కర్నూలులో తన్నుకున్న టీడీపీ శ్రేణులు : అఖిలప్రియ అరెస్ట్‌

17 May, 2023 13:12 IST|Sakshi

నంద్యాలలో కొట్టుకున్న తెలుగుదేశం కార్యకర్తలు

రెండు వర్గాలుగా వీడి ఒకరిపై ఒకరు దాడులు

ఏవీ సుబ్బారెడ్డిని చితకబాదిన అఖిలప్రియ అనుచరులు

అఖిలప్రియను అరెస్ట్ చేసిన పోలీసులు

సాక్షి, నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డలో తెలుగుదేశం పరువు బజారున పడింది. లోకేష్ పాదయాత్ర సందర్భంగా టీడీపీలో మరొకసారి విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ నేత భూమా నాగిరెడ్డి స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డిపై ఆ పార్టీకే చెందిన భూమా అఖిలప్రియ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు.

నంద్యాల నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఈ ఘటన జరిగింది. నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామంలో జరిగిన ఈ ఘటనలో అఖిలప్రియ వర్గీయులు కొందరు ఏవీ సుబ్బారెడ్డిని లక్ష్యంగా చేసుకుని దాడికి దిగారు. సుబ్బారెడ్డి ఎత్తిపడేసి పిడిగుద్దులు కురిపించారు. ఒక సమయంలో సుబ్బారెడ్డి పరిస్థితి క్లిష్టంగా మారింది. చివరి  క్షణంలో ఆయన వర్గీయులు అడ్డుకుని పక్కకు తప్పించారు. తీవ్రంగా గా­య పడ్డ సుబ్బారెడ్డిని ఆస్పత్రికి తరలించారు.  ప్రస్తుతం సుబ్బారెడ్డి నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఘటనపై కేసు నమోదు చేసిన నంద్యాల పోలీసులు.. ప్రాథమిక దర్యాప్తు అనంతరం భూమా అఖిలప్రియ, ఆమె అనుచరులను అరెస్ట్‌ చేశారు. భూమా అఖిలప్రియను నంద్యాల పీఎస్‌కు తరలించారు. దాడి గురించి మీడియా ప్రతినిధులతో మాట్లాడిన అఖిలప్రియ.. ఏవీ సుబ్బారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు.

నంద్యాల పర్యటన సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డి తన చున్నీ లాగారాని, దీనిపై నిలదీస్తే ఏవీ సుబ్బారెడ్డి తనను దూషించారని అఖిలప్రియ ఆరోపించారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో తన అభిమానులు ఏవీ సుబ్బారెడ్డి పై దాడిచేశారని తెలిపారు. తన కోసం భర్త భార్గవ్ రామ్  పోలీస్ స్టేషన్ కు వచ్చారని అఖిలప్రియ తెలిపారు. 

అయితే, ఈ ఆరోపణలను ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులు ఖండించారు. తమ బలాన్ని నిరూపించుకునేందుకు దాడి చేశారని ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులు ఆరోపించారు. 

ఇదిలా ఉండగా, నంద్యాల ఘటనపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తలపట్టుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.  అసలే అంతంత మాత్రంగా నడుస్తోన్న లోకేష్ పాదయాత్రకు కొత్తగా ఇవేమీ ఇబ్బందులంటూ చంద్రబాబు వాపోయినట్టు తెలిసింది. ఘటనపై  పార్టీ ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. సీనియర్లతో త్రిసభ్య కమిటీ వేశారు. వీలైనంత త్వరగా  నివేదిక ఇవ్వాలని సూచించారు.  పాదయాత్ర పూర్తయ్యేవరకు పార్టీ నేతలు పూర్తి సమన్వయంతో వ్యవహరించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

చదవండి: లేఖను ఎందుకు దాచారు? 

మరిన్ని వార్తలు