మరణించి ఉంటారులే.. బతికి ఉన్న మహిళ పోస్టుమార్టానికి..

20 Jun, 2022 20:37 IST|Sakshi
ఆస్పత్రి వద్ద నిరసన తెలుపుతున్న బంధువులు

పూతలపట్టు (యాదమరి)/పాకాల: పాకాల మండలం గానుగపెంటకు చెందిన టీచర్‌ దంపతులు జి.మనోహర్, శిరీష దంపతులు తమ కుమార్తెతో కలిసి బైక్‌లో తిరుపతి బయలుదేరారు. నేండ్రగుంట వద్ద ఆవు అడ్డు రావడంతో బ్రేకు వేయడంతో భార్య కింద పడిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను పభుత్వాస్పత్రికి తరలించారు. సిబ్బంది పరిశీలించకుండానే చనిపోయినట్టు చెప్పి పోస్టుమార్టానికి తరలించేందుకు సిద్ధమయ్యారు. బంధువులు బతికి ఉంది చూడమని చెప్పినా పట్టించుకోలేదు. చివరకు వారు ఆమెను వేలూరు సీఎంసీకి తరలించారు. ఈ సంఘటన పూతలపట్టు మండలం పి.కొత్తకోట ప్రభుత్వాస్పత్రిలో జరిగింది.
చదవండి: ఇలా చేశారంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?.. తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

పాకాల మండలం గానుగపెంటకు చెందిన మనోహర్‌ తన భార్య శిరీష(30), మూడేళ్ల కుమార్తెతో కలిసి ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనంలో తిరుపతి బయలుదేరాడు. నేండ్రగుంట వద్ద ఉన్నట్టుండి ఆవు అడ్డు రావడంతో మనోహర్‌ బ్రేకు వేశాడు. దీంతో శిరీష రోడ్డుపై పడిపోయింది. తలకు తీవ్రగాయాలయ్యాయి. అతనికి, కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. శిరీషను ప్రైవేట్‌ అంబులెన్స్‌లో పూతలపట్టు మండలం పి.కొత్తకోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

అక్కడ వైద్యులు లేరు. స్టాఫ్‌ నర్సుతోపాటు మరో నర్సు ఈసీజీ తీసి చనిపోయిందని బంధువులకు చెప్పారు. పోస్టుమార్టం కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. అరగంట తర్వాత వైద్యురాలు వచ్చినా పరిశీలించలేదు. ఆమె సూచన మేరకు  పోస్టుమార్టం కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో ఊపిరి పీ ల్చుకుంటున్నట్టు అనుమానం వచ్చి చిత్తూరు ఆర్‌వీఎస్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరిశీలించి పల్స్‌ ఉన్నాయని, వెంట నే వేలూరు సీఎంసీకి తీసుకెళ్లాలని రెఫర్‌ చేశారు.

ఇంత నిర్లక్ష్యమా 
రోడ్డు  ప్రమాదం జరిగి ఆస్పత్రికి వస్తే వైద్యులు లేరు. బతికి ఉన్నా చనిపోయినట్టు చెప్పడం దారుణమని బంధువులు వాపోయారు. ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తారని ప్రభుత్వం చెబుతుంటే వైద్యులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంత వరకు సబబని ఆవేదన చెందుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.  

మరిన్ని వార్తలు