పచ్చ గద్దల భూ దందాపై ‘అసైన్డ్‌’ తిరుగుబాటు

29 Oct, 2022 04:20 IST|Sakshi
తమ భూములు తమకు కావాలంటూ మంగళగిరి ఎమ్మార్వో ఆఫీస్‌లో తహశీల్దార్‌కు వినతిపత్రమిచి్చన అమరావతి అసైన్డ్‌ భూమి రైతులు

ఆ భూములు మావే.. ప్యాకేజీ మాకే ఇవ్వాలి

భయపెట్టి.. బెదిరించి బలవంతంగా లాక్కున్నారు

ఎల్లో గ్యాంగ్‌ భూదందాపై అసైన్డ్‌ రైతన్న కన్నెర్ర

ప్రభుత్వం తిరిగిస్తే సాగు చేసుకుంటామని వినతి

రాజధాని గ్రామాల్లో రెవెన్యూ అధికారులకు పెద్ద ఎత్తున దరఖాస్తులు 

సాక్షి, అమరావతి: పచ్చ గద్దల భూ దందాపై అసైన్డ్‌ రైతులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అమరావతిలో టీడీపీ పెద్దలు కాజేసిన తమ అసైన్డ్‌ భూములు తిరిగి దక్కించుకునేందుకు ఉద్యుక్తులమవుతున్నారు. రిజిస్ట్రేషన్‌ చేయని ఆ భూముల ప్యాకేజీ తమకే దక్కాలని, వాటిని వెనక్కి ఇస్తే సాగు చేసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. 964 ఎకరాల అసైన్డ్‌ భూ దోపిడీపై ‘సాక్షి’కథనాలతో చైతన్యమైన అసైన్డ్‌ రైతులు రెవెన్యూ కార్యాలయాల తలుపుతడుతున్నారు. అమరావతిలో పలు గ్రామాల రైతులు రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. ఇది 29 గ్రామాలకూ విస్తరిస్తుండటంతో టీడీపీ పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 

తప్పుడు రికార్డులు సవరించాలి
అమరావతి గ్రామాల్లో అసైన్డ్‌ రైతులు సంఘటితమవుతున్నారు. చిన్న పాయగా మొదలైన ఈ ఉద్యమం ఊపందుకుంటోంది. నవులూరు, కురగల్లు, ఎరబాలెం తదితర గ్రామాలకు చెందిన అసైన్డ్‌ రైతులు రెండు రోజులుగా మంగళగిరి తహశీల్దార్‌ కార్యాలయంలో వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్‌ భూములు తమవేనని, వాటిని ఎవరికీ విక్రయించలేదని పేర్కొంటున్నారు. టీడీపీ హయాంలో ఆ పార్టీ నేతలు పోలీసులతో బెదిరించి రాత్రికి రాత్రి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి తరలించి బలవంతంగా సంతకాలు చేయించారని వెల్లడించారు.

ఆ భూములను రిజిస్ట్రేషన్‌ చేసేందుకు చట్టం సమ్మతించకపోవడం తమకు కాస్త ఊరట నిచ్చిందన్నారు. ఆ భూములు ఇప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో తమ పేరిటే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. వాటిని టీడీపీ నేతలు భూసమీకరణ కింద సీఆర్‌డీఏకు ఇచ్చినట్లు తప్పుగా చూపటాన్ని సరిచేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. భూసమీకరణ కింద అసైన్డ్‌ భూములకు చెల్లించిన ప్యాకేజీ తమకే ఇవ్వాలని, అందుకు సమ్మతించకుంటే తమ భూములు తమకు తిరిగిస్తే సాగు చేసుకుంటామని స్పష్టం చేస్తున్నారు.

రూ.కోటి భూమికి రూ.6 లక్షలే
మాకు కురగల్లులో 3.36 ఎకరాల అసైన్డ్‌ భూమి ఉంది. టీడీపీ నేతలు, దళారులు మమ్మల్ని ఆందోళనకు గురి చేసి ఎకరం రూ.కోటి పలికే భూమిని రూ.6 లక్షలకే కాజేశారు. మేం సంతకాలు చేశాక టీడీపీ ప్రభుత్వం అసైన్డ్‌ భూములకు ప్యాకేజీ ప్రకటించింది. మమ్మల్ని టీడీపీ పెద్దలు మోసం చేశారు. మా భూములు రిజిస్ట్రేషన్‌ కాలేదు కాబట్టి వాటి ప్యాకేజీ మాకే ఇవ్వాలి. లేదా మా భూములు మాకు తిరిగిస్తే 
సాగు చేసుకుంటాం.
– మార్కంపూడి అశోక్, అసైన్డ్‌ రైతు, కురగల్లు

అసైన్డ్‌ ఖాతాలో పట్టా భూమి 
మా కుటుంబానికి ఐదెకరాల పట్టా భూమి ఉంది. రాజధాని ప్రకటించిన తరువాత అది అసైన్డ్‌ భూమి అని బెదిరించడంతో భయపడి టీడీపీ నేతలకు విక్రయించేందుకు ఒప్పుకున్నాం. తరువాత నిర్ణయం మార్చుకోవడంతో పోలీస్‌ స్టేషన్‌కు పిలిచి బెదిరించారు. మా భూమి మాకు ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
– దావు బిచ్చారావు, రైతు, ఎర్రబాలెం

న్యాయం చేయాలి..
మాకు 1.10 ఎకరాల భూమి ఉంది. టీడీపీ నేతలు, పోలీసులు మమ్మల్ని బెదిరించి తక్కువ ధరకు విక్రయించేలా ఒప్పించారు. బలవంతంగా అర్థరాత్రి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి తరలించి సంతకాలు తీసుకున్నారు. మా భూమి పెండింగ్‌ రిజిస్ట్రేషన్‌లో ఉంది. సీఆర్‌డీఏ రికార్డుల్లో మాత్రం టీడీపీ నేతల పేరిట ఉంది. మాకు న్యాయం చేయాలి. భూసమీకరణ ప్యాకేజీ, కౌలు మాకే ఇప్పించాలి.
– నాగేశ్వరరావు, అసైన్డ్‌ రైతు, ఎర్రబాలెం

మరిన్ని వార్తలు