భువన విజయంతో ‘అనంత’ ఖ్యాతి

31 Oct, 2020 19:40 IST|Sakshi

పెనుకొండలో జాతీయ మ్యూజియం ఏర్పాటుకు కసరత్తు

ప్రాచీన అవశేషాలు, నాణేలు, శాసనాలకు రక్షణ

ప్రత్యేక ఆకర్షణ కానున్న జంబూద్వీపం చక్రం 

ప్రాచీన కట్టడాల పరిరక్షణకు చర్యలు

అనంతపురం కల్చరల్‌: పురావస్తు సంపదను భావితరాలకు పదిలంగా అందించడానికి రాష్ట్ర, జాతీయ పురావస్తు శాఖలు నడుంబిగించాయి. అనంతపురం జిల్లా పెనుకొండలో ‘భువన విజయం’ పేరుతో జాతీయ మ్యూజియం ఏర్పాటు ద్వారా రాష్ట్రానికి పర్యాటకులను రప్పించడానికి సంకల్పించాయి. రాష్ట్రంలోని ప్రసిద్ధ ప్రాచీన కట్టడాలు, శిలా శాసనాలు, సంస్కృతీ కేంద్రాల పరిరక్షణకు పురావస్తు శాఖ అధికారులు ముమ్ముర చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోనే తొలిసారి ఏర్పాటు కానున్న జాతీయ  మ్యూజియంను దాదాపు రూ.9 కోట్లతో నిర్మించడానికి పెనుకొండ డీఎస్పీ బంగ్లా సమీపంలో 83 సెంట్ల స్థలాన్ని సేకరించారు. త్వరలోనే పనులు ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ మ్యూజియంలో అపురూప కట్టడాల అవశేషాలు, నాణేలతోపాటు శ్రీకృష్ణదేవరాయల కీర్తిని చాటే శాసనాలను కూడా భద్రపరుస్తారు. 

జంబూద్వీపానికి ఆధునిక కళ
అనంతపురం జిల్లాలోని కొనగండ్ల ప్రాంతంలో ఆకర్షించే కట్టడాలలో.. రససిద్ధుల గుట్టగా ప్రఖ్యాతి చెందిన జంబూద్వీపం చక్రం ఒకటి. ఇక్కడ ప్రపంచంలోనే అరుదైన జైన మత అవశేషాలు బయటపడ్డాయి. ముంబైకి చెందిన ‘దిగంబర్‌ జైన్స్‌ కమిటీ’ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చింది. ఈ ప్రాంత అభివృద్ధికి కూడా మ్యూజియం అధికారులు విస్తృత స్థాయిలో చర్యలు తీసుకున్నారు. త్వరలో సందర్శకులకు అన్ని వసతుల ఏర్పాట్లు కానున్నాయి. ముఖ్యంగా జైన్‌ విగ్రహాలకు కాయకల్పం(శాశ్వతంగా రక్షించడానికి వజ్రలేపనం పేరుతో ప్రకృతి సిద్ధమైన రసాయనాలతో పూత) చేయడానికి చర్యలుంటాయని అధికారులు చెబుతున్నారు.

అభివృద్ధికి ప్రణాళిక..
- ప్రాచీన కట్టడాలకు సమీపంలో ఎటువంటి నిర్మాణాలు ఉండరాదన్న నిబంధనను మ్యూజియం ఆధికారులు కచ్చితంగా అమలు చేస్తున్నారు. 
- ప్రపంచంలోనే అపురూప శిల్పంగా పేరున్న లేపాక్షి నందికి సమీపంలో నిర్మిస్తున్న రోడ్డును ఆపివేయించారు.
- పెనుకొండలోని గగన్‌మహల్‌కు సమీపంలో సాయి కాళేశ్వర్‌ ట్రస్టు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు. 
- ప్రాచీన కట్టడాలకు నిలయమైన పెనుకొండ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. 
- రాయదుర్గం వద్దనున్న పశుపతనాథ ఆలయం, వేపులపర్తి శ్రీరంగనాథ దేవాలయం, పెనుకొండ దీప స్తంభం, తిమ్మరుసు సమాధి ప్రాంతాలలో అభివృద్ధి పనులు, గోరంట్ల యాష్‌ మౌంట్స్‌ (బూడిద దిబ్బలు) వంటి చారిత్రాత్మక ప్రదేశాల్లో రక్షణ కోసం ఫెన్సింగ్‌ పనులు చేపట్టనున్నారు.

చారిత్రక కట్టడాల రక్షణకు ప్రాధాన్యం
అనంతపురం జిల్లాలో జాతీయ మ్యూజియం ఏర్పాటుతో ఈ ప్రాంతానికి మరింత ఖ్యాతి వస్తుంది. పురావస్తు కేంద్రాల వద్ద సౌకర్యాలను కల్పించడం ద్వారా సందర్శకులను మరింత పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనికనుగుణంగా జిల్లాలో పెనుకొండ, కొనకొండ్ల, వేపులపర్తి, గోరంట్ల వంటి అనేక చోట్ల అభివృద్ధి పనులను చేస్తున్నాం. ముఖ్యంగా ప్రాచీనమైన వాటి రక్షణకు ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నాం.
 – రజిత, ఏడీ, జిల్లా  పురావస్తు శాఖ

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు