మీ కోసం 'వెదురు' చూసే బొమ్మలం!

17 Apr, 2022 04:08 IST|Sakshi
బొమ్మల్ని విక్రయిస్తున్న మహిళలు

పేరంటపల్లిలో ఆకర్షిస్తున్న కళాకృతులు

బొమ్మ రకాన్ని బట్టి రూ.50 నుంచి రూ.350 ధర

వెదురు బొమ్మల తయారీతో ఉపాధి పొందుతున్న కొండరెడ్లు

వేలేరుపాడు: జీవనది గోదావరి చెంతన పాపికొండలుకు వెళ్లే మార్గంలో విహార యాత్రా స్థలంగా ప్రసిద్ధి చెందిన గిరిజన గ్రామం పేరంటపల్లి (పేరంటాలపల్లి). పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో గల ఈ గ్రామంలో శ్రీరామకృష్ణ మునివాటం ఆలయం ఉంది. అక్కడ శివుణ్ణి దర్శించి.. పచ్చని ఎత్తైన కొండల నుంచి జాలువారే జలపాతాలను.. గుడి వెనుక రాళ్ల నుంచి పారే నీటిని వీక్షించే పర్యాటకులు పరవశించిపోతారు. కొండ గుట్టల మధ్య సుమారు 170 మెట్లు ఎక్కితే 500 సంవత్సరాల క్రితం మాతంగి మహర్షిచే ప్రతిష్ఠించబడిన సీతారామలక్ష్మణ ఆంజనేయ సుందర విగ్రహాలు దర్శనమిస్తాయి. సీతారామ లక్ష్మణ అంజనేయస్వామి వార్లు సజీవంగా మన ఎదుట ప్రత్యక్షమైన అనుభూతి కలుగుతుంది. ఆ పక్కనే ఉండే వాలి, సుగ్రీవుల గుట్టలు కనువిందు చేస్తాయి. ఆ గ్రామంలో సుమారు 60 కొండరెడ్డి గిరిజన కుటుంబాలు జీవిస్తున్నాయి. అందరిదీ ఒకే వృత్తి. వెదురు బొమ్మల తయారీలో వారంతా నిష్టాతులే. కొండకోనల్లో దొరికే ములస వెదురు వీరికి ఉపాధినిస్తోంది. 

ఆకట్టుకునే కళాకృతులు
తమచుట్టూ క్రూర మృగాలుంటాయని తెలిసినా అక్కడి గిరిజనులు ప్రమాదం అంచున జీవనం సాగిస్తుంటారు. అక్కడి గిరిజనులు దారీతెన్నూ లేని గుట్టల్లో ప్రయాణించి వెదురు బొంగులను సేకరిస్తారు. వాటితో వివిధ కళాకృతులు తయారు చేస్తుంటారు. తామర, గులాబీ పువ్వులు, వివిధ అంతస్తుల భవనాలు, లాంచీలు, బోట్లు, ఫైల్‌ ట్రే తదితర నమూనాల రూపంలో కళాకృతులను తయారు చేస్తున్నారు. వీటివల్ల నిరంతరం ఇళ్ల వద్దే వీరికి ఉపాధి దొరుకుతోంది. ఆదివారం, సెలవు రోజులతో పాటు దసరా, శివరాత్రి, సంక్రాంతి పండుగలకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి వెదురు కళాకృతులు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. వీటిని కొనుగోలు చేసి జ్ఞాపికలుగా తీసుకెళ్తుంటారు. ఒక్కో బొమ్మ సైజును బట్టి రూ.50 నుంచి రూ.350 వరకు ధర పలుకుతున్నాయి. పన్నెండేళ్ల క్రితం ఐటీడీఏ ఇచ్చిన శిక్షణ కొండరెడ్ల కళా నైపుణ్యాన్ని వెలుగులోకి తెచ్చింది.

వెదురు వస్తువులే మా జీవనం
వెదురు బొమ్మల తయారీతోనే మేం జీవిస్తున్నాం. పర్యాటకులు వచ్చే సీజన్‌లో నిత్యం 5 నుంచి 10 బొమ్మలు అమ్ముతా. రోజుకు రూ.500 వరకు ఆదాయం వస్తోంది.
– కోపాల యశోద, పేరంటపల్లి

వీటితోనే మా కుటుంబం గడుస్తోంది
నేను రోజుకు రూ.600 వరకు సంపాదిస్తున్నా. పర్యాటకులు బాగానే కొంటున్నారు. రోజుకు 15 బొమ్మలు అమ్ముతున్నాను. వీటి తయారీ, విక్రయం ద్వారానే మా కుటుంబం గడుస్తోంది.
– కెచ్చెల అనురాధ, పేరంటపల్లి 

మరిన్ని వార్తలు