జైహింద్‌ స్పెషల్‌: కోటప్పకొండ దొమ్మీ

15 Jul, 2022 13:54 IST|Sakshi
చిన్నపరెడ్డి ఊహాచిత్రం

కోటప్పకొండ తిరునాళ్లకు పయనమయే టప్పటికి పరిస్థితి కొంత అనుమానంగా కనిపించింది. ప్రమాదాన్ని శంకించిన సన్నిహితులు ఎంతగానో నచ్చజెప్పారు. తగ్గేదే లేదంటూ చిన్నపరెడ్డి కోటప్పకొండ తిరునాళ్లకు ప్రభను కట్టాడు. తర్వాత ఏం జరిగింది?

గుంటూరుజిల్లా తెనాలి డివిజనులోని మండల కేంద్రం చేబ్రోలు శివారు కొత్తరెడ్డిపాలెం.. చిన్నపరెడ్డి స్వస్థలం. 1864లో జన్మించాడు. అప్పట్లో బ్రిటిష్‌ పాలకులు పన్నులు కఠినంగా వసూలుచేసేవారు. కరువు రోజుల్లో గ్రామంలో  ఉండే రైతుకూలీలు, బీదాబిక్కీ ఆకలి బాధలు పడుతుండేవారు. వీరికోసం ధాన్యం కొల్లగొట్టేందుకు చిన్నపరెడ్డి జంకేవాడు కాదు. సమీప గ్రామాల్లోని రైతులను కలసి, తాను అడిగిన ధరకు ధాన్యం ఇవ్వమని కోరేవాడు. అందుకు నిరాకరిస్తే రాత్రికి రాత్రే పొల్లాల్లోని ధాన్యం కుప్పలను నూర్చుకు వచ్చేవాడు. అలా రెడ్డిపాలెం ‘రాబిన్‌హుడ్‌’గా ప్రసిద్ధుడయ్యాడు. భారత స్వాతంత్య్రోద్యమానికి ఒక దివిటీ అయ్యాడు. బ్రిటిష్‌ పాలకులకు విరోధి అయ్యాడు.

చదవండి: జైహింద్‌ స్పెషల్‌: సైసైరా చిన్నపరెడ్డీ.. నీ పేరు బంగరు కడ్డీ

ఎప్పుడూ ముందువరుసే
మహాశివరాత్రికి కోటప్పకొండ తిరునాళ్లకు 60 అడుగుల ప్రభను సిద్ధంచేసి తీసుకెళ్లటం శివభక్తుడైన  చిన్నపరెడ్డికి ఆనవాయితీ. నందీశ్వరుడికి ప్రతిరూపంగా శివలింగాలు దివ్యతేజస్సుతో ఆరు రాతిచక్రాల ప్రభను అలంకరించేవారు. ప్రభతో అరవైమంది ఆహారధాన్యాలు, వంటకాలతో నడచివెళ్లేవారు. కోటప్పకొండ ప్రాంతం అప్పట్లో రెడ్డిరాజుల పాలనలో ఉండేది. దీనితో రెడ్డిపాలెం నుంచి వెళ్లిన  చిన్నపరెడ్డి ప్రభకు ముందువరుసలో స్థానం కల్పించేవారు. గుర్రంతో సహా ఏటా కోటప్పకొండకు వెళ్లటం చిన్నపరెడ్డికి అలవాటు. ఏనుగులబాట నుంచి గుర్రంపైనే కొండపైకి నేరుగా వెళ్లేవాడు. స్వామివారికి పూజలు జరిపించి వచ్చేవాడు.

ఎడ్లు అడ్డుకున్నాయి!
1909 ఫిబ్రవరి 18న మళ్లీ కోటప్పకొండ తిరునాళ్లకు పయనమయేటప్పటికి పరిస్థితి కొంత అనుమానంగా కనిపించింది. ప్రమాదాన్ని శంకించిన సన్నిహితులు ఎంతగానో నచ్చజెప్పారు. తగ్గేదే లేదంటూ చిన్నపరెడ్డి కోటప్పకొండ తిరునాళ్లకు ప్రభను కట్టాడు. అయిదు లక్షల జనం వచ్చిన ఆ తిరునాళ్లలో జనం రద్దీకి పోలీసులు లాఠీలు విసిరారు. ఎడ్లు బెదిరాయి. వారించిన చిన్నపరెడ్డిని పోలీసులు స్టేషనుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆయన స్వయంగా పెంచి మాలిమి చేసిన ఎడ్లు దీన్ని పసిగట్టి ఎదురుతిరిగి అదుపుతప్పాయి. పోలీసులు కాల్పులకు దిగి ఒకదానిని కాల్చిచంపారు.

ప్రజలు రెచ్చిపోవటానికి కారణం అదే అయింది. అంతకుముందు చిన్నపరెడ్డి అందించిన వందేమాతరం నినాదంతో పోలీసులను చితగ్గొట్టారు. ఈ గొడవంతటికీ కారణం చిన్నపరెడ్డేనని భావించిన పోలీసులు అతడిని అరెస్టుచేశారు. అక్కడే స్టేషనులో ఉంచారు. అతడిని  విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రజలు ఎగబడ్డారు. స్టేషను ముందున్న తాటాకు పందిరికి నిప్పంటించారు. నచ్చజెప్పేందుకు వచ్చి సత్రంలో ఉన్న డీఎస్పీని గాయపరిచారు. సబ్‌కలెక్టర్‌తో వచ్చిన దఫేదారును చితకబాదారు. సత్రానికి నిప్పంటించారు. సబ్‌కలెక్టర్, డీఎస్పీలు తప్పించుకున్నారు. ఈ రగడలో ఒక కానిస్టేబుల్, ఉప్పు శాఖకు చెందిన జవాను మరణించారు. జనసమూహంలో మొత్తం అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. 

ఉరిశిక్ష విధించిన ప్రభుత్వం
ఈ అల్లర్లకు చిన్నపరెడ్డి, అతడి అనుచరులు కారణమని నమ్మిన బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయనతోసహా వందమందిపై గుంటూరు అదనపు సెషన్స్‌ కోర్టులో కేసు (నెం.27/1909) నమోదు చేశారు. పోలీసుల గాలింపుకు దొరక్కుండా తన ఇంటిలోని భూగృహంలో దాక్కున్న చిన్నపరెడ్డిని అరెస్టు చేశారు. కేసు విచారణ తర్వాత 21 మందికి ఉరిశిక్ష, 24 మందికి వివిధ కఠిన కారాగారశిక్షలు విధిస్తూ ఐషర్‌ కార్షన్‌ అనే న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఏ తప్పూ చేయని వారిక్కూడా శిక్ష పడిందన్న భావనతో చిన్నపరెడ్డి మద్రాస్‌ హైకోర్టులో అప్పీలు చేశారు.

వాదిగా చిన్నపరెడ్డి, ప్రతివాదిగా బ్రిటిష్‌ చక్రవర్తిని చేర్చి 17/1910 విచారణ నంబరుగా ఇచ్చారు. హైకోర్టు న్యాయాధిపతులు మున్‌రో, శంకరన్‌ నాయర్‌లు విచారణ జరిపారు. 1910 ఆగస్టు 18న చిన్నపరెడ్డికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పుచెప్పారు. ముద్దాయిల తరపున న్యాయవాది ఎస్‌.స్వామినాధన్, ప్రభుత్వం తరపున టి.రిచ్‌మాండ్‌ వాదించారు. తర్వాత చిన్నపరెడ్డిని రాజమండ్రి తీసుకెళ్లి అక్టోబరులో ఉరితీశారు. కచ్చితమైన తేదీ తెలియరాలేదు. ఈ తీర్పును జీర్ణం చేసుకోలేని ప్రజలు గ్రామగ్రామాల్లో వందేమాతరం ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. చిన్నపరెడ్డి సాహసంపై బుర్రకథ, గేయాలు వచ్చాయి. స్వస్థలమైన చేబ్రోలు నుంచి 47 మంది స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. కోటప్పకొండ సంఘటన, చిన్నపరెడ్డి పోరాటపటిమ ఆనాటి స్వరాజ్య ఉద్యమానికి ఒక స్ఫూర్తిగా నిలిచినట్టు ఆంధ్రప్రదేశ్‌ తొలి స్పీకరు అయ్యదేవర కాళేశ్వరరావు, ఇతర ప్రముఖులు తమ రచనల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

ఇప్పటికీ ఆనవాయితీ
బ్రిటిష్‌ హయాంలో చిన్నపరెడ్డి కారణంగా కోటప్పకొండ తిరునాళ్లలో పోలీసుక్యాంపు ఏర్పాటుచేసి, జిల్లా ఎస్పీ, కలెక్టరు అక్కడే మకాం వేసేవారు. ఇదే ఆనవాయితీ ఇప్పటికీ కోటప్పకొండలో కొనసాగుతోంది. ఈ సంప్రదాయం రాష్ట్రంలో మరే ఇతర తిరునాళ్లలో లేదు. కోటప్పకొండలో చిన్నపరెడ్డి ప్రభను నిలిపి మకాం చేసిన ప్రాంతం, ఎడ్లపందాల్లో పాల్గొన్న స్థలం ఇప్పటికీ జిల్లాపరిషత్‌ ఆధీనంలోనే ఉంది.
 – బి.ఎల్‌.నారాయణ, సాక్షి, తెనాలి   

మరిన్ని వార్తలు