ఆచార్య వైసీ సింహాద్రి కన్నుమూత

23 May, 2021 08:48 IST|Sakshi

సాక్షి, కాకినాడ/ముమ్మిడివరం: ప్రముఖ విద్యావేత్త, ఆచార్య యెడ్ల సింహాద్రి కన్నుమూశారు. కరోనా సోకడంతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. సింహాద్రి.. ఆంధ్రా యూనివర్సిటీ, బెనారస్‌, బీహార్‌ వంటి విశ్వ విద్యాలయాల్లో వైస్‌ ఛాన్సలర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

కుగ్రామం నుంచి విశ్వవిద్యాలయ వీసీగా... 
కోనసీమ సరస్వతిపుత్రుడాయన. ఈ ప్రాంతం నుంచి స్వయంకృషితో విశ్వవిద్యాలయాల ఉపకులపతి స్థాయికి ఎదిగారు. పేదరికంలో పుట్టినా పట్టుదలతో అమెరికాలో డాక్టరేట్‌ చేయగలిగారు. ఆయనే ఎడ్ల చిన సింహాద్రి (80).వీసీ సింహాద్రిగానే సుపరిచితులు. సింహాద్రి స్వగ్రామం ముమ్మిడివరం మండలం కమిని పంచాయతీ శివారు గురజాపులంక. ఉద్యోగ రీత్యా విశాఖలో స్థిరపడ్డారు ఆయన. ధర్మరాజు, వెంకాయమ్మల ఏడుగురు సంతానంలో సింహాద్రి చివరి వారు. 1941 సింహాద్రి జూన్‌ 15న జన్మించారు.

పడవెక్కి.. దిగి.. కాలినడకన స్కూలుకు..
సింహాద్రి బాల్యం పేదరికంలోనే గడిచింది. గ్రామానికి 8 కిలోమీటర్ల దూరంలోని ముమ్మిడివరంలో ప్రాథమిక విద్యనభ్యసించారు. చిన్నప్పటి నుంచీ చదువుపై ఎంతో ఆసక్తి. గురజాపులంక నుంచి నాటు పడవపై గోదావరి పాయ దాటి కాలి నడకన పాఠశాలకు చేరుకునే వారు. కాట్రేనికోన మండలం కందికుప్పలో బంధువుల ఇంట ఉంటూ ఎస్సెస్సెల్సీ చదివారు. అమలాపురం ఎస్‌కేబీఆర్‌ కళాశాలలో పీయూసీ చదివారు. ఆంధ్ర యూనివర్సిటీలో సోషియాలజీలో డిగ్రీ పూర్తి చేశారు. విద్యారంగాన ప్రతిభ కనబర్చడంతో అమెరికా యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. జపాన్, ఇటలీ యూనివర్సిటీల్లో కూడా డాక్టరేట్‌ పొందారు.

ప్రొఫెసర్‌గా కెరీర్‌
ఆంధ్రా యూనివర్సిటీలో సోషియాలజీ ప్రొఫెసర్‌గా ఆయన కెరీర్‌ ప్రారంభించారు. ప్రొఫెసర్‌గా ఉన్నప్పుడు కోనసీమకు చెందిన ఎందరో విద్యార్థులను ప్రోత్సహించారు. వారి ఉన్నత చదువులకు ప్రేరణ కలిగించారు. గుంటూరులోని నాగార్జున, సుప్రసిద్ధ బెనారస్‌ హిందూ, పాటా్న, ఆంధ్రా యూనివర్సిటీలకు వైస్‌ చాన్సలర్‌గా పని చేశారు. సంస్కరణలకు బాట వేశారు. ప్రస్తుతం ఇండియన్‌ వైస్‌ చాన్స్‌లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన జపాన్‌కు చెందిన యువతి నవాకోను వివాహమాడారు. నిరాడంబరంగా జీవించడానికి ఇష్టపడేవారు. సింహాద్రి భౌతికకాయానికి స్వగ్రామం గురజాపు లంకలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయ న మృతితో గ్రామంలో విషాదం అలముకుంది. బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్, కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, జేసీలు, డీఆర్‌ఓ, ఇతర అధికారులు సంతాపం తెలిపారు. 

చదవండి: ఆనందయ్య కరోనా మందు: ల్యాబ్‌ నుంచి పాజిటివ్ రిపోర్ట్‌
ఆనందయ్య కరోనా మందుకు వారం పాటు బ్రేక్‌

మరిన్ని వార్తలు