధ్యతను ప్రభుత్వమే పూర్తిగా తీసుకోవడం జరుగుతోంది. అలా తీసుకుంటా ఉంది కాబట్టి, ఇప్పటి నుంచి జనవరి చివరి వరకు క్రాప్‌ కట్టింగ్‌ జరుగుతుంది కాబట్టి, దాన్ని బట్టి రైతులు ఎంత నష్టపోయారన్నది చూసి, ఫిబ్రవరిలో ప్రణాళిక శాక నివేదిక ఇచ్చిన వెంటనే రైతులకు మార్చి, ఏప్రిల్‌లోనే ఇన్సూరెన్సు క్లెయిమ్‌ కూడా సెటిల్‌ చేస్తామని చెబుతున్నాను. ఇది గతంలో ఎప్పుడూ జరగలేదు. క్రాప్‌ కటింగ్‌ పూర్తైన తర్వాత నెల, రెండు నెలల్లోనే ఇన్సూరెన్సు క్లెయిమ్‌ అన్నది చరిత్రలో ఎక్కడా, ఎప్పుడూ జరగలేదని చెబుతున్నాను. వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులకు కానీ, ప్రజలకు కానీ, అదే సీజన్‌లో (నివర్‌ తుపాను విషయంలో అయితే కేవలం నెల లోపల) పరిహారం, సబ్సిడీ వంటివి ఇవ్వడం చరిత్రలో ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు.

రూ.2,194 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఎగ్గొట్టిన టీడీపీ సర్కార్‌
గతంలో ఎలా జరిగింది అన్నది కూడా ఒక్కసారి టేబుళ్లలో చూడండి.. ఇన్‌పుట్‌ సబ్సిడీ అనేది గతంలో ఎలా జరిగేది అనేది చూస్తే, 2014 ఖరీఫ్‌లో నష్టం జరిగితే, ఆ ఇన్‌పుట్‌ సబ్సిడీ ఎప్పుడు వచ్చింది అని చూస్తే, జూలై 22, 2015న రూ.692 కోట్లు మాత్రమే ఇచ్చారు. మరో విడత 2017లో ఇచ్చారు. అలా ఎంత ఆలస్యం చేశారని చూస్తే, 2014 ఖరీఫ్‌ నష్టానికి పరిహారం రెండున్నర ఏళ్ల తర్వాత ఇచ్చారు. 2015 ఖరీఫ్‌ నష్టం ఒక ఏడాది ఆలస్యంగా 2016 నవంబరులోనూ, అదే సీజన్‌ ఉద్యాన పంటలకు సంబంధించిన నష్టానికి పరిహారం రెండేళ్లు ఆలస్యంగా 2017 మే నెలలో ఇచ్చారు. 2016 ఖరీఫ్‌లో నష్టానికి తొలి విడత పరిహారం ఏడాది ఆలస్యంగా, అంటే 2017లో ఇవ్వగా, మిగిలిన పరిహారం రెండేళ్లు ఆలస్యంగా 2018లో ఇచ్చారు. 2017 రబీ నష్టం పరిహారం కూడా ఏడాది ఆలస్యంగా ఇచ్చారు. ఇవి కాక 2018 ఇన్‌పుట్‌ సబ్సిడీని పూర్తిగా ఎగ్గొట్టేశారు. రైతులకు ఏమీ ఇవ్వలేదు. 2018 ఖరీఫ్‌లో రూ.1838 కోట్లు, అదే ఏడాది రబీలో రూ.356 కోట్లు.. మొత్తంగా రూ.2194 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేశారు. 

ఏ సీజన్‌లో ఇన్‌పుట్‌ సబ్సిడీ ఆ సీజన్‌లోనే..
కానీ ఈరోజు ఏదైనా సీజన్‌లో పంట నష్టం జరిగితే, అదే సీజన్‌లో ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తున్నాం. అలా రైతులకు తోడుగా, అండగా నిలబడుతున్న చారిత్రక నిర్ణయం తీసుకుని మనం అమలు చేస్తుంటే వీళ్ల కామెంట్లు మనకు ఇవాళ కనిపిస్తున్నాయి. కాబట్టి ఒక్కసారి గమనించమని కోరుతున్నాను.

58.77 లక్షల మందికి పంటల బీమా సౌకర్యం
ఇదే మాదిరిగా ఇన్సూరెన్సు పరిస్థితి కూడా ఒక్కసారి చూస్తే, అందులో రెండు అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. ఒకటి.. ప్రభుత్వమే ఇన్సూరెన్సు కట్టడం మొదలు పెట్టిన తర్వాత, రైతులకు అండగా నిలబడడం మొదలుపెట్టిన తర్వాత, ఒక్కసారి గమనిస్తే, 2016లో కేవలం 17.79 లక్షల రైతులు నమోదు చేసుకుంటే, ఆ తర్వాత 2019 వరకు మూడేళ్లు వరసగా చూస్తే సగటున 20.28 లక్షల రైతులు కూడా ఇన్సూరెన్సు తీసుకునే పరిస్థితి లేదు. అలాంటిది ఈరోజున ప్రభుత్వమే రైతుల తరపున ఇన్సూరెన్సు సొమ్ము కడతా ఉంది కాబట్టి 58.77 లక్షల రైతులు నమోదు చేసుకున్నారు. అంటే ఒక్కసారిగా 190 శాతం పెరుగుదల. అదే విధంగా ఇన్సూరెన్సులో ఏరియా కవరేజ్‌ కూడా చూస్తే, 201617లో కేవలం 20 లక్షల హెక్టార్లు, 201718లో చూస్తే 24 లక్షల హెక్టార్లు. అలా 201819 వరకు మూడేళ్లు సగటు చూసుకుంటే కేవలం 23.57 లక్షల హెక్టార్లలో మాత్రమే ఇన్సూరెన్సు కవర్‌ అయితే, 201920లో అంటే మన ప్రభుత్వం అ«ధికారంలోకి వచ్చాక 56.82 లక్షల ఎకరాలకు ఇన్సూరెన్సు చెల్లిస్తున్నాం. ఇది 141 శాతం పెరుగుదల.

అదే విధంగా గత మూడేళ్లలో రైతులు కట్టిన సగటు ప్రీమియమ్‌ రూ.290 కోట్లు మాత్రమే. మన హయాంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చూస్తే, ప్రభుత్వమే మొత్తం ప్రీమియమ్‌ కట్టడం మొదలు పెట్టాక రైతులు ప్రీమియమ్‌గా కట్టింది కేవలం రూ.26 లక్షలు మాత్రమే. అదే సమయంలో ప్రభుత్వం కట్టిన ప్రీమియమ్‌ రూ.1030 కోట్లు. అది కట్టడమే కాకుండా డిసెంబరు 15న ఇన్సూరెన్సు సొమ్ము క్లెయిమ్‌ ఇస్తామని తేదీ కూడా ప్రకటించడం జరిగింది. అదే గతంలో ప్రభుత్వం తరపున 2016 నుంచి 2019 వరకు మూడేళ్లలో సగటున కేవలం రూ.393 కోట్లు మాత్రమే కడితే, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కట్టిన ఇన్సూరెన్సు ప్రీమియమ్‌ మొత్తం ఏకంగా రూ.1030 కోట్లు.

పంట కోత ప్రయోగాలు పూర్తయిన వెంటనే పరిహారం చెల్లింపు..
అదే విధంగా ఇన్సూరెన్సు క్లెయిమ్స్‌ గతంలో చూస్తే, 2014 ఖరీఫ్‌ పరిహారం ఏడాది ఆలస్యంగా 2015లో వచ్చింది. అలాగే రబీ పరిహారం కూడా ఏడాది ఆలస్యంగా ఇచ్చారు. 2016 రబీలో అయితే ఏడాదిన్నర తర్వాత ఇచ్చారు. ఆ విధంగా కనీసం ఏడాది, ఏడాదిన్నర ఆలస్యంగా పరిహారం ఇచ్చారు. అదే 2020కి సంబంధించి చూస్తే, ప్రభుత్వమే పూర్తి ప్రీమియమ్‌ చెల్లిస్తుంది కాబట్టి, జనవరి నెలాఖరు నాటికి ఈ సీజన్‌కు సంబంధించి క్రాప్‌ కట్టింగ్‌ ఎక్స్‌పరిమెంట్‌ పూర్తి కాగానే, మార్చి ఏప్రిల్‌లో పంట నష్టపరిహారం రైతులకు అందజేస్తాం.  ఇది ప్రజలు, రైతుల పట్ల మా చిత్తశుద్ధి, నిబద్ధతకు నిదర్శనం.

రైతుల పక్షపాత ప్రభుత్వం ఇది
కులం చూడం.. మతం చూడం.. ప్రాంతం చూడం.. రాజకీయాలు, పార్టీలు కూడా చూడం.. అని చెప్పిన మాటను తూచ తప్పకుండా అమలు చేస్తున్న అందరి ప్రభుత్వం కాబట్టే దేశ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని విధంగా అర కోటి మందికి పైగా రైతులకు.. రైతు భరోసా సొమ్మును నేరుగా వారి బ్యాంక్‌ ఖాతాలలో జమ అవుతోంది. అది కూడా వారి పాత అప్పుల కింద బ్యాంకులు మినహాయించుకోలేని విధంగా ఇస్తున్నాం. దాదాపుగా 50 లక్షల రైతులకు సంవత్సరానికి రూ.13,500 చొప్పున 5 సంవత్సరాలలో మొత్తం రూ.67,500 నేరుగా వారి చేతుల్లో పెట్టబోతున్నాం. నవరత్నాలులో మొట్టమొదటి పథకం రైతు భరోసా. రైతన్నలకు ఎన్నికల వాగ్దానంగా మేనిఫెస్టోలో చెప్పింది.. నాలుగేళ్లలో ఒక్కో రైతుకు రూ.12,500 చొప్పున మొత్తం రూ.50 వేలు ఇస్తామని. కానీ ఇప్పుడు రైతుగా తోడుగా ఉండేందుకు మానవత్వంతో ఒక్కో రైతుకు రూ.13,500 చొప్పున 5 ఏళ్లలో మొత్తంగా రూ.67,500 అందుతోంది. అంటే, మాట ఇచ్చిన దానికన్నా ఒక్కో రైతుకు రూ.17,500 అదనంగా అందుతోంది. కౌలు రైతులకు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ గిరిజన రైతులకు కూడా రైతు భరోసా అందిస్తున్నాం. కోటికి పైగా రైతు కుటుంబాలకు ఈ 18 నెలల కాలంలోనే దాదాపు రూ.13 వేల కోట్లు రైతు భరోసా కింద ఇచ్చాం. వచ్చే జనవరిలో ఇచ్చే రూ.2 వేలు కూడా ఇందులో కలిపాం.

రైతు భరోసా కేంద్రాలతో అన్నదాతలకు సేవలు
విత్తనం నుంచి అమ్మకం వరకు ప్రతి దశలోనూ రైతుకు అండగా నిలబడేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం.  రైతు అవస్థ తెలిసిన వ్యక్తిని కాబట్టి, వారిని అన్ని విధాలుగా ఆదుకునే కార్యక్రమం ఇది. రైతు చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమం. రైతు ఇంటి వద్దనే సేవలందించే విధంగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు. రాష్ట్ర వ్యాప్తంగా పేద రైతులకు అండగా ప్రతి నియోజకవర్గంలోనూ వారికి వైయస్సార్‌ జల కళ ద్వారా బోర్లు వేయించడమే కాకుండా మోటార్లు కూడా ఉచితంగా అందించబోతున్న ప్రభుత్వం మనది మాత్రమే. ఈ కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. ఏటా 50 వేల బోర్లు వేసే దిశగా అడుగులు. ఈ కార్యక్రమానికి అక్షరాలా రూ.4 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం.

గత ప్రభుత్వం బకాయిలనూ చెల్లించాం..!
గత ప్రభుత్వం ఉచిత విద్యుత్తుకు చెల్లించకుండా పెట్టిన రూ.8655 కోట్ల బకాయిలను ఈ ప్రభుత్వమే చెల్లించింది. ధాన్యం సేకరణ బకాయిలు రూ.960 కోట్లు. అవి కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదు. అందుకే ఇవాళ స్పష్టంగా చెబుతున్నాం. ధాన్యం సేకరణ తర్వాత రెండు వారాల్లోనే చెల్లించాలని చెబుతున్నాం. ఇంకా గత ప్రభుత్వం పెట్టిన విత్తనాల సబ్సిడీ బకాయిలు రూ.384 కోట్లు, రైతులకు వడ్డీ లేని రుణాల కింద చెల్లించాల్సి ఉన్న రూ.1030 కోట్లు.. ఇవన్నీ మన రైతుల మీద ప్రేమతో మన ప్రభుత్వం చెల్లించింది.

పగటి పూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్‌
రైతులకు 9 గంటలు పగటిపూటే నాణ్యమైన విద్యుత్తును రూ.1800 కోట్లు వెచ్చించి ఫీడర్ల మెరుగు ద్వారా అందిస్తున్న ప్రభుత్వం మనది. మేము అ«ధికారంలోకి వచ్చే సరికి ఫీడర్లలో కెపాసిటీ లేక ఆ అవకాశం లేకపోవడంతో, ఆ మొత్తం ఖర్చు చేసి ఫీడర్ల కెపాసిటీ పెంచాం. వైయస్సార్‌ సున్నా వడ్డీ పథకం ద్వారా లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లించిన రైతుల వడ్డీని పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఇందుకోసం 2019 ఖరీఫ్‌కు సంబంధించి ఇప్పటికే రూ.510 కోట్లు చెల్లించడం జరిగింది.

డిసెంబర్‌ 15న రూ.1227 కోట్ల క్లెయిమ్‌లు చెల్లిస్తాం
బీమా ప్రీమియమ్‌ను కూడా పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తోంది. 2019 ఖరీఫ్‌కు సంబంధించి రైతులు తమ వాటాగా కేవలం ఒక్క రూపాయి చొప్పున మాత్రమే చెల్లించగా, రాష్ట్రంలో రైతులందరి తరపున కట్టాల్సిన రూ.506 కోట్లు, ప్రభుత్వ వాటాగా చెల్లించాల్సిన రూ.524 కోట్లు. అలా మొత్తం రూ.1030 కోట్లు బీమా ప్రీమియమ్‌ చెల్లించగా, ఈ డిసెంబరు 15న బీమా పరిహారం (క్లెయిమ్‌లు) రూ.1227 కోట్లు బీమా కంపెనీలు చెల్లించనున్నాయి. 

రైతులకు సాంకేతికంగా వెన్నుదన్ను
13 జిల్లాలలో జిల్లా స్థాయి అగ్రి ల్యాబ్‌లు, మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 147 ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్‌లు (గ్రామీణ నియోజకవర్గాలలో) ఏర్పాటు చేస్తాం. వాటి ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను నాణ్యత పరీక్షలు నిర్వహించి ధవీకరించిన వాటినే రైతులకు అందిస్తున్న ప్రభుత్వం మనది.రూ.15 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేశాం. 2019-20లో దాదాపు రూ.15 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు, కోవిడ్‌ సమయంలో కూడా రైతులకు అండగా నిలబడుతూ మొక్కజొన్న, సజ్జ, జొన్న, పొగాకు, ఉల్లి, పసుపు, టమోటా, అరటి, బత్తాయి తదితర ఉత్పత్తులు 8,84,882 టన్నులు కొనుగోలు చేసి రూ.3491 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం మనది. ఇంకా సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కోసం మరో రూ.666 కోట్లు ఖర్చు చేశాం. రైతులకు మంచి ధరలు అందించాలన్న లక్ష్యంతో ఫలానా పంటలను కొనుగోలు చేస్తామని ముందుగానే ధరలు నిర్ణయించి రైతులకు తెలియజేస్తున్నాం. అవన్నీ ఆర్బీకేలలో ప్రదర్శిస్తున్నాం. తద్వారా మార్కెట్‌లో పోటీ వాతావరణం కల్పిస్తున్నాం.

కనీస గిట్టుబాటు ధరలు లభించని పక్షంలో రైతుల నుంచి ప్రభుత్వమే పంటలను నేరుగా కొనుగోలు చేస్తుంది. ఇందు కోసం సీఎంయాప్‌ (కాంప్రహెన్సివ్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ప్రై  జ్‌ అండ్‌ ప్రొక్యూర్‌మెంట్‌), ఏ రైతుకైనా కనీస గిట్టుబాటు ధర రాకపోతే వెంటనే నోటిఫై చేస్తారు.వెంటనే జేసీ స్పందిస్తారు. ఆ పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తారు. అలా అలా కొనుగోలు చేసిన పంటల ఉత్పత్తులకు అదనపు విలువ (వాల్యూ అడిషన్‌) జోడించి, తిరిగి మార్కెట్‌లో విక్రయించడం జరుగుతుంది. అందుకే సెకండరీ ఫుడ్‌ ప్రాససింగ్‌ యూనిట్లు రూ.3 వేల కోట్లతో ఏర్పాటు చేయబోతున్నాం. ఎక్కడెక్కడ ప్రాససింగ్‌ యూనిట్లు పెట్టాలన్న దానిపై కార్యాచరణ. త్వరలోనే గ్రామాల రూపురేఖలు మారబోతున్నాయి. గోదాములు, ఆర్బీకేలు, జనతా బజార్లు కనిపిస్తాయి.రెండో దశ ప్రాససింగ్‌ యూనిట్లు కూడా రాబోతున్నాయి. మొత్తం ఈ కార్యక్రమం కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం.

వ్యవసాయ అనుబంధ రంగాలకూ పెద్దపీట..
కేవలం వ్యవసాయంతో మాత్రమే లాభసాటి కాదని చెప్పి, చేయూత కార్యక్రమం తీసుకువచ్చాం. అందులో భాగంగా డెయిరీకి ప్రోత్సాహం. అందు కోసం ఏకంగా 4.68 లక్షల ఆవులు, గేదెల యూనిట్లు కొనుగోలు చేయిస్తున్నాం. 2.49 లక్షల మేకలు, గొర్రెల యూనిట్లు కొనుగోలు చేస్తున్నాం. అమూల్‌ సంస్థతో అవగాహన కూడా కుదుర్చుకున్నాం. రాష్ట్రంలో సహకార రంగం భ్రష్టు పట్టిపోయింది కాబట్టి, అమూల్‌ను తీసుకురావడం జరుగుతోంది. అందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 9,899 బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు (బీఎంసీయూ) ఏర్పాటు చేస్తున్నాం. ఆ విధంగా డెయిరీల పునరుద్ధరణ. వీటన్నింటి వల్ల గ్రామాల్లో చాలా మార్పులు రాబోతున్నాయి. అమూల్‌ రావడం వల్ల కలిగే ప్రయోజనం.

అమూల్‌తో పాల ధర అధికం..
కడప, ప్రకాశం జిల్లాలలో చూస్తే లీటరు గేదె పాలను(6శాతం ఫ్యాట్,  9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌) హెరిటేజ్‌ సంస్థ రూ.34 కు, దొడ్ల డెయిరీ రూ.32 కు కొనుగోలు చేస్తుండగా, అమూల్‌ రూ.39 కి కొనుగోలు చేయబోతుంది. ఆ విధంగా రూ.5 నుంచి రూ.7 ఎక్కువ ఇవ్వబోతుంది. ఇక అవే గేదె పాలను ప్రకాశం జిల్లాలో లీటరుకు(10 శాతం ఫ్యాట్, 9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌) సంగం, హెరిటేజ్‌ సంస్ధలు రూ.58 లకు, జెర్సీ సంస్ధ రూ.60 లకు కొనుగోలు చేస్తుండగా, అమూల్‌ సంస్ధ రూ.64.97లకు కొనుగోలు చేయనుంది.  ఆ విధంగా దాదాపు ఐదు నుంచి ఏడు రూపాయలు ఎక్కువగా చెల్లించబోతున్నది. ఇక ఆవు పాలకు సంబంధించి చిత్తూరు జిల్లాలో లీటరుకు హెరిటేజ్‌ సంస్ధ రూ.23.12లు , సంగం డెయిరీ రూ.25.20లు , జెర్సీ రూ.24.89 లు చెల్లిస్తుండగా.. అమూల్‌ రూ.28 చెల్లించనుంది. ఆ విధంగా దాదాపు రూ.3 నుంచి రూ.5 ఎక్కువ ధర రైతులకు రానుంది. గ్రామీణ వ్యవస్థలో రైతులకు ఎలా మేలు చేయాలనే ప్రభుత్వం ఉండాలి తప్ప, వారిని ఎలా పిండాలన్న ఆలోచన ఉండకూడదు. అందుకే ఈ ప్రభుత్వం ఆ వ్యవస్థను మార్చబోతున్నది.

ఆక్వా రైతులకు అండగా..
ఇంకా ఆక్వా రైతులకు రూ.1.50 కే యూనిట్‌ విద్యుత్‌ సరఫరా చేయడం వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.720 కోట్ల భారం పడుతోంది. అయినా చిరునవ్వుతో ప్రభుత్వం భరిస్తోంది. ఆక్వా ఉత్పత్తులు చేప, రొయ్యలు గ్రామాల్లో జనతా బజార్లలో దొరుకుతాయి. ఆ విధంగా ఏర్పాట్లు. వాటకి కూడా ప్రాసెసింగ్‌ యూనిట్లు. కోల్డ్‌ స్టోరేజీ యూనిట్లు ఏర్పాటు.  35 చోట్ల ఆక్వా ల్యాబ్‌లు ఏర్పాటు చేయబోతున్నాం. ఆక్వా యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. 

మరిన్ని వార్తలు