తుక్కు.. అదిరేటి లుక్కు!

29 Mar, 2021 04:35 IST|Sakshi

ఆచార్యుని చేతిలో అపురూప కళాఖండాలు

మన్‌ కీ బాత్‌లో ప్రధాని మోదీ అభినందన

సీఎం వైఎస్‌ జగన్‌ కూడా కితాబు

సాక్షి, అమరావతి బ్యూరో: బాల్యంలోనే బొమ్మలు గీయడమంటే ఆసక్తి. మదిలో తోచింది పలక మీదో, పుస్తకం పైనో గీసేయడం.. ఎలా ఉంది మాస్టారూ? అంటూ గురువులకు చూపించి ఆనందించడం ఆయనకు అలవాటు. ఆ అలవాటే ఎన్నెన్నో చిత్ర విచిత్ర కళా రూపాలకు జీవంపోసింది. ఎందుకూ పనికిరాని ఇనుప తుక్కుకు కొత్త ఆకృతుల సృష్టికి ఊతమిచ్చింది. అలా అలవాటైన ఆ కళాతృష్ణ ఇప్పుడు ప్రధాని మోదీతో శభాష్‌ అనిపించుకునేలా చేసింది. ఆయనే పదకండ్ల శ్రీనివాస్‌.. కృష్ణాజిల్లాకు చెందిన చందర్లపాడు వాసి.. గుంటూరు ఏఎన్‌యూలో ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగాధిపతి. బెజవాడ బస్టాండు సమీపంలోని కంట్రోల్‌ రూమ్‌ ఎదురుగా ఇనుప తుక్కు పార్కు, కర్నూలు, అనంతపురం, మధురై, తిరునల్వేలి, ట్యుటికోరిన్, గుంటూరు హిందూ కాలేజీ, కడప జిల్లా వేంపల్లెలో కనిపించే స్క్రాప్‌ కళా ఆకృతులు శ్రీనివాస్‌ మది నుంచి జాలువారినవే. ఎందుకూ పనికిరాని పాత ఆటోమొబైల్‌ వ్యర్థాలను అందమైన శిల్పాలుగా మలుస్తారు.  

చిన్నప్పట్నుంచి ఆర్ట్స్‌పై ఆసక్తి ఉన్న శ్రీనివాస్‌.. బెనారస్‌ హిందూ యూనివర్సిటీలో ఫైన్‌ ఆర్ట్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేసేటప్పుడు ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఇనుప వ్యర్థాలతో అరుదైన కళాకృతులను తయారుచేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఏకంగా ప్రధాని మోదీ మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో ఆయనతో శభాష్‌ అనిపించుకున్నారు. కళ అందరినీ ఆలోచింపజేయాలని, సృజనాత్మకతకు అద్దంపట్టాలని అంటున్న ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌.. ప్రధాని మోదీతో అభినందనలు పొందడం జీవితంలో మరచిపోలేని అనుభూతన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ కూడా ఇవి చూసి తనకు కితాబిచ్చారని.. రాయలసీమలోనూ ఇలాంటివి ఏర్పాటుచేయమని చెప్పడంతో ఇప్పుడా పనిలో ఉన్నానన్నారు. 

మరిన్ని వార్తలు