క్షయ రోగులకు ‘అరబిందో’ సహాయం 

20 Dec, 2022 05:59 IST|Sakshi
కలెక్టర్‌ మల్లికార్జునకు చెక్కు అందిస్తున్న అరబిందో ఫార్మా ప్రతినిధులు

టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌లో భాగంగా పోషకాహారానికి రూ.16.80 లక్షల విరాళం 

కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద 400 మంది వ్యాధిగ్రస్తులకు ఆసరా  

సాక్షి, విశాఖపట్నం:  క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా విశాఖ జిల్లా బాధితులకు సహాయం అందించేందుకు ప్రముఖ ఔషధ ఉత్పత్తుల సంస్థ అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ ముందడుగు వేసింది. ప్రధానమంత్రి టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 400 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు ఆరు నెలలపాటు పౌష్టికాహారం అందించేందుకు సీఎస్‌ఆర్‌ నిధుల నుంచి రూ.16.80 లక్షలను విరాళంగా అందజేసింది.

ఆరు నెలలపాటు 400 మంది రోగులకు ఫుడ్‌ బాస్కెట్‌లు అందజేసేందుకు జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, క్షయ నియంత్రణ విభాగానికి సంస్థ ఎండీ కె.నిత్యానందరెడ్డి తరఫున చెక్కును అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జునకు సోమవారం అందజేశారు.

ఆరు నెలలపాటు ఒక్కో రోగికి పౌష్టికాహారం అందించేందుకు రూ.4,200 ఖర్చు చేసేందుకు వీలుగా ఈ సహాయం అందిస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమం అమలులో విశాఖపట్నం రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని కలెక్టర్‌ మల్లికార్జున వెల్లడించారు.   

మరిన్ని వార్తలు