ఇప్పటికీ దరఖాస్తు చేసుకోలేదు.. ఆనందయ్యకు నోటీసులు ఇచ్చాం: ఆయుష్‌ శాఖ

12 Jan, 2022 19:03 IST|Sakshi

సాక్షి, విజయవాడ: అనుమతులు లేకుండా ఒమిక్రాన్‌కు మందు ఉందంటూ ప్రచారం చేసుకుంటున్న సంస్థలపై ఆయుష్ శాఖ చర్యలు తీసుకుంటోంది. తూర్పుగోదావరి జిల్లాలో అనుమతులు లేకుండా ఒమిక్రాన్ పేరుతో ఆయుర్వేద మందులు అమ్ముతున్న ఓ సంస్థను ఆయుష్‌ శాఖ అధికారులు సీజ్‌​ చేశారు. ఈ సందర్భంగా ఆయుష్‌ కమిషనర్‌ రాములు మాట్లాడుతూ.. ఒమిక్రాన్ పేరుతో అనుమతులు లేని ఆయుర్వేద మందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ఒమిక్రాన్‌కు మందు ఇస్తానంటూ ప్రచారం చేసుకుంటున్న ఆనందయ్యకు కూడా నోటీసులు ఇచ్చామని తెలిపారు.
చదవండి: హైదరాబాద్‌, వైజాగ్‌లలో భారీగా అప్రెంటిస్‌ ట్రెయినీలు

ఆనందయ్య తన మందుపై ఇప్పటికీ ప్రభుత్వానికి ధరఖాస్తు చేసుకోలేదని వెల్లడించారు. ఆనందయ్య మందుపై కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలోనే ప్రభుత్వం పది రోజుల వ్యవధిలో వేగంగా నిర్ణయం తీసుకుందని తెలిపారు. కేంద్ర ఆయుష్ శాఖ కోవిడ్ నివారణకు సూచించిన అన్ని ఆయుర్వేదం, హోమియో మందులు అన్ని డిస్పెన్సరీలలో అందుబాటులో ఉంచామని చెప్పారు. వీటి కోసం ఏపీ ప్రభుత్వం 13 కోట్ల రూపాయిలు ఖర్చు చేసిందన్నారు. ఒమిక్రాన్‌కు మందు ఉందంటూ ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్న ప్రచారాలని నమ్మి మోసపోవద్దని ఆయుష్‌ కమిషనర్‌ సూచించారు. ప్రభుత్వ ఆయుర్వేద డిస్పెన్సరీలలో కేంద్ర అయుష్ శాఖ సూచించిన మందులనే వినియోగించాలని తెలిపారు.
చదవండి: మహిళా పోలీసులకు ప్రత్యేక నిబంధనలను విడుదల చేసిన ప్రభుత్వం

మరిన్ని వార్తలు