జాతీయ గీతం.. మదనపల్లె రాగం

6 Aug, 2022 16:27 IST|Sakshi
బీటీ కాలేజ్‌

బీటీ కళాశాల వేదికగా తొలిసారి జాతీయ గీతాలాపన

వారం రోజులు మదనపల్లెలోనే ఠాగూర్‌

విశ్వకవికి మదనపల్లెతో విడదీయరాని అనుబంధం

జనగణమన అధినాయక జయహే 
 భారత భాగ్య విధాతా! 
పంజాబ సింధు గుజరాత మరాఠా 
ద్రావిడ ఉత్కళ వంగ  
వింధ్య హిమాచల యమునా గంగ  
ఉచ్ఛల జలధితరంగ  
తవశుభనామే జాగే తవశుభ ఆశిషమాగే 
గాహే తవ జయ గాథా! 
జనగణ మంగళ దాయక జయహే  
భారత భాగ్య విధాతా! 
జయహే! జయహే!జయహే! 
జయ జయ జయ జయహే!
 

గురుదేవులు రవీంద్రనాథ్‌ఠాగూర్‌ బెంగాలీ భాషలో రచించిన ‘జనగణమన’ గీతాన్ని మదనపల్లెలో ఆంగ్లంలోకి అనువదించారు. అక్కడే ఆ గీతానికి రాగాలు కట్టారని చరిత్ర చెబుతోంది. మదనపల్లెకు..ఠాగూర్‌ గీతానికి ఏమిటీ సంబంధం.. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ను ఘనంగా నిర్వహించుకుంటున్న నేపథ్యంలో సాక్షి ప్రత్యేక కథనం..  

భావం: జనులందరి  మనస్సులకూ అధినేతవు. భారత భాగ్య విధాతవు అయిన నీకు జయమగుగాక. పంజాబు, సింధూ,  గుజరాత్, మహారాష్ట్ర, ద్రావిడ, ఉత్కళ, వంగదేశాలతోనూ ,వింధ్య, హిమాలయ పర్వతాలతోనూ, యమునా గంగా ప్రవాహాలతోనూ, ఉవ్వెత్తుగా లేచే సముద్ర తరంగాలతోనూ శోభించే ఓ భారతభాగ్య విధాతా! వాటికి నీ శుభనామం ఉద్బోధ కలిగిస్తుంది. అవి నీ 
ఆశీస్సులు అర్థిస్తాయి. నీ జయగాథల్ని గానం చేస్తాయి. సమస్త జనులకూ మంగళప్రదాతవు. భారత భాగ్యవిధాతవు అయిన నీకు జయమగు గాక! జయమగుగాక! జయమగుగాక ! 

మదనపల్లె సిటీ: అన్నమయ్య జిల్లా మదనపల్లెకు స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రత్యేక స్థానం ఉంది. ఐరిష్‌ వనిత డాక్టర్‌ అనిబిసెంట్‌ హోంరూల్‌ ఉద్యమం చేపట్టి బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. ఇందులో భాగంగా అదే సమయంలో మదనపల్లెలోని బీటీ కళాశాలను విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ సందర్శించి జాతీయగీతం జనగణమన(మార్నింగ్‌ సాంగ్‌ ఆఫ్‌ ఇండియా)ను  ఆంగ్లంలోకి అనువదించారు.  

 
బీటీ కాలేజిని సందర్శిస్తున్న రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

మదనపల్లెకు ఠాగూర్‌
తెలుగు ప్రాంతాలలో హోమ్‌రూల్‌ ఉద్యమం దివ్యజ్ఞాన సమాజం వ్యక్తుల చేయూతతో పుంజుకుంటున్న రోజులవి. హోమ్‌రూల్‌ ఉద్యమ వ్యాప్తికి ఆంధ్రతిలక్‌ గాడిచర్ల హరిసర్వోత్తమరావు చేసిన కృíషి విశేషమైనది. మదనపల్లెలోని బీ.టీ.కళాశాల విద్యార్థులు హోమ్‌రూల్‌ ఉద్యమానికి సంబంధించి కరపత్రాలు వివిధ ప్రాంతాల్లో పంపిణీ చేసి ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని పెంచేవారు. బ్రిటీష్‌ వారికిది నచ్చలేదు.పైగా వారికి  కంటగింపుగా మారింది. ఫలితంగా 1917 జూన్‌ 16న బీ.పీ.వాడియా, జీ.ఎస్‌.ఆరండేల్‌తో కలిసి అనిబిసెంట్‌ను అరెస్టు చేశారు. ఈ సమయంలో బీటీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించారు. బీ.టీ. కళాశాల వేదికగా అనేక కార్యక్రమాలు జరిగాయి. దీంతో కళాశాల ఉద్యమానికి  కేంద్ర బిందువుగా  మారింది. 1917 సెప్టెంబర్‌లో అనిబిసెంట్, ఆమె సహచరులు కారాగారం నుంచి విముక్తులయ్యారు. అదే సమయంలో బీటీ కళాశాలకు మద్రాసు విశ్వవిద్యాలయం గుర్తింపును రద్దు చేసింది. అయితే అప్పట్లో నేషనల్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌గా ఉన్న  రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ గుర్తింపు ఇవ్వడంతో బీటీ కళాశాల యధావిధిగా నడిచింది. దక్షిణ భారతదేశ పర్యటనకు వచ్చిన ఠాగూర్‌ అప్పట్లో బీటీ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉండే ఐరిష్‌ జాతీయుడైన ప్రముఖ విద్యావేత్త జేమ్స్‌ హెన్రీ కజిన్స్‌ ఆహ్వానం మేరకు మదనపల్లెకు వచ్చారు. 


ఠాగూర్‌ రాసిన జనగణమన గీతం తర్జుమా

విశ్వకవి గీతాలాపన
విశ్వకవి రవీంద్రుడు 1919 ఫిబ్రవరి 25న మదనపల్లెకు వచ్చారు. ఇక్కడి వాతావరణం ఆయనకు ఎంతోగానో నచ్చడంతో వారం రోజుల పాటు మార్చి 2 వరకు కాలేజీ ఆవరణంలోని కాటేజీలో బస చేశారు. అదే సమయంలో బెంగాలీ భాషలో ఉన్న మన జాతీయగీతం జనగణమనను ఆంగ్లంలోకి అనువదించారు. అప్పట్లో బీటీ కళాశాల ప్రిన్సిపల్‌గా ఉన్న  జేమ్స్‌ హెన్రీ కజిన్స్‌ భార్య మార్గరేట్‌ కజిన్స్‌ సంగీత ఉపాధ్యాయురాలిగా పనిచేసేవారు. ఠాగూర్‌ అనువదించిన జనగణమన గీతాన్ని మార్గరేట్‌ కజిన్స్‌ బాణి సమకూర్చి విద్యార్థులతో కలిసి ఫిబ్రవరి 28న స్వయంగా ఆలపించారు. నాటి బీటీ కళాశాలలో విద్యార్థుల ఆలాపనతో ప్రారంభమైన జాతీయగీతం నేడు దేశ, విదేశాల్లో ఉన్న ప్రతి భారతీయుడి నరనరాల్లో జీర్ణించుకుపోయింది. 1950 జనవరి 24న జనగణమనను భారత ప్రభుత్వం అధికారికంగా జాతీయ గీతంగా ప్రకటించింది. జాతీయగీతం భారతీయులు పలికినంతకాలం చరిత్రపుటల్లో మదనపల్లె చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ గీతాన్ని ఠాగూర్‌ తన స్వదస్తూరితో రాయడంతో పాటు చివరలో కింది భాగాన మార్నింగ్‌ సాంగ్‌ ఆఫ్‌ ఇండియా అని రాసి సంతకం చేశారు.   

మరిన్ని వార్తలు