జీతాలపై దుష్ప్రచారం చేస్తున్నారు

11 Mar, 2023 03:52 IST|Sakshi

నెలాఖరులోగా పెండింగ్‌ బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం అంగీకరించింది

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలి 

ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌రెడ్డి 

సాక్షి, అమరావతి: వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఉద్యోగుల జీతాల విషయంలో ప్రభు­త్వంపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. సచివాల­యం­లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చాక అదనంగా రెండున్నర లక్షలమందికిపైగా ఉద్యో­గాలు ఇచ్చిందని, వారంతా ప్రభుత్వంలో కొత్తగా చేరిన విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు.

ఆర్టీసీ   విలీనం వల్ల వారు ప్రభుత్వ ఉద్యోగులయ్యారని, గ్రామ సచివాలయ సిబ్బంది, వైద్య ఆరోగ్యశాఖ పెద్ద ఎత్తున ఉద్యో­గులను నియమించాయని, వీటివల్ల జీతాల భారం పెరి­గిందని వివరించారు. ప్రభుత్వ సొంత ఆదా­యం ఏడాదికి రూ.1.25 లక్షల కోట్ల మేర వస్తుంటే, రూ.90 వేల కోట్లు జీతాలకే సరిపోతోందని చెప్పారు. సీపీఎస్‌ రద్దు అంశాన్ని ప్రభుత్వం సాను­కూ­లంగా పరిశీలిస్తోందన్నారు.

ఈ నెలాఖరులోగా ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులు రూ.3 వేల కోట్లకుపైగా చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. పీఆర్సీ బకాయిల చెల్లింపులపై ఈ నెల 16వ తేదీన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంక­టేశ్వర్లు మంత్రివర్గ ఉపసంఘంతో జరిగిన చర్చల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. కానీ బయటకు వెళ్లాక ఉద్యమాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారో తెలి­య­డం లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు