ఫోన్‌ యాప్‌ ద్వారానే టీచర్ల హాజరు

31 Aug, 2022 04:14 IST|Sakshi

రేపటి నుంచే ప్రారంభం  

దృష్టి లోపం ఉన్నవారికి మినహాయింపు 

టీచర్లంతా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి

పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ మినహా అన్ని యాజమాన్యాల పరిధిలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులందరూ సెప్టెంబర్‌ 1 నుంచి ఇంటిగ్రేటెడ్‌ అటెండెన్స్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా ఫేషియల్‌ రికగ్నిషన్‌ విధానంలో హాజరు నమోదు చేయాలని పాఠశాల విద్యా శాఖ మంగళవారం సర్క్యులర్‌ జారీ చేసింది. ఫోన్‌ యాప్‌ ద్వారా మాత్రమే ఉపాధ్యాయులు హాజరును వేయాలని తెలిపింది. వీరితోపాటు పాఠశాల విద్యా శాఖ నియంత్రణలో ఉన్న అన్ని కార్యాలయాల్లోని బోధనేతర సిబ్బంది కూడా ఈ యాప్‌లో హాజరు నమోదు చేయాలని వెల్లడించింది.

సెప్టెంబర్‌ 1 నుంచి ఏ కార్యాలయాల్లోనూ మాన్యువల్‌ హాజరును నమోదు చేయకూడదని స్పష్టం చేసింది. వికలాంగుల సంక్షేమ శాఖ నిబంధనల ప్రకారం.. దృష్టిలోపం ఉన్న ఉద్యోగులకు ప్రత్యేక మినహాయింపు ఉంటుందని వివరించింది. వారు ప్రత్యేకంగా మాన్యువల్‌ రిజిస్టర్లలో హాజరు నమోదు చేయాలని పేర్కొంది. కాగా, ఫేషియల్‌ రికగ్నిషన్‌ హాజరు విధానాన్ని నెల రోజుల్లో అన్ని విభాగాల్లో అమలు చేయనున్నారు.   

ఆండ్రాయిడ్‌ ఫోన్‌ లేకపోతే.. 
ఆండ్రాయిడ్‌ ఫోన్‌లేని టీచర్లు, ఉద్యోగులు తమ హాజరును హెడ్మాస్టర్‌ లేదా ఇతర ఉపాధ్యాయుల మొబైల్స్‌ ద్వారా నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఉపాధ్యాయులు, ఉద్యోగుల రిజిస్ట్రేషన్లను బుధవారంలోపు పూర్తి చేయాలని తెలిపింది.

యాప్‌ ద్వారా హాజరు నమోదు.. విద్యా శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయాలు, జోన్, జిల్లా కార్యాలయాలు, డైట్స్, ఎంఈవో తదితర కార్యాలయాలకు కూడా వర్తిస్తుందని వెల్లడించింది. ఉపాధ్యాయులు, ఉద్యోగులు హాజరు నమోదు కోసం యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకునేలా చూడాలని పాఠశాల విద్య ప్రాంతీయ జాయింట్‌ డైరెక్టర్లు, డీఈవోలు, హెడ్మాస్టర్లను ఆదేశించింది. హాజరును క్రమం తప్పకుండా యాప్‌ ద్వారా నమోదు చేసేలా చూడాలని పేర్కొంది.    

మరిన్ని వార్తలు