బుద్ధుందా.. గాడిద కొడుకుల్లారా..

25 Oct, 2020 04:44 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న అయ్యన్నపాత్రుడు

అధికారులపై అయ్యన్న బూతు పురాణం

సాక్షి, విశాఖపట్నం/కొమ్మాది (భీమిలి): మాజీమంత్రి, టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు మరోసారి బూతు పురాణం అందుకున్నారు. పరుష పదజాలంతో రెవెన్యూ అధికారులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గీతం విద్యా సంస్థలు ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకుని కట్టిన అడ్డగోలు నిర్మాణాల్ని తొలగించిన నేపథ్యంలో గీతం కళాశాలలో టీడీపీ నేతలు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ‘చదువు చెప్పే విద్యాసంస్థను కూల్చేస్తారా? పడగొట్టిన వాడెవడండీ. బుద్ధుందా ఆ గాడిద కొడుకులకు.. ఆర్డీవో దగ్గరుండి పడగొట్టాడు. ముందు ఆర్‌డీవో, ఆ నా..... సస్పెండ్‌ చేయాలి’ అంటూ నోటికొచి్చనట్టు మాట్లాడారు. ‘గీతం కాలేజీని ధ్వంసం చేయడమేంటి. అధికారులకు జ్ఞానం లేదా’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా.. కోర్టు పరిధిలో ఉన్న గీతం కాలేజీ నిర్మాణాలను తొలగించిన ఆర్డీవో, తహసీల్దార్‌.. ఆ నా..... సస్పెండ్‌ చెయ్యాలి’ అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఆ భూముల్ని అందరూ ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని.. తమకిస్తే అభివృద్ధి చేసుకుంటామంటూ అప్పటి ముఖ్యమంత్రిని దివంగత ఎంవీఎస్‌ మూర్తి కోరితే కేటాయించారని అయ్యన్న చెప్పడం గమనార్హం. గీతం యూనివర్సిటీ నిర్మాణాలను తొలగించడం ముమ్మాటికి కక్షపూరిత చర్య అన్నారు.   మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ గీతం కళాశాలపై ప్రభుత్వ కక్ష సాధింపును అంతా ఖండించాలన్నారు. దమ్ముంటే విశాఖ నగరంలో అనధికార నిర్మాణాలు తొలగించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ పాల్గొన్నారు.

‘అయ్యన్నా.. నోరు అదుపులో పెట్టుకో’
విధి నిర్వహణలో ఉన్న ఆర్డీవో, తహశీల్దార్లను నోటికొచ్చినట్టు దూషిస్తే సహించేది లేదని ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు హెచ్చరించారు. గీతం విద్యాసంస్థల ఆక్రమణలపై చర్యలు తీసుకున్న రెవెన్యూ అధికారులపై అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యల్ని అసోసియేషన్‌ సహాధ్యక్షుడు పీవీ రత్నం, ప్రధాన కార్యదర్శి సి.చంద్రశేఖరరావు తీవ్రంగా ఖండించారు. యూనియన్‌ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో వారిద్దరూ మాట్లాడుతూ అయ్యన్న నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని.. ఇలా ఉద్యోగుల్ని బెదిరించడం చట్టరీత్యా నేరమన్న విషయం ఓ మాజీ మంత్రికి తెలియకపోవడం గర్హనీయమని అన్నారు. బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదనీ, ఉద్యోగుల మనోభావాల్ని దెబ్బతీసే వారికి సరైన సమాధానం చెబుతామని హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు