అబద్ధాలాడి అభాసుపాలైన బాబు అండ్‌ కో

20 Jul, 2022 04:47 IST|Sakshi
నరసరావుపేట టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి అరవింద్‌బాబుతో వెన్న బాలకోటిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి

టీడీపీలో అంతర్గత విభేదాలతో రొంపిచర్ల మండల పార్టీ అధ్యక్షుడిపై దాడి

దాడికి పాల్పడింది మేనల్లుడే..అతనూ టీడీపీ నేతే

ఈ హత్యాయత్నాన్ని వైఎస్సార్‌సీపీపై నెట్టేందుకు టీడీపీ యత్నం

బాబు, లోకేష్, ఇతర నేతల అసత్య ప్రచారం

బదులు తీర్చుకుంటామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

చివరకు వారి పార్టీ నేత పనే అని తెలిసి గప్‌చుప్‌

టీడీపీ నేత పైనే ఫిర్యాదు చేసిన బాధితుడి కుమారుడు

పోలీసుల అదుపులో నిందితుడు

సాక్షి, నరసరావుపేట/నరసరావుపేట రూరల్‌/రొంపిచర్ల: సొంత పార్టీ నేతల మధ్య ఆధిపోత్య పోరులో జరిగిన దాడిని అధికార పార్టీపై నెట్టాలనుకున్న తెలుగుదేశం పార్టీ అభాసుపాలైంది. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై ఆయన మేనల్లుడు, అదే పార్టీకి చెందిన అలవాల గ్రామ టీడీపీ నేత పమ్మి పెద్ద వెంకటేశ్వరరెడ్డి మంగళవారం ఉదయం హత్యాయత్నం చేశాడు. మంగళవారం ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్లిన బాలకోటిరెడ్డిపై పెద్దవెంకటేశ్వరరెడ్డి, మరికొందరు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. రక్తమోడుతూ రోడ్డు మీద పడి ఉన్న బాలకోటిరెడ్డిని స్కూల్‌ బస్సులో వెళ్తున్న విద్యార్థులు చూసి గ్రామస్తులకు తెలిపారు.

గ్రామస్తులు వచ్చి ఆయన్ని ఆటోలో గ్రామానికి తీసుకొచ్చారు. స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుడు çప్రథమ చికిత్స అందించిన అనంతరం  మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటలోని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, డాక్టర్‌ అరవిందబాబుకు చెందిన అమూల్య నర్సింగ్‌ హోమ్‌కు తరలించారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే టీడీపీ నేతలు వాస్తవాలు తెలుసుకోకుండా అధికారపార్టీపై నెపం నెట్టాలని కుట్ర పన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మొదలు మండల స్థాయి నాయకుల వరకు అసత్య ప్రచారం ప్రారంభించారు.

అధికారపార్టీకి చెందిన రొంపిచర్ల ఎంపీపీ భర్తే హత్యాయత్నం చేశాడంటూ ఆరోపణలు చేశారు. ఈ దాడికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతిచర్యలు ఉంటాయంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలుచేశారు. పోలీసు వ్యవస్థ ప్రతిష్టను మంటగొలిపేలా ఆరోపణలు చేశారు. తీరా చూస్తే ఈ హత్యాయత్నానికి పాల్పడింది వారి పార్టీ నేతే అని వెల్లడవడంతో కుక్కిన పేనుల్లా మిన్నకుండిపోయారు. బాలకోటిరెడ్డి కుమారుడు వెన్నా నర్సిరెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సైతం వెంకటేశ్వరెడ్డిపై అనుమానం వ్యక్తం చేశాడు. 

ఇదే మొదటిసారి కాదు..
ప్రశాంతంగా ఉన్న పల్నాడులో రాజకీయ రచ్చ చేసి, ప్రజలను రెచ్చగొట్టేందుకు తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎక్కడ ఏ ఘటన జరిగినా, దానికి వైఎస్సార్‌సీపీ నేతలే కారణమంటూ శవ రాజకీయాలకు పాల్పడుతోంది. వ్యక్తిగత కక్షలతో జరిగిన దాడులను సైతం అధికార పార్టీపై నెట్టి, రాజకీయం చేయాలని ప్రయత్నిస్తోంది. మాచర్ల, వినుకొండ, గురజాల నియోజకవర్గాలలో ఇటువంటి చర్యలకే పాల్పడింది. ఇప్పుడు నరసరావుపేట నియోజకవర్గంలో సైతం అదే పంథాను కొనసాగిస్తోంది.

టీడీపీలో గ్రూపులే దాడికి కారణం: ఇన్‌చార్జి డీఎస్పీ విజయభాస్కరరెడ్డి 
తెలుగుదేశం పార్టీలో గ్రూపు రాజకీయాల కారణంగానే వెన్నా బాలకోటిరెడ్డిపై దాడి జరిగిందని ఇన్‌చార్జి డీఎస్పీ విజయభాస్కరరెడ్డి తెలిపారు. మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల నుంచి అలవాల గ్రామంలో టీడీపీలో అంతర్గత విభేదాలు ఉన్నాయని తెలిపారు. పార్టీలో గుర్తింపు దక్కకపోవడం, బాలకోటిరెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడంపై అతని మేనల్లుడు వెంకటేశ్వరరెడ్డి కక్ష పెంచుకున్నాడన్నారు.

ఈ నేపథ్యంలో ఉదయం వాకింగ్‌కు వెళ్లిన బాలకోటిరెడ్డికి ఆంజనేయస్వామి ఆలయం వద్ద వెంకటేశ్వరరెడ్డి తారసపడటంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగిందన్నారు. వెంకటేశ్వరరెడ్డి ఆగ్రహంతో బాలకోటిరెడ్డిపై దాడి చేశాడని, పాశవికంగా రాళ్లతో కొట్టి పరారయ్యాడని వివరించారు. బాలకోటిరెడ్డి కుమారుడు నర్సిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో పమ్మి వెంకటేశ్వరరెడ్డి దాడికి పాల్పడినట్టు పేర్కొన్నాడని తెలిపారు. వెంకటేశ్వరరెడ్డిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

టీడీపీలో ఆధిపత్య పోరుతోనే.. 
ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
తెలుగుదేశం పార్టీ ఆధిపత్య పోరులో భాగంగానే వెన్నా బాలకోటిరెడ్డిపై దాడి జరిగిందని, వైఎస్సార్‌సీపీ నాయకులకు ఎటువంటి సంబంధం లేదని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. దాడి జరిగిన బాలకోటిరెడ్డికి దాడిచేసిన వెంకటేశ్వరరెడ్డి స్వయానా మేనల్లుడేనని చెప్పారు. ఇద్దరూ టీడీపీ నేతలేనని చెప్పారు. వాస్త వాలు తెలుసుకునే ఓపిక చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు, జీవీ ఆంజనేయులు, ప్రత్తిపాటి పుల్లారావులకు లేదన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకు లపై పిచ్చిపిచ్చి ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఆయన మంగళ వారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడు తూ దాడి అనంతరం వెంకటేశ్వరరెడ్డి స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోయాడని చెప్పారు. ఈ సమావేశంలో నేతలు పి.ఓబుల్‌రెడ్డి, పి.రవీంద్ర బాబు, జి.వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు