ఏ బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో నెరవేరుస్తా

12 Apr, 2022 04:34 IST|Sakshi

వలంటీర్లకు సత్కారసభలో భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి 

తగరపువలస (విశాఖపట్నం): సీఎం వైఎస్‌ జగన్‌ తనకు ఏ బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో నెరవేరుస్తానని భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. కర్తవ్య నిర్వహణలో వెనుకడుగు వేసే ప్రశ్నేలేదన్నారు. చిట్టివలస బంతాట మైదానంలో సోమవారం జీవీఎంసీ భీమిలి జోన్‌కు చెందిన 363 మంది వలంటీర్లకు సేవారత్న, సేవామిత్ర అవార్డుల కింద ప్రోత్సాహకాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో పదవులు అదనపు అర్హత మాత్రమేనని చెప్పారు.

శక్తియుక్తులన్నీ ఉపయోగించి భీమిలి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. కేంద్రప్రభుత్వ భాగస్వామ్యంతో త్వరలో భీమిలిలో రూ.25 కోట్లతో ఫిష్‌ల్యాండింగ్‌ సెంటర్, సీఎస్‌ఆర్‌ నిధులతో ఆర్టీసీ కాంప్లెక్స్‌ హామీ నెరవేరిస్తే 95% ఎన్నికల హామీలు నెరవేర్చినట్టేనని చెప్పారు. విద్యుత్‌ సమస్యలపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు.

చంద్రబాబుకు పెద్ద వయసు, అనుభవం ఉన్నా జగన్‌లా పెద్ద మనసు లేదన్నారు. ఇన్నాళ్లు జగన్‌ కేబినెట్‌లో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది నూరుశాతం మంచివారని చెప్పారు. టీడీపీ నేతలు  వలంటీర్లను హేళన చేశారని గుర్తుచేశారు. వలంటీర్లే లేకుంటే కరోనా కాలంలో మరిన్ని ప్రాణాలు పోయేవని ఆయన పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు