Godavari Delta: గోదావరి డెల్టాకు భరోసా

1 May, 2021 04:09 IST|Sakshi

శివారు భూములకూ నీళ్లందించేలా కాలువల్ని ఆధునికీకరిస్తున్న ప్రభుత్వం 

ఏడాదిలో కేవలం రెండు నెలలు మాత్రమే డెల్టాలో పంటలకు విరామం 

ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆధునికీకరణ పనులు చేపడుతున్న ప్రభుత్వం 

ఇప్పటికే రూ.148.04 కోట్ల వ్యయం 

సాక్షి, అమరావతి: గోదావరి డెల్టాలో నీటి వృథాకు పూర్తిగా అడ్డుకట్ట వేసి.. ఆయకట్టు శివారు భూములకు నీళ్లందించడమే లక్ష్యంగా చేపట్టిన ఆధునికీకరణ పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. డెల్టాలో ఖరీఫ్‌కు జూన్‌.. రబీకి డిసెంబర్‌లో నీటిని విడుదల చేస్తారు. ఏడాది మొత్తంలో కేవలం రెండు నెలలు మాత్రమే డెల్టాలో పంటలు సాగు చేయరు. ఆ రెండు నెలల్లోనే కాలువల ఆధునికీకరణ చేపట్టడానికి అవకాశం ఉంటుంది. రబీ పంట కాలం పూర్తయి, ఖరీఫ్‌ పంట సాగు ప్రారంభించే లోగా కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టి పూర్తి చేయాలని జల వనరుల శాఖ అధికారులకు ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది.

గత ఏడాదిలో రెండు నెలలు, ప్రస్తుత రబీ పంట పూర్తయినప్పటి నుంచి డెల్టా ఆధునికీకరణ పనులకు ప్రభుత్వం రూ.148.04 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాది డెల్టా ఆధునికీకరణ పనులను భారీ ఎత్తున చేపట్టింది. సర్‌ ఆర్థర్‌ కాటన్‌ హయాంలో నిర్మించిన పురాతనమైన కాలువలు అస్తవ్యస్థంగా మారడంతో డెల్టా ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందని దుస్థితి నెలకొంది. దీంతో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004లో గోదావరి డెల్టా ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు. కాలువలు, రెగ్యులేటర్లు ఆధునికీకరణకు రూ.802.59 కోట్లు వ్యయం చేశారు. ఆయన మరణం తర్వాత డెల్టా ఆధునికీకరణ పనులను టీడీపీ సర్కార్‌ నిర్లక్ష్యం చేసింది. 

బ్యారేజీని పటిష్టం చేసేలా.. 
గోదావరి డెల్టాకు నీటిని సరఫరా చేసే ధవళేశ్వరం బ్యారేజీని మరింత పటిష్టం చేసే పనులపైనా దృష్టి పెట్టిన అధికారులు.. మరోవైపు బ్యారేజీలో పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు నీరు నిల్వ చేసే పనులను చేపడుతున్నారు.  ధవళేశ్వరం బ్యారేజీ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 2.931 టీఎంసీలు. గోదావరికి వచ్చే భారీ వరద ప్రవాహంతో పెద్దఎత్తున ఇసుక కొట్టుకొచ్చి ధవళేశ్వరం బ్యారేజీలో మేటలు వేస్తోంది.

ఇటీవల జల వనరుల శాఖ అధికారులు నిర్వహించిన బ్యాథమెట్రిక్‌ సర్వేలో సుమారు 80 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక మేటలు వేసినట్టు గుర్తించారు. దీనిని డ్రెడ్జింగ్‌ ద్వారా తొలగించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. బ్యారేజీలో ఇసుక పూడికను తొలగించి.. పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయడం ద్వారా 10.13 లక్షల ఎకరాల గోదావరి డెల్టా ఆయకట్టుకు మరింత సమర్థవంతంగా నీళ్లందించాలని నిర్ణయించారు.  

డిజైన్‌ మేరకు నీరు ప్రవహించేలా.. 
అత్యంత ఆధునాతన ఏడీసీపీ (అకాస్టిక్‌ డాప్లర్‌ కరెంట్‌ ప్రొఫైలర్‌) పరికరం ద్వారా ప్రస్తుతం కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని అధికారులు కొలుస్తున్నారు. డిజైన్‌ మేరకు ప్రవాహ సామర్థ్యం తగ్గితే, దాన్ని పెంచేలా ఆధునికీకరణ పనులు చేపడుతున్నారు. డెల్టాలోని 713.20 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కాలువలను ఇదే రీతిలో ఆధునికీకరిస్తున్నారు. డి్రస్టిబ్యూటరీలను అభివృద్ధి చేస్తున్నారు. తద్వారా నీటి వృథాకు పూర్తిగా అడ్డుకట్ట వేసి.. ఆయకట్టు చివరి భూములకు నీళ్లందించడానికి చర్యలు చేపట్టారు.  

మరిన్ని వార్తలు