ఖరీఫ్‌ సాగు లక్ష్యం ..93.91 లక్షల ఎకరాలు

15 May, 2022 19:39 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఖరీఫ్‌–2022 కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. ఖరీఫ్‌ సీజన్‌లో పంటల సాగు కోసం సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను వైఎస్సార్‌ ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా వ్యవసాయ శాఖ యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించింది. పంటలు ప్రకృతి వైపరీత్యాల బారినపడకుండా ముందస్తు ఖరీఫ్‌కు వెళ్లేలా రైతులను సమాయత్తం చేయాలని అధికారులు నిర్ణయించారు. 

నిర్దేశించిన గడువులోగా సాగు నీటిని విడుదల చేయడం ద్వారా జూన్‌ మొదటి వారంలోనే నాట్లు పడేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖరీఫ్‌–2022లో 93.91 లక్షల ఎకరాల్లో పంటల్ని సాగు చేయించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ప్రధానంగా 40.34 లక్షల ఎకరాల్లో వరి, 18.40 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 14.82 లక్షల ఎకరాల్లో పత్తి, 6.62 లక్షల ఎకరాల్లో కందులు, 3.71 లక్షల ఎకరాల్లో చెరకు, 2.72 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతాయని అంచనా.

ఆర్బీకేల ద్వారా విత్తనాల పంపిణీ
రానున్న సీజన్‌లో రూ.196.70 కోట్ల విలువైన 6.84 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీపై అందించాలని అధికారులు నిర్ణయించారు. తొలిసారి వాణిజ్య పంటలైన పత్తి, మిరప, మొక్కజొన్న, కూరగాయల విత్తనాల (నాన్‌ సబ్సిడీ)ను కూడా ఆర్బీకేల ద్వారా రైతులకు సరఫరా చేయబోతున్నారు. వేరుశనగ విత్తన పంపిణీ మే మూడో వారం నుంచి, వరి విత్తనాలను జూన్‌ మొదటి వారం నుంచి పంపిణీ చేయనున్నారు.

గిరిజన మండలాల్లో మాత్రం వేరుశనగ, వరి విత్తనాలను మే 3వ వారం నుంచే పంపిణీ చేస్తారు. మరోవైపు 19.02 లక్షల టన్నుల ఎరువులు కేటాయించారు. వీటిని ల్యాబ్‌లలో సర్టిఫై చేసిన తర్వాతే పంపిణీ చేయబోతున్నారు. కనీసం 1.50 లక్షల టన్నుల ఎరువులను ఆర్బీకేల వద్ద ముందస్తుగా నిల్వ చేస్తున్నారు. ఈసారి మొత్తం వినియోగంలో కనీసం 30 శాతం ఎరువులు, 10 శాతం పురుగుల మందులను ఆర్బీకేల ద్వారా సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  ఈ సీజన్‌లో రూ.92,687 కోట్ల మేర వ్యవసాయ రుణాలివ్వాలని నిర్దేశించారు.

రైతు ముంగిటకే అన్నిసేవలు
ఖరీఫ్‌లో ప్రతి రైతుకు వారి గ్రామాల్లోనే విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు వంటి వాటిని ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాం. సేంద్రియ సాగును ప్రోత్సహించేలా ఆర్బీకేల ద్వారా రైతులకు పెద్దఎత్తున అవగాహన కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం.    
– కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి

పకడ్బందీ ఏర్పాట్లు
పంటలు వైపరీత్యాల బారిన పడకుండా సాధ్యమైనంత త్వరగా సీజన్‌ ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నాం. సీజన్‌కు ముందుగానే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటి వాటిని అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నాం. 8,508 పొలం బడులు నిర్వహించడం ద్వారా ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించే రైతులకు జీఏపీ సర్టిఫికేషన్‌ జారీకి శ్రీకారం చుడుతున్నాం.    
– చేవూరు హరికిరణ్, స్పెషల్‌ కమిషనర్, వ్యవసాయ శాఖ

(చదవండి: రూ.390 సిమెంట్‌ బస్తా రూ.235కే!)


 

మరిన్ని వార్తలు