అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ప్రజల్లో తిరగనివ్వం

28 Nov, 2020 04:43 IST|Sakshi
అంబేడ్కర్, పూలే చిత్రపటాలతో నిరసన తెలియజేస్తున్న బహుజన పరిరక్షణ సమితి నాయకులు, మహిళలు

చంద్రబాబుకు బహుజన పరిరక్షణ సమితి నాయకుల హెచ్చరిక

తాడికొండ: అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే చంద్రబాబును ప్రజల్లో తిరగనివ్వబోమని బహుజన పరిరక్షణ సమితి నాయకులు హెచ్చరించారు. మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న 59వ రోజు దీక్షలో శుక్రవారం పలువురు నాయకులు పాల్గొని ప్రసంగించారు.

అభివృద్ధి వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలకూ న్యాయం జరుగుతుందని, బాబు బినామీల రాజధానిని అభివృద్ధి చేస్తే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ తరతరాల బానిసత్వం తప్పదన్నారు. అమరావతి పేరిట  జరిగిన భూ కుంభకోణంపై పూర్తిస్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్‌ 25న పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో 55 వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలా కోర్టులు సహకరించాలన్నారు.  

దీక్షా శిబిరంలో మహిళలకు సీఎం జగన్‌ అభివాదం
కేబినెట్‌ భేటీకి వెళ్తూ సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో మూడు రాజధానులకు మద్దతుగా కొనసాగుతున్న బహుజన పరిరక్షణ సమితి దీక్షల వద్ద సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిరునవ్వుతో అభివాదం చేస్తూ వెళ్లారు. ఈ సందర్భంగా మహిళలు, దళిత సంఘాల నాయకులు రోడ్డు పక్కన నిలబడి మూడు రాజధానులకు మద్దతుగా నినాదాలు చేశారు.  

మరిన్ని వార్తలు