పర్యాటక రంగానికి ‘స్టార్‌’ హంగులు

9 Sep, 2021 05:14 IST|Sakshi
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

అంతర్జాతీయ ప్రమాణాలతో స్టార్‌ హోటళ్ల నిర్మాణం

పర్యాటక, క్రీడాశాఖ సమీక్షలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

కరోనాతో మృతిచెందిన టూరిజం ఉద్యోగులకు సాయం

ఒకేచోట ఐదేళ్లు దాటిన కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల బదిలీ

సాక్షి, అమరావతి: విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతి జిల్లాలో ఐదు నుంచి ఏడు నక్షత్రాల హోటళ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనశాఖ మంత్రి ముత్తంశెట్జి శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం సచివాలయంలో 13 జిల్లాలకు చెందిన పర్యాటక, క్రీడా సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తొలిదశలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో మూడుచోట్ల స్టార్‌ హోటళ్ల నిర్మాణాలకు పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరిపినట్టు తెలి పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి 50 శాతం హోటళ్లను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపడుతున్నామన్నారు. థాయిలాండ్, మలేషియా, స్విట్జర్లాండ్‌ వంటి 40 శాతం దేశాలు కేవలం పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయంతోనే అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని చెప్పారు. వీటి తరహాలోనే రాష్ట్ర ఆదాయ వనరుగా పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతులు, రవాణా, బోటింగ్‌ సౌకర్యాలను మెరుగుపర్చి.. ఆన్‌లైన్, సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం కల్పిస్తామని, ఇందుకోసం దసరాలోగా ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడిం చారు. ఈ సమీక్షలో మంత్రి ఇంకా ఏమన్నారంటే..

పర్యాటకంపై ప్రత్యేక కార్యక్రమాలు
► పర్యాటక ప్రాంతాల ప్రాచుర్యం అందరికీ తెలిసేలా నెలకు ఒక జిల్లాలో ప్రత్యేక ప్రోగ్రామ్స్‌ ఏర్పాటు చేస్తాం. లోకల్‌ టూరిజం అభివృద్ధిలో భాగంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కోస్తా, రాయలసీమ పర్యాటక సర్క్యూట్లలో ఒక్కో మేనేజర్‌ను నియమించి.. ప్రత్యేక బస్సు నడుపుతూ ఒకటి, రెండు రోజుల ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తాం.
► కోవిడ్‌కు ముందు రూ.120 కోట్లు పర్యాటక ఆదాయం వచ్చేది. ప్రస్తుతం అది రూ.60 కోట్లకు పడిపోయింది. అది కూడా కోవిడ్‌ ఆస్పత్రులు, కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో భోజన సదుపాయం కల్పించడం వల్ల సమకూరింది.
► పర్యాటకశాఖలో కోవిడ్‌తో మృతిచెందిన 8 మంది ఉద్యోగుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయంతో పాటు అర్హతను బట్టి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తాం. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ విభాగాల్లో ఒకే చోట ఐదేళ్లకు మించి పని చేస్తున్న వారికి స్థాన చలనం తప్పదు. త్వరలోనే ఖాళీలు భర్తీ చేస్తాం.

సీ ప్లెయిన్‌లను నడిపేందుకు చర్చలు
► బోట్ల నిర్వహణ సజావుగా సాగేందుకు ఏర్పాటు చేసిన తొమ్మిది కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్ల మార్గదర్శకాలకు అనుగుణంగా 24 ప్రభుత్వ, 164 ప్రైవేటు బోటు సేవలు ప్రారంభిస్తాం. విశాఖపట్నం, విజయవాడ, నాగార్జునసాగర్, సూ ర్యలంక తదితర ప్రాంతాల్లో సీ ప్లెయిన్‌లను నడిపేందుకు ఆయా సంస్థలతో చర్చిస్తున్నాం.
► కేంద్ర ప్రభుత్వ సహకారంతో ‘ప్రసాద్‌’ (పిలిగ్రిమేజ్‌ రెజువినేషన్‌ అండ్‌ స్పిరిచ్యువల్‌ అగ్మెంటేషన్‌ డ్రైవ్‌) పథకం కింద టెంపుల్‌ టూరిజంలో భాగంగా రూ.50 కోట్లతో శ్రీశైలం ఆలయ అభివృద్ధి చేపట్టాం. మరో రూ.50 కోట్లతో సింహాచల దేవస్థానం అభివృద్ధి పనులకు త్వరలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తాం.

నూతన క్రీడా పాలసీకి సన్నాహాలు
గ్రామీణ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించేందుకు నూతన క్రీడా పాలసీని తీసుకొస్తున్నట్టు మంత్రి ముత్తంశెట్జి శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే ముసాయిదా సిద్ధమైందని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆమోద ముద్ర వేయిస్తామన్నారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ కింద క్రీడా ప్రాంగణాల అభివృద్ధి, క్రీడాకారులను దత్తత తీసుకునే కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నట్టు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను నిర్మిస్తామన్నారు. విశాఖ జిల్లా కొమ్మాదిలో క్రీడా ప్రాంగణాన్ని ఖేలో ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సమీక్షలో ఏపీటీడీసీ చైర్మన్‌ వరప్రసాద్‌ రెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ (శాప్‌) చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ, ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక సంస్థ సీఈఓ ఎస్‌.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు