భూ అక్రమాల బాధ్యులపై కఠిన చర్యలు

30 Jun, 2021 04:01 IST|Sakshi

మాన్సాస్‌ ట్రస్టు, అప్పన్న భూముల పరాధీనంపై విచారణ 

ఇద్దరు జాయింట్‌ కలెక్టర్లకు బాధ్యతలు 

భూముల దుర్వినియోగంలో పెద్దల హస్తం 

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడి 

సాక్షి, విశాఖపట్నం: మాన్సాస్‌ ట్రస్టు, సింహాచలం అప్పన్న దేవస్థాన భూముల పరాధీనానికి బాధ్యులపై కఠినచర్యలు తప్పవని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, ఎంపీ వి.విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ సుమారు 748 ఎకరాల భూమిని ఆలయ రిజిస్టర్‌ నుంచి తొలగించిన విషయాన్ని ‘సాక్షి’ పత్రిక వరుస కథనాలతో వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఆయా భూములను సర్వే చేయడంతో పాటు ఆ వ్యవహారంపై విచారణ జరపడానికి విజయనగరం, విశాఖపట్నం జాయింట్‌ కలెక్టర్లు కిశోర్‌బాబు, ఎం.వేణుగోపాల్‌రెడ్డికి రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి బాధ్యతలు అప్పగించారని మంత్రి ముత్తంశెట్టి చెప్పారు. వారు పదిరోజుల్లో నివేదికను, సంబంధిత రికార్డులను అందించిన తర్వాత ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.
ఈ భూముల వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై, తద్వారా అడ్డగోలుగా లబ్ధిపొందిన వ్యక్తులపై చర్యలు తప్పవని చెప్పారు. విశాఖ నగర అభివృద్ధి, సింహాచలం పంచగ్రామాల భూసమస్య, ప్రభుత్వ భూముల పరిరక్షణ తదితర అంశాలపై మంగళవారం విశాఖ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి, ఎంపీ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉత్తరాంధ్రలో దేవాలయాల భూముల పరిరక్షణపై ఇటీవల దేవదాయశాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాన్సాస్‌ ట్రస్టు, సింహాచలం పంచగ్రామాల భూసమస్య గురించి అధికారులు ప్రస్తావించినట్లు మంత్రి చెప్పారు. దేవాలయ భూములను ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకుని పేదలకు పట్టాలివ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎవరిపైనా కక్షసాధింపు చర్యలు కావని స్పష్టం చేశారు. చంద్రబాబు పరిపాలనలో యథేచ్ఛగా భూఆక్రమణలు జరిగాయన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.వేలకోట్ల విలువైన భూములను ఆక్రమణదారుల చెరనుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. 

తప్పు చేసినవారు తప్పించుకోలేరు 
వేల కోట్ల రూపాయల విలువైన సింహాచలం ఆలయ భూముల దుర్వినియోగం వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దలున్నారని ఎంపీ వి.విజయసాయిరెడ్డి చెప్పారు. ఎస్టేట్స్‌ ఎబాలిషన్‌ యాక్ట్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సింహాచలం దేవస్థానం, మాన్సాస్‌ భూముల్లో జరిగిన అవకతవకలను వెలికితీస్తామన్నారు. తప్పు చేసినవారు ఎంతటివారైనా తప్పించుకోలేరని స్పష్టం చేశారు. పంచగ్రామాల భూసమస్య కోర్టులో ఉందని, జూలైలో విచారణకు వచ్చేలా చూడాలని అడ్వకేట్‌ జనరల్‌ను కోరామని చెప్పారు. పంచగ్రామాల్లో నివాసితులకు కోర్టు ఆదేశాలను అనుసరించే భూముల క్రమబద్ధీకరణ ఉంటుందని తెలిపారు. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్, మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు