ముస్లిం యువతి కేసు.. ‘దిశ’ డీఎస్పీ దర్యాప్తు

18 Jul, 2021 04:31 IST|Sakshi
కుటుంబ సభ్యులను విచారిస్తున్న అధికారులు

సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో ఎర్రబాడుకు వెళ్లిన అధికార బృందం

బాధిత కుటుంబానికి భరోసా

సాక్షి, అమరావతి/గోనెగండ్ల: కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామంలో గతేడాది ఆగస్టు 17న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ముస్లిం యువతి కేసును ‘దిశ’ డీఎస్పీ స్థాయి అధికారితో దర్యాప్తు చేయిస్తామని దిశ ప్రత్యేక అధికారి, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు కృతిక శుక్లా చెప్పారు. పొలానికి వెళ్తుండగా ఆమెను కొందరు అత్యాచారం చేసి హత్య చేశారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికారుల బృందం శనివారం ఆ గ్రామానికి వెళ్లింది.

ఇందుకు సంబంధించిన వివరాలను కృతిక శుక్లా మీడియాకు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో ఎర్రబాడు గ్రామంలో బాధిత ముస్లిం కుటుంబాన్ని కలిసి మాట్లాడారు. కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయిస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. బాధిత కుటుంబం పూరిగుడిసెలో నివసిస్తున్నందున వెంటనే ఇల్లు మంజూరు చేసి.. నిర్మించి ఇవ్వాలని ఆర్‌డీవో అధికారులకు కృతికా శుక్లా ఆదేశాలిచ్చారు. కర్నూలు జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్, ఎస్పీ íసీహెచ్‌ సుధీర్‌కుమార్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) మనజీర్‌ జిలానీసామూన్, జాయింట్‌ కలెక్టర్‌ (ఆసరా, సంక్షేమం) శ్రీనివాసులు తదితరులున్నారు.  

మరిన్ని వార్తలు