శరవేగంగా ఏటీజీ టైర్స్‌ నిర్మాణ పనులు

6 Dec, 2021 04:36 IST|Sakshi
ఏటీజీ టైర్ల యూనిట్‌లో జరుగుతున్న పనులు

రూ.2,500 కోట్ల పెట్టుబడితో 80 ఎకరాల్లో ఏర్పాటు

తొలివిడతలో రూ.1,250 కోట్ల పెట్టుబడితో పనులు

2023 నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని ప్రణాళిక

5 వేలమందికి ఉపాధి

సాక్షి, అమరావతి: జపాన్‌కు చెందిన యొకహోమా గ్రూపు కంపెనీ అలయన్స్‌ టైర్‌ గ్రూపు (ఏటీజీ) విశాఖలో ఏర్పాటుచేస్తున్న తయారీ యూనిట్‌ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విశాఖపట్టణంలోని అచ్యుతాపురం సెజ్‌ వద్ద సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్‌ నిర్మాణ పనులను ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించారు. తొలుత రూ.1,250 కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు చేయగా రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఏటీజీ ఈ మొత్తాన్ని రూ.2,500 కోట్లకు పెంచింది. ఇప్పటికే యూనిట్‌ ప్రధాన షెడ్‌ నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చిందని పరిశ్రమలశాఖ అధికారులు తెలిపారు.

2023 ప్రారంభం నాటికి వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. తొలిదశలో 36,750 టన్నుల రబ్బరు వినియోగ సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ, నిర్మాణ, అటవీ రంగాల్లో వినియోగించే భారీ యంత్రాల టైర్లను తయారు చేస్తారు. రెండు దశలు పూర్తయితే ఐదువేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని, ఇందులో సగం మంది స్థానిక మహిళలకే అవకాశం కల్పిస్తామని ఏటీజీ అధికారులు తెలిపారు. 

దేశంలో మూడో ప్లాంట్‌
జపాన్‌కు చెందిన ఏటీజీకి దేశంలో ఇప్పటికే గుజరాత్‌లోని ధహేజ్‌లో, తమిళనాడులోని తిరువన్‌వేళిలో తయారీ యూనిట్లున్నాయి. విశాఖలో ఏర్పాటు చేస్తున్నది మూడో యూనిట్‌. ధహేజ్‌ యూనిట్‌ ఉత్పత్తి సామర్థ్యం 1.26 లక్షల టన్నులు కాగా 2,600 మందికి ఉపాధి కల్పిస్తోంది. తిరువన్‌వేళి యూనిట్‌ సామర్థ్యం 86,800 టన్నులు కాగా 2,300 మంది ఉపాధి పొందుతున్నారు. 

మరిన్ని వార్తలు