నకిలీ పట్టాలు, భూ ఆక్రమణలపై ప్రభుత్వం కొరడా

20 May, 2022 20:11 IST|Sakshi

బద్వేలు ప్రాంతంలో అక్రమాలపై ఆరోపణలు

ఎవరినీ ఉపేక్షించవద్దంటున్న సీఎం

వెంటనే స్పందించిన కలెక్టర్, ఎస్పీ

బద్వేలు ఆర్డీఓ ఆధ్వర్యంలో విచారణ

18 మందిపై కేసులు నమోదు

సాక్షి ప్రతినిధి, కడప : భూ దందాలతోపాటు పలు అక్రమాలపై వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. నకిలీ పట్టాలు, భూ ఆక్రమణలతో కొందరు అక్రమార్కులు బద్వేలు ప్రాంతంలో అలజడులు సృష్టిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాలు ప్రభుత్వం దృష్టికి చేరడంతో పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారెవరినీ వదిలి పెట్టవద్దంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు, ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌లను ఆదేశించారు. తన, పర తారమత్యం లేకుండా అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం తేల్చి చెప్పారు. సీఎంఓ నుంచి ఆదేశాలు అందుకున్న బద్వేలు ఆర్డీఓ ఆకుల వెంకట రమణ స్పందించారు. లోతైన విచారణకు దిగారు. బాధితులు తన వద్దకు రావాలంటూ ప్రకటించారు. దీంతో కొందరు బాధితులు తమ స్థలాలు, భూములను ఆక్రమించిన వారి వివరాలను ఆర్డీఓ, కలెక్టర్లకు అందజేశారు. వీటిపై ఆర్డీఓ లోతైన విచారణ చేపట్టారు. 

నకిలీ సీళ్లు, బోగస్‌ సంతకాలతో కొందరు నకిలీ పట్టాలు సృష్టించి పేదల స్థలాలు, భూములను ఆక్రమిస్తున్న విషయం ఆయన దృష్టికి వచ్చింది. అటువంటి వారి జాబితాను సిద్ధ చేసుకున్న ఆర్డీఓ బద్వేలు ప్రాంతంలో పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు నకిలీ పట్టాలు, సీళ్లు, ఇతర సామగ్రి దొరికింది. దీంతో ప్రాథమికంగా 18 మందిపై కేసులు నమోదు చేశారు. సీపీఐ, టీడీపీ, ప్రజా సంఘాలు, అధికార పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు సైతం ఈ వ్యవహారంలో ఉన్నట్లు బట్టబయలైంది. బుధవారం నాటికి వీరిలో 8 మందిని అరెస్టు చేశారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. విచారణ కొనసాగుతోంది. ఇంకొందరిపైన కేసులు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. బద్వేలుతోపాటు పోరుమామిళ్ల, కాశినాయన, కలసపాడు, గోపవరం, అట్లూరు ప్రాంతాల్లోనూ ఈ తరహా అక్రమాలపై ఆర్డీఓ లోతైన విచారణ చేపట్టారు. 

ఆర్మీ వారి పేర్లతో బోగస్‌ ఐడీలు 
కొందరు ఆర్మీలో ఉన్న వారి పేర్లతో బోగస్‌ ఐడీలు సృష్టించి కొత్త తరహా అక్రమాలకు తెరలేపారు. ఆక్రమించిన స్థలాలు, భూములు పది సంవత్సరాల క్రితమే సైనికుల పేరున పట్టాలు చేయించుకున్నట్లు రికార్డులు మార్చి ఎన్‌ఓసీల ద్వారా వాటిని వెంచర్లు వేసి కొందరు అమ్మకాలకు పెట్టగా, మరికొందరు వందలాది ఎకరాల భూములను సైనికుల పేరున మార్చి వేరొకరికి కోట్లాది రూపాయలకు అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. పోరుమామిళ్ల, కలసపాడు, కాశినాయన ప్రాంతాలతోపాటు బద్వేలు, గోవపరంలోనూ ఈ తరహా అక్రమాలు జరిగినట్లు ఆర్డీఓ, కలెక్టర్ల దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ చేపట్టారు. వీటితోపాటు వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారి వివరాలను వెలికి తీస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో గత ప్రభుత్వంలోనే పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు జరిగినట్లు విచారణలో బయటపడుతోంది. 
     
డీకేటీల అమ్మకాలు సహించం 
డీకేటీ స్థలాలు, భూముల కొనుగోళ్లు, అమ్మకాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు, బద్వేలు ఆర్డీఓ ఆకుల వెంకట రమణలు ఇప్పటికే ప్రకటించారు. ల్యాండ్‌ కన్వర్షన్‌ లేకుండా ప్లాట్ల అమ్మకాలకు సిద్ధం చేసిన పలు వెంచర్లను ఇప్పటికే నిలిపివేశారు. వ్యవసాయానికి ఇచ్చిన భూమిని ఎట్టి పరిస్థితుల్లో ప్లాట్ల అమ్మకాలకు అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. అలా చేయాలనుకుంటే ల్యాండ్‌ కన్వర్షన్‌ (భూ బదలాయింపు) తప్పనిసరి అని స్పష్టం చేశారు. 
     
బాధితులు, ప్రజల హర్షం 
భూ ఆక్రమణలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించడం, అందుకు కారకులైన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడంపై బాధితులు, జిల్లా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్‌ ప్రభుత్వం తన, పర అన్న బే«ధం లేకుండా నిస్పాక్షికంగా వ్యవహరించడాన్ని అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారు. 

అక్రమాల్లో ఇంటి దొంగలు 
బద్వేలుతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో జరిగిన భూ దందాల్లో ఇంటి దొంగల పాత్ర కీలకంగా ఉన్నట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. బద్వేలు అక్రమాల్లో కీలకపాత్ర పోషించిన ఇద్దరు వీఆర్వోలపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు. వీరు కాకుండా ముగ్గురు తహసీల్దార్లు, ఇద్దరు జూనియర్‌ అసిస్టెంట్లు, ఇద్దరు ఆర్‌ఐలు, ఓ ఆర్డీఓ స్థాయి అదికారి సైతం గతంలో జరిగిన భూ ఆక్రమణలు, నకిలీ పట్టాల వ్యవహారంలో కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరి జాబితాను జిల్లా అధికారులు సిద్ధం చేశారు. త్వరలోనే వీరిపై కేసులు నమోదు చేయబోతున్నారు. 

పేదలకు అన్యాయం జరగనివ్వం 
బద్వేలు నియోజకవర్గంలో అర్హులైన పేదలకు అన్యాయం జరగనివ్వం. కొందరు అక్రమార్కులు నకిలీ సీళ్లు, ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు సృష్టించి పేదల స్థలాలు, భూములను దౌర్జన్యకరంగా ఆక్రమించారు. ఇలాంటి చర్యలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయి. ప్రభుత్వ ఆదేశాలతో నియోజకవర్గంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టాం. ఇప్పటికే చాలామందిపై కేసులు పెట్టి అరెస్టులు చేశాం. మరికొంతమందిపైన కేసులు పెట్టబోతున్నాం. నియోజకవర్గంలో ఏ ఒక్కరికీ అన్యాయం జరిగినా నా దృష్టికి తీసుకు రండి...కచ్చితంగా వారికి న్యాయం జరిగేలా చూస్తా. 
– ఆకుల వెంకట రమణ, ఆర్డీఓ, బద్వేలు  

మరిన్ని వార్తలు