Ayyappa Mala 2022: అయ్యప్ప మాలధారణ .. నియమాల ఆచరణ.. మండల పూజ ఎ‍ప్పటినుంచంటే?

7 Nov, 2022 19:57 IST|Sakshi

రాజంపేట రూరల్‌ (వైఎస్సార్‌  కడప): శివకేశవుల తనయుడైన శ్రీమణికంఠుని మాలధారణ నియమాలతో కూడుకున్న ఆచరణ. హరిహరపుత్రుడైన అయ్యప్ప కొలువై ఉన్న కేరళ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో వేలమంది అయ్యప్ప దీక్ష తీసుకుని మాల ధరిస్తున్నారు. శరీరాన్ని, మనసును చెడు నుంచి మంచి మార్గంలోకి మళ్లించే దీక్షే స్వామి శరణమయ్యప్ప మండల దీక్ష. మోక్షమార్గాన్ని అన్వేశించే వారు, సన్మార్గాన జీవనయాత్ర సాగించాలనుకునేవారు తప్పని సరిగా జీవితంలో ఒక సారి అయినా శబరిమల యాత్ర చేయాలని ఉవ్విళ్లూరు తుంటారు.

నియమాలు ఇలా..
అయ్యప్ప మాలను పవిత్రమైన ఆలయంలో గురుస్వామి వద్ద కానీ లేదా ఇంట్లో మాతృమూర్తి వద్ద వేయించుకోవచ్చును. ప్రతి రోజు సూర్యోదయంకు ముందే పూజలు, సూర్యాస్తమయం తరువాత పూజలు నిర్వహించాలి. కఠిన నియమాలను పాటిస్తూ నలుపు దుస్తులనే వాడాలి. రాత్రివేళల్లో ఆలయాలలోని నిద్రే శ్రేయస్కరం. ప్రతి రోజు ఏదో ఒక గుడిని దర్శించడం ఆనవాయితీగా చేపట్టాలి.

భక్తుడే భగవంతుడు
అయ్యప్ప దీక్ష చేపట్టగానే నేను అన్న భావన నశించిపోతుంది. దేహానికి ఉన్న పేరు, దేహం ధరించే దుస్తులు, తినే ఆహారం, శారీరక సౌక్యాలు, ఆచార వ్యవహారాలు, దినచర్య అన్నీ ఒకే ఒక దీక్షతో మారిపోతాయి. అందుకే దీక్ష చేపట్టగానే ఆ వ్యక్తి పేరు అంతర్థానమై స్వామి గానే పిలువబడుతుంటారు. దీక్ష చేపట్టిన వెంటనే మానవుడు మాధవుడిగా పరివర్తన చెందడం మొదలవుతుంది. ఈ పరిణామక్రమం పూర్తి అయితే అప్పుడు భక్తునికి, భగవంతునికి తేడా కనిపించదు. ఈ సత్యాన్ని చాటిచెప్పడానికే అయ్యప్పదీక్ష ప్రారంభమైంది. కులమత భేదాలు, తారతమ్యాలు లేని ఓ ఆధ్యాత్మిక ప్రపంచమే శబరిమల. 

ఇరుముడి ప్రాముఖ్యత
అయ్యప్పను నవవిధ సేవలతో ప్రార్థిస్తుంటారు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, నమస్కారం, ధ్యానం, స్మృతం, ఆత్మ నివేదనలతో అయ్యప్పను కొలుస్తుంటారు. అయ్యప్ప దీక్షలో ఇరుముడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇందులో రెండు ముడులు ఉంటాయి. ముందున్న ముడిలో స్వామి అయ్యప్ప స్వరూపమైన ముద్ర, కొబ్బరికాయ, స్వామి వారికి సమర్పించే వస్తువులను ఉంచుతారు. కొబ్బరికాయను నేతితో నింపుతారు. ఈ నెయ్యి జ్ఞానానికి ప్రతీకగా చెబుతారు. కొబ్బరికాయకు బిగించే కార్క్‌ను వైరాగ్యానికి చిహ్నంగా భావించి మూతపెడతారు. 

ఆ పైన కాయకు ఆత్మ అనే లక్కతో సీలు వేస్తారు. ఈ జ్ఞానం అనే నెయ్యితోనే స్వామి అయ్యప్పకు అభిషేకం చేస్తారు. మనలోని జ్ఞానాన్ని సంపూర్ణంగా స్వామి అయ్యప్పకు నిండు మనస్సుతో అర్పించుకున్నట్లుగా భావించడమే అర్థం. దీన్నే ఆత్మ నివేదన అంటారు. స్వామి అయ్యప్ప దీక్షలో పరమార్థం కూడా ఇదే. నేను అనే అహంభావంతో ఉన్న దేహం నుంచి జ్ఞానాన్ని వేరు చేసి దాన్ని అయ్యప్పకు కైంకర్యం చేయడంతో దేహంలోని అనేకానేక సందేహాలు పటాపంచలైపోతాయి. ఓ దివ్య జ్యోతి దర్శనమవుతుంది. దానినే మకరజ్యోతిగా భావించాలి.

ఆద్యంతం భక్తిపారవశ్యమే..
శబరిమలై యాత్ర ఆధ్యంతం భక్తి పారవశ్యమే. భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయం నుంచి ఇరుముడి కట్టుకుని బృందంతో బయలుదేరుతారు. మొదటగా వావర్‌స్వామి కొలువై ఉన్న ఎరిమేలికి చేరుకుంటారు. అక్కడ పేటతుళ్లి ఆడి వావర్‌స్వామిని, పేటశాస్త్రిలను దర్శించుకుని పంబకు బయలుదేరుతారు. పంబానదిలో పుణ్యస్నానాన్ని ఆచరించి సన్నిధానంకు ఇరుముడిని మోసుకుంటూ స్వామియే శరణమయ్యప్ప అంటూ బయలుదేరుతారు. కొండ అంచున ఉన్న అప్పాచిమేడు చేరుకుంటారు. అక్కడి నుంచి కొంత దూరం ప్రయాణిస్తే బహిరంగ ప్రదేశంలో శబరిపీఠం కనిపిస్తుంది. పంబానదికి సన్నిధానానికి మధ్య ఉన్న శరంగుత్తిఆల్‌కు చేరుకుంటారు. అక్కడ కన్నెస్వాములు శరంపుల్లలను ఉంచుతారు. అనంతరం స్వామి వారిని సన్నిధానానికి చేరుకుంటారు.

పవిత్రమైన పదునెట్టాంబడి..
స్వామి సన్నిధానంలో ఉండే 18 పడిమెట్లను అవతార పురుషుడైన పరుశురాముడు నిర్మించాడని చెప్పుకుంటారు. అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నైరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశాన్యుడు, రెండు యోగములైన కర్మయోగం, జ్ఞానయోగంతో పాటు విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానానికి రూపాలుగా ఈ 18 మెట్లను ఏర్పరిచారు. సన్నిధానం చేరిన భక్తులు 18 మెట్లు ఎక్కే ముందు కొబ్బరికాయను కొట్టి ఎక్కవలెను. స్వామి వారి దర్శనార్థం ఇరుముడిని గురుస్వామి సాయంతో విప్పవలెను. అందులో ఉన్న నెయ్యిని అయ్యప్పకు అభిషేకాన్ని చేస్తారు. అనంతరం మాలిగైపుత్రమ్మ వారి సన్నిధికి చేరుకుని ఆమె చుట్టూ కొబ్బరికాయలను దొర్లించి పసుపు, జాకెట్‌ ముక్కలను ఆమెకు మొక్కుగా చెల్లించుకుంటారు.

అద్వైత మలై..
అయ్యప్ప అవతారంలోనే ఒక విశిష్టత ఉంది. హరిహరసుతుడు, శ్రీమన్నారాయణుడు మోహినీ అవతారంలో ఉండగా శివకేశవులకు జన్మించినవాడే అయ్యప్ప. అందుకే ఈ పుణ్యక్షేత్రంలో హరిహర భేదం లేదు. అద్వైతానికి నిలువెత్తు నిదర్శనం శబరిమలై కొండ. కలియుగంలో ప్రత్యక్షదైవం తిరుమలవెంకటేశ్వరస్వామి తరువాత అంతటి ప్రాచుర్యం పొందిన దైవం అయ్యప్పస్వామి. అయ్యప్ప దీక్షలోని కఠోర నియమాలు, చిత్తశుద్ధి, గురుభక్తి, ఆత్మనివేదన ఈ దీక్షలోని ప్రత్యేకతలు. 

మండల కాలం (41రోజులు) ఈ దీక్ష కొనసాగుతుంది. 18 మెట్లను ఎక్కి స్వామి వారిని దర్శించుకోవడంతో దీక్ష ముగుస్తుంది. కఠోర దీక్ష ముగియగానే కలిగే మానసిక ఆనందం అంతా ఇంతా కాదు. మళ్లీ ఎప్పుడు దీక్ష చేపడదామా, మళ్లీ అయ్యప్పను కనులారా చూస్తామా అంటూ పరితపిస్తుంటారు భక్తులు. ఈ యేడాది నవంబర్‌ 16 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 3వ తేది వరకు మండల దర్శనం, జనవరి 10 నుంచి మకర సంక్రాంతి వరకు మకరజ్యోతి దర్శనంగా పరిగణిస్తారు. 

మరిన్ని వార్తలు