అయోధ్య రామమందిరం: చరిత్రలో లిఖించదగ్గ రోజు

5 Aug, 2020 12:18 IST|Sakshi

సాక్షి, విజయవాడ : అయోధ్యలో నేడు రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేసుకోవడం సంతోషదాయకమని మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు అన్నారు. ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రతి భారతీయ పౌరుడు కోవిడ్‌-19 నియమాలు పాటిస్తూ ఇంట్లో దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. బుధవారం అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణ భూమి పూజ నేపథ్యంలో విజయవాడ విశ్వహిందు పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 11.30 నుంచి 1 గంట వరకూ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మాట్లాడుతూ.. అయోధ్యలో రామమందిరం నిర్మించటం శుభపరిణామమన్నారు.(అయోధ్య అప్‌డేట్స్‌; హనుమాన్‌ గడీలో ప్రధాని)

‘రామమందిరం నిర్మాణం కోసం 7 సార్లు పోరాటాలు చేసి తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా రామమందిరం నిర్మాణం కోసం ఈ రోజు భూమి పూజ చేసుకోవటం హర్షించదగ్గ విషయం. 1984లో విశ్వహిందు పరిషత్ రామమందిరం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది. 1992 డిసెంబర్ 6వ తేదీన జరిపిన కర సేవ కార్యక్రమంలో దేశ, విదేశాల నుంచి లక్షలాది మందిగా కర సేవలో పాల్గొన్నారు. తాత్కాలిక రామమందిరం ఏర్పాటు చేసి బాలరాముడిని అందులో ప్రతిష్టించారు’. అని గోకరాజు గంగరాజు తెలిపారు. (అయోధ్య రామాలయం: అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు)

కాగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం భూమి పూజ సందర్భంగా బీజేపీ శ్రేణులు విజయవాడలో సంబరాలు చేసుకుంటున్నారు. బీజేపీ కార్యాలయం వద్ద బాణాసంచా కాల్సి, స్వీట్లు పంచారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం భారత దేశ ప్రజల చిరకాల వాంఛ అని బీజేపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ రాజు అన్నారు. రాముని జన్మ స్థలంలో రామాలయం నిర్మించడం శుభపరిణామమని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ రామ మందిరానికి శంకుస్థాపన చేయడం సంతోషకరమన్నారు. భారత సంస్కృతిని విదేశీయులు నాశనం చేశారని, ప్రపంచంలో అత్యంత పురాతనమైన సంస్కృతి భారతదేశానిదని పేర్కొన్నారు. (అయోధ్య చరిత్రలో దశాబ్దాల పోరాటం.)

‘ప్రపంచానికే భారత్‌ ఆచార్య వ్యవహారాలు, సంస్కృతి నేర్పిర్పించిన దేశం. భారతదేశంలో పురాతనమైన దేవాలయాలకు పునర్వైభవం ప్రధాని మోడీ తీసుకువస్తారు. అయోధ్యలో రామమందిరం నిర్మించాలని దేశ వ్యాప్తంగా పెద్ద ఉద్యమం జరిగింది. దేశ వ్యాప్తంగా ఉన్న పవిత్ర పుణ్య స్థలాలు నదుల నుంచి మట్టి నీరు తెచ్చి శంకుస్థాపన చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. భరతదేశ చరిత్రలో ఈ రోజు లిఖించ దగ్గ రోజు’. అని శ్రీనివాస్‌ రాజు అన్నారు. 

మరిన్ని వార్తలు