బీఅలర్ట్ : ఏటీఎంలలో నయా మోసం

21 Jul, 2021 21:12 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

జేబులు కత్తిరించకుండానే ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. బీరువాలను ముట్టుకోకుండానే సొమ్ము మాయం చేస్తున్నారు. అర్ధరాత్రి నిద్దర మానుకుని దొంగతనాలు చేసే పని లేకుండా ఏ సమయంలోనైనా ఈజీగా నగదు కొల్లగొడుతున్నారు. అందుకు వారు వాడే ఆయుధం జనం అమాయకత్వం మాత్రమే. ఏటీఎం కార్డుదారులు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా వైట్‌ కాలర్‌ మాయగాళ్లు రెచ్చిపోతారు. దీనిపై పోలీసులు సైబర్‌ అవేర్‌నెస్‌ వీక్‌ పేరిట అవగాహన కల్పించారు. కార్డుదారులు పాటించాల్సిన జాగ్రత్తలు వివరించారు.  

శ్రీకాకుళం: ఇటీవలి కాలంలో జరుగుతున్న అనేక సైబర్‌ నేరాల్లో ఏటీఎం కార్డు నేరాలు చాలా ఎక్కువగా నమోదయ్యాయి. ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్స్, అవగాహన రాహిత్యం గల ప్రజలు ఇలాంటి నేరాల్లో బాధితులు అవుతున్నారు. దీనిపై పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు. అవగాహన పెంచుకుంటే మోసాల బారిన పడకుండా ఉంటారని సూచిస్తున్నారు. ఏటీఎం మోసాల్లో కొన్నింటిని పరిశీలిస్తే.. 

ఏటీఎం కార్డు మార్చడం.. 
ఇలాంటి మోసాలు ఎక్కువగా ఏటీఎం సెంటర్‌లో జరుగుతుంటాయి. నేరస్తుడు ఏటీఎం గది లోపలే ఉండి వృద్ధులు, అవగాహన రాహిత్యం గల వారిని టార్గెట్‌గా చేసుకొని మోసపూరితమైన మాటలతో వారి ధ్యాసను మళ్లించి, ఏటీఎం పిన్‌ నంబరును గమనించి వారి ఏటీఎం కార్డును మార్చేస్తాడు. దాని బదులు తన వద్ద ఉండే అదే రకమైన కార్డు ఇచ్చి మోసం చేస్తాడు. ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్స్, అవగాహన రాహిత్యం గల ప్రజలు ఇలాంటి నేరాల్లో బాధితులవుతున్నారు.   

ఎలా జాగ్రత్త పడాలి..?  
ఏటీఎం సెంటర్‌లో కార్డు వినియోగం కోసం అపరిచిత వ్యక్తుల సహాయం కోర కూడదు. మనతో అనవసరంగా మాటలు కలిపేందుకు ప్రయత్నించే అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. 
పిన్‌ నంబర్‌ను కార్డు/పేపరుపైన రాయడం చేయకూడదు. ఏటీఎంకు దగ్గరగా నిలబడి చేతిని అడ్డుపెట్టుకుంటూ పిన్‌ నంబర్‌ను ఎవరూ గమనించకుండా జాగ్రత్తపడాలి. 
ఏటీఎంలో కార్డును పెట్టే ప్రదేశంలో ఏదైనా అసాధారణమైన డివైస్‌ అమర్చినట్లు గమనించినా లేదా ఏటీఎం రూమ్‌లో ఏవైనా సీక్రెట్‌ కెమెరాలు ఉన్నట్లు గమనించినా లేదా కీ పాడ్‌ పైన ఏవైనా లేయర్స్‌ (కీ–లోగెర్స్‌) ఉన్నట్లు గమనిస్తే అలాంటి ఏటీఎంలో ఎలాటి లావాదేవీలు చేయకూడదు. 
మన ఏటీఎం కార్డు పోయినా/దొంగిలించినా వెంటనే బ్యాంకును సంప్రదించి కార్డు బ్లాక్‌ చేయించుకోవాలి, పోలీస్‌ స్టేషన్‌లో రిపోర్టు చేయాలి.  
గుర్తు పెట్టుకోండి..
బ్యాంకులు/ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూట్‌కు సంబంధించిన ఉద్యోగులు వారి కస్టమర్లకు ఫోన్‌కాల్స్‌ ద్వారా గాని, ఎస్‌ఎంఎస్‌/ఈ–మెయిల్‌ ద్వారా గాని ఏ విధమైన వ్యక్తిగత సమాచారం, ఓటీపీ నెంబర్, పాస్‌వర్డ్‌లను గురించి అడగదు. 
అలాంటి కాల్స్‌/ఎస్‌ఎంఎస్‌/ఈ–మెయిల్స్‌కు ఎప్పుడూ రెస్పాండ్‌ అవ్వకూడదు. పొరపాటున ఏదైనా సమాచారం ఇస్తే వెంటనే పాస్‌వర్డ్‌ మా ర్చుకోవాలి. సంబంధిత బ్యాంకులను సంప్రదించాలి, పోలీస్‌ స్టేషన్‌లో రిపోర్టు చేయాలి.

ఫోన్‌ ద్వారా.. 
ఈ మధ్య కాలంలో సైబర్‌ నేరస్తులు/మోసగాళ్లు కొత్త పంథాలను ఎంచుకున్నారు. వారు ఏదో ఒక బ్యాంక్‌/ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఉద్యోగులుగా చెప్పుకుంటూ మన డెబిట్‌/క్రెడిట్‌ కార్డు బ్లాక్‌ అవుతుందని, బ్యాంక్‌ కేవైసీ అప్‌డేట్‌ చేయాలని లేదా బ్యాంకు అకౌంట్‌కు ఆధార్‌ లింక్‌ చేయాలనే నెపంతో మనకు ఫోన్‌ కాల్స్‌ చేస్తారు (విషింగ్‌). కొన్ని సార్లు ఎస్‌ఎంఎస్‌ (స్మిషింగ్‌) పెడతారు. మరికొన్ని సార్లు ఈ–మెయిల్స్‌ (ఫిషింగ్‌) ద్వారా లింక్స్‌ పంపిస్తారు.

ఈ పద్ధతుల్లో మన డెబిట్‌/క్రెడిట్‌ కార్డుకు సంబంధించిన 16 డిజిట్‌ కార్డు నంబర్, కార్డు ఎక్స్‌పైరీ తేదీ, సీవీవీ నంబర్, ఓటీపీ నంబర్, ఏటీఎం పిన్‌ నంబర్, నెట్‌ బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్‌ వంటి సున్నితమైన సమాచారాన్ని సేకరించి వాటిని మనకు తెలియకుండా వారి వ్యక్తిగత ఆర్థిక అవసరాల నిమిత్తం వాడుకుంటూ నేరాలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో సైబర్‌ మోసగాళ్లు గవర్నమెంట్‌ ఆఫీషియల్స్‌గా చెప్పుకుంటూ కోవిడ్‌ వ్యాక్సిన్‌ స్లాట్‌ బుకింగ్‌ కోసం ఆధార్‌ కార్డు, ఇతర వివరాలను సేకరించి నేరాలు చేస్తున్నారు.

కార్డ్‌ క్లోనింగ్‌ 
సాధారణంగా మన డెబిట్‌/క్రెడిట్‌ కార్డుకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా కార్డు వెనుక వైపు ఉండే మాగ్నెటిక్‌ స్ట్రిప్‌లో నిక్షిప్తమై ఉంటుంది. సైబర్‌ నేరస్తులు స్కిమ్మర్‌ అనే ఎలక్ట్రానిక్‌ సాధనాన్ని ఉపయోగించి మన కార్డు సమాచారాన్ని ఆ మాగ్నెటిక్‌ స్ట్రిప్‌ నుంచి మోసపూరితంగా సేకరిస్తారు. మనం పిన్‌ నంబరును కొట్టేటప్పుడు దాన్ని గమనిస్తారు. ఇలాంటి నేరాలు ఎక్కువగా రెస్టారెంట్లు, బార్లు, పెట్రోలు బంకులు, స్కిమ్మింగ్‌ డివైస్‌లు అమ ర్చిన ఏటీఎంలలో మన కార్డు ద్వారా లావాదేవీలు చేయడం వల్ల జరుగుతాయి.       

మరిన్ని వార్తలు